అంతర్జాతీయ వార్తలు

13 ఏళ్ల కింద బైడెన్‌ను రక్షించాడు.. ఇప్పుడు తనను రక్షించమని వేడుకుంటున్నాడు!

వాషింగ్టన్‌ : ఆ వ్యక్తి ఇప్పుడు అగ్రరాజ్యానికి అధ్యక్షుడిగా ఉన్న జో బైడెన్‌ను ఒకప్పుడు రక్షించాడు. కానీ ఇప్పుడు తననే రక్షించమని వేడుకుంటున్నాడు. ఇంతకీ ఎవరా వ్యక్తి? బైడెన్‌కూ, అతనికీ ఉన్న లింకేంటి? అతనికి వైట్‌హౌజ్ ఇచ్చిన సమాధానం ఏంటి? ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం.

బైడెన్‌కే మెసేజ్‌

అమెరికా అధ్యక్షుడు అంటే ప్రపంచానికే పెద్దన్న. అలాంటి వ్యక్తి దరిదాపుల్లోకి వెళ్లడం కూడా సామాన్యుడికి సాధ్యం కాదు. కానీ ఆఫ్ఘనిస్థాన్‌లోని ఈ వ్యక్తి మాత్రం ఏకంగా బైడెన్‌కే తనను రక్షించండంటూ సందేశం పంపించాడు. ఆ వ్యక్తి పేరు మహ్మద్‌. ఆఫ్ఘనిస్థాన్‌లో ఉంటాడు. ఇప్పటికే అమెరికా దళాలు ఆ దేశాన్ని ఖాళీ చేసి వెళ్లిపోవడంతో అక్కడే ఉండిపోయిన మహ్మద్‌.. నన్ను మరచిపోకండి.. నన్ను, నా కుటుంబాన్ని రక్షించమని వేడుకుంటున్నాడు. తాలిబన్లు తనపై ఎప్పుడు విరుచుకుపడతారో తెలియక భార్య, నలుగురు పిల్లలతో కలిసి బిక్కుబిక్కుమంటూ ఆఫ్ఘన్‌లో కాలం గడుపుతున్నాడు.

వైట్‌హౌజ్ రియాక్షన్ ఇదీ..

ఒకప్పుడు బైడెన్‌ను రక్షించిన మహ్మద్ సందేశానికి వైట్‌హౌజ్ సానుకూలంగా స్పందించింది. నిన్ను, నీ కుటుంబాన్ని కచ్చితంగా ఆఫ్ఘనిస్థాన్ నుంచి తరలిస్తామని అతనికి సందేశం పంపించింది. మిమ్మల్ని కచ్చితంగా అక్కడి నుంచి తరలిస్తాం. మీ సేవలను గౌరవిస్తాం. మేము దానికి కట్టుబడి ఉన్నాం అని వైట్‌హౌజ్ ప్రెస్ సెక్రటరీ జెన్ సాకి చెప్పారు. ఓ సామాన్య ఆఫ్ఘన్ వ్యక్తి పంపిన సందేశానికి వైట్‌హౌజ్ ఇంత వేగంగా స్పందించడానికి కారణం ఏంటి? అసలు 13 ఏళ్ల కిందట ఏం జరిగింది?

బైడెన్‌ను రక్షించిన మహ్మద్‌

13 ఏళ్ల కిందట డెలవేర్‌ సెనేటర్‌గా ఉన్న జో బైడెన్‌, ఇతర ప్రతినిధులు ఆఫ్ఘనిస్థాన్ వెళ్లారు. ఆ సమయంలో ఈ మహ్మద్ అమెరికా మిలిటరీకి దుబాసిగా వ్యవహరిస్తున్నాడు. మంచు తుఫానులో చిక్కుకొని కనిపించకుండా పోయిన రెండు బ్లాక్ హాక్ హెలికాప్టర్ల కోసం వెతుక్కుంటూ వెళ్లిన అమెరికా దళాల వెనుక మహ్మద్ కూడా ఉన్నాడు. ఆ రెండు హెలికాప్టర్లలో బైడెన్‌తోపాటు పలువురు ఇతర చట్టసభ ప్రతినిధులు ఉన్నారు. ఆ రెండు హెలికాప్టర్లు ఓ మారుమూల ఆఫ్ఘన్ లోయలో ఎమర్జెన్సీ ల్యాండయ్యాయి.

30 గంటల పాటు తుఫానులోనే..

ఆ సమయంలో బర్‌గ్రామ్ ఎయిర్‌ఫీల్డ్‌లో ఉన్న మహ్మద్‌.. అమెరికా దళాలతో కలిసి హెలికాప్టర్లను వెతకడానికి వెళ్లాడు. హెలికాప్టర్‌లను గుర్తించిన తర్వాత ఇతర ఆఫ్ఘన్ ఆర్మీ జవాన్లతో కలిసి వాటికి రక్షణగా నిలిచాడు. అలా 30 గంటలపాటు గడ్డ కట్టించే చలిలో మహ్మద్‌.. బైడెన్‌తోపాటు ఇతర ప్రతినిధులకు సహాయంగా ఉన్నాడు. ఆ తర్వాత అమెరికా బలగాలు బైడెన్ ఉన్న హెలికాప్టర్‌ను సురక్షితంగా అక్కడి నుంచి తరలించాయి.

ఆ మేలు మరచిపోం..

ఇప్పుడు 13 ఏళ్ల తర్వాత తనను కాపాడాలని వేడుకుంటున్న మహ్మద్‌కు కచ్చితంగా సాయం చేస్తామని వైట్‌హౌజ్ స్పష్టం చేసింది. ఈ 20 ఏళ్లలో అమెరికా తరఫున నిలిచిన మహ్మద్‌కు కృతజ్ఞతలు అని సాకి అన్నారు. ఆ మంచు తుఫాను నుంచి వాళ్లందరినీ రక్షించినందుకు కృతజ్ఞతలు. అందుకే అమెరికన్లకే కాదు మా తరఫున నిలిచిన ఆఫ్ఘన్ పార్ట్‌నర్‌లను కూడా ఆదుకుంటాం అని సాకి చెప్పారు. ఇప్పటికే బైడెన్ ప్రభుత్వం లక్షా 23 వేల మందిని ఆఫ్ఘనిస్థాన్ నుంచి తరలించిన విషయం తెలిసిందే. అందులో ఎంతోమంది ఆఫ్ఘన్ ట్రాన్స్‌లేటర్లు, దుబాసీలు ఉన్నారు.

Leave a Reply