ఆంధ్రప్రదేశ్

దుర్గాష్టమి అంటే ఏమిటి.. దుర్గామాతను ఎందుకు పూజిస్తారు?

విశాఖపట్నం : దుర్గాదేవి ‘లోహుడు’ అనే రాక్షసుని వధిస్తే లోహం పుట్టిందని, అందువల్ల లోహపరికరాలని పూజించే ఆనవాయితి వచ్చింది అని మన పురాణాలు చెబుతున్నాయి. ఇక దుర్గ అంటే? దుర్గమైనది దుర్గ. దుర్గతులను తొలగించేది దుర్గ. ఈమె దుర్గేయురాలు కనుక దుర్గమాతగా ప్రసిద్ధిగాంచింది.

దుర్గలోని ‘దుర్’ అంటే దుఃఖం, దుర్భిక్షం, దుర్వ్యసనం, దారిద్ర్యం మొదలైనవి. ‘గ’ అంటే నశింపచేసేది అని దైవజ్ఞులు వివరణ ఇచ్చారు. అలాంటి దుర్గామాతను ఆరాధించడం వల్ల దుష్టశక్తులు, భూత, ప్రేత, పిశాచ, రక్కసుల బాధలు దరిచేరవు, చేరలేవు.

అందువల్లనే మొదటి మూడు రోజులు దుర్గారూపాన్ని ఆరాధించి అరిషడ్వర్గాలను, తదుపరి మూడురోజులు లక్ష్మిరూపాన్ని ఆరాధించి సిరిసంపదలను, చివరి మూడురోజులు సరస్వతిరూపాన్ని ఆరాధించి జ్ఞానాన్ని, ఆక్రమంలో ఈ నవరాత్రులలో ఆతల్లిని ఆరాధించి తగు ఫలితాలు పొందవచ్చునని పెద్దలు చెప్తుంటారు.

ఈరోజు దుర్గసహస్రనామ పారాయణము, ‘దుం’ అను బీజాక్షరముతో కలిపి దుర్గాదేవిని పూజిస్తారు. “ఈ దుర్గాష్టమి మంగళవారంతో కలిసిన మరింత శ్రేష్టము” అని అంటారు.
మహర్నవమి అంటే..

మానవకోటిని పునీతులను చేయుటకు భగీరదుడు గంగను భువినుండి దివికి తెచ్చినది ఈనాడే. ఇక ఈ నవరాత్రి దీక్షలో అతి ముఖ్యమైనదిగా ఈ నవమి తిధిని గూర్చి చెప్పుటలో ఆంతర్యం ఈ తొమ్మిదవ రోజు మంత్ర సిద్ది కలుగును. కావున ‘సిద్ధదా’ అని నవమికి పేరు.

దేవి ఉపాసకులు అంతవరకు వారు చేసిన జపసంఖ్య ఆధారంగా హోమాలుచేస్తూ ఉంటారు. అలా వ్రతసమాప్తి గావించిన వారికి సర్వసిద్ధుల సర్వాభీష్ట సంసిద్ధి కలుగును. ఇక క్షత్రియులు , కార్మికులు , వాహన యజమానులు , ఇతర కులవృత్తులవారు అందరూ ఆయుధపూజ నిర్వహిస్తారు.
విజయదశమి..

దేవదానవులు పాలసముద్రమును మధించినప్పుడు అమృతం జనించిన శుభముహూర్తదినం ఈ విజయదశమి రోజే అని తెలియజేయబడింది. ‘శ్రవణా’ నక్షత్రంతో కలసిన ఆశ్వీయుజ దశమికి ‘విజయా’ అనే సంకేతమున్నది. అందుకనే దీనికి ‘విజయదశమి’ అనుపేరు వచ్చినది.

ఏపనైనా తిథి, వారము, తారాబలము, గ్రహబలము, ముహూర్తము మున్నగునవి విచారించకుండా, విజయదశమినాడు చేపట్టినచో ఆ కార్యమున విజయము తథ్యం. ‘చతుర్వర్గ చింతామణి’ అనే ఉద్గ్రంధము ఆశ్వీయుజ శుక్ల దశమినాటి నక్షత్రోదయ వేళనే ‘విజయం’ అని తెలిపియున్నది. ఈ పవిత్ర సమయము సకల వాంచితార్ధ సాధకమైనదని గురువాక్యం.

‘శమీపూజ’ చేసుకునే ఈరోజు మరింత ముఖ్యమైనది. శమీవృక్షమంటే ‘జమ్మిచెట్టు’. అజ్ఞాతవాసమందున్న పాండవులు వారివారి ఆయుధములను, వస్త్రములను శమీవృక్షముపై దాచి వుంచారు. అజ్ఞాతవాసము పూర్తి అవగానే ఆ వృక్ష రూపమును పూజించి ప్రార్ధించి, తిరిగి ఆయుధాలను వస్త్రములను పొంది, శమీవృక్ష రుపమున ఉన్న ‘అపరాజితా’ దేవి ఆశీస్సులు పొంది, కౌరవులపై విజయం సాధించినారు.

శ్రీరాముడు ఈ విజయదశమి రోజున ఈ ‘అపరాజితా’ దేవిని పూజించి, రావణుని సహరించి, విజయము పొందినాడు. తెలంగాణా ప్రాంతమందు శమీపూజ అనంతరం ‘పాలపిట్ట’ను చూచే ఆచారం కూడా ఉన్నది. ఇలా అందరూ నవరాత్రులు జరుపుకుని , విజయదశమి రోజు సాయంత్రం నక్షత్ర దర్శన విజయ సమయాన శమీవృక్షం (జమ్మిచెట్టు) వద్దగల అపరాజితాదేవిని పూజించి ఈ క్రింద ఇచ్చిన శ్లోకం స్మరిస్తూ చెట్టుకు ప్రదక్షణలుచేస్తారు.

శ్లో” శమీ శమయతే పాపం శమీశతృ నివారిణీ|
అర్జునస్య ధనుర్థారీ రామస్య ప్రియదర్శినీ||

పైశ్లోకము వ్రాసుకున్న చీటీలు అందరూ ఆ చెట్టు కొమ్మలకు తగిలిస్తారు. ఇలా చేయుటవల్ల అమ్మవారి కృపతో పాటు, శనిదోష నివారణ కూడా జరుగుతుందని ప్రతీతి.

Leave a Reply