ఆంధ్రప్రదేశ్

రెడ్ బుక్‌లో ఆ పేజీ ఓపెన్ చేసే సమయం అసన్నమైందా? నెక్ట్స్ టార్గెట్ మాజీ మంత్రులేనా?

KPS డిజిటల్ మీడియా నెట్‌వర్క్, ఆంధ్రప్రదేశ్ :- ఏపీలో రెడ్ బుక్ పాలన సాగుతోందా.. రెడ్ బుక్ ఓపెన్ చేశారు సరే.. ఇప్పుడు ఏ పేజీ నెంబర్ పేర్లు బయటకు వస్తున్నాయి.. ఆ బుక్ లో మొత్తం ఎన్ని పేజీలు ఉన్నాయో, ఎవరెవరి పేర్లు ఉన్నాయో కానీ, ఇప్పుడు తెరిచిన పేజీ ఇదేనంటూ జోరుగా చర్చ సాగుతోంది. రెడ్ బుక్ దెబ్బకు వైసీపీ నేతల గుండెల్లో ధడేల్.. ధడేల్ మనే శబ్దం వినిపిస్తోందట.

జస్ట్ అలా పోలీస్ సైరన్ వినిపిస్తే చాలు.. రెడ్ బుక్ గుర్తొచ్చే రీతిలో ఉందట ఆ పార్టీ క్యాడర్ కి. ఇప్పుడు ఓపెన్ చేసిన పేజీలో అంతా ఆ పేర్లు ఉన్నాయా అంటూ పార్టీ క్యాడర్ వద్ద చర్చోపచర్చలు సాగుతున్నాయట. ఇంతకు రెడ్ బుక్ లో ఆ పేజీ వారిదేనా.. అందుకే అరెస్ట్ ల పర్వం సాగుతోందా? అసలు ఏం జరుగుతోంది?

ఇటీవల కుయ్.. కుయ్ అనే పోలీస్ సైరన్ పగటి పూట కంటే, రాత్రి వేళ ఎక్కువగా వినిపిస్తోందట ఏపీలో. దీనికి కారణం రెడ్ బుక్ లోని ఆ పేజీ ఓపెన్ చేయడమే అంటున్నారు వైసీపీ సోషల్ మీడియా వారియర్స్. మంత్రి నారా లోకేష్ పాదయాత్ర చేపట్టిన సమయంలో పార్టీ కార్యకర్తలను అక్రమంగా వేధించిన ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ ప్రకటించారు. వారి పేర్లు రెడ్ బుక్ లో తప్పక రాస్తానంటూ లోకేష్ హెచ్చరించారు.

ఇక అధికారంలోకి రాగానే, టీడీపీ నాయకులు నేరుగా రెడ్ బుక్ ఓపెన్ చేశారా లేదా అంటూ లోకేష్ ను పలుమార్లు ప్రశ్నించారు. చిట్టచివరకు లోకేష్ స్పందించి ఓపెన్ చేశా కానీ, చట్టప్రకారం చర్యలు ఉంటాయని, ఎవరినీ వదిలే ప్రసక్తే లేదంటూ చెప్పేశారు. అలా చెప్పిన కొద్దిరోజులకే మాజీ ఎంపీ నందిగం సురేష్ ను పోలీసులు హత్య కేసులో అరెస్ట్ చేశారు. నెక్స్ట్ ఎవరనుకుంటున్న తరుణంలో వైసీపీ సానుభూతి పరుడు, పలుమార్లు లోకేష్, పవన్ ను ఉద్దేశించి వివాదాస్పద కామెంట్స్ చేసిన బోరుగడ్డ అనిల్ ను ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇలా రెడ్ బుక్ ఫస్ట్ పేజీ ఓపెన్ కాగా, నెక్స్ట్ పేజీ వారిదే అనే రీతిలో ఇటీవల వైసీపీ సోషల్ మీడియా వారియర్స్ ఒక్కొక్కరిపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. అది కూడా హద్దులు దాటి ట్రోలింగ్స్ చేసిన బ్యాచ్ భరతం పడుతున్నారని, చట్టం తన పని తాను చేసుకుపోతుందంటూ టీడీపీ సోషల్ మీడియా సమర్ధించుకుంటోంది. కానీ వైసీపీ మాత్రం రెడ్ బుక్ పాలనలో భాగంగా కక్షపూరిత రాజకీయాలకు టీడీపీ పాల్పడుతోందని విమర్శిస్తోంది.

ఇలాంటి సమయంలోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురంలో మాట్లాడుతూ.. ఒకడు నన్ను చంపుతానని అన్నాడు.. మరొకడు నా పిల్లలను ట్రోలింగ్ చేశాడు.. ఇంకొకడు నేరుగా సీఎంనే చంపుతానన్నాడు.. ఎవరిని వదిలిపెట్టొద్దు. పోలీసులూ.. మీ డ్యూటీ మీరు చేయండి అంటూ హెచ్చరించారు. ఆల్ రెడీ పోలీసులు సోషల్ మీడియా ట్రోలర్స్ ను అరెస్ట్ చేసే పనిలో ఉండగా, పవన్ చేసిన కామెంట్స్ తో మరికొంత స్పీడ్ పెంచారని టాక్.

అంతేకాదు సోషల్ మీడియాపై ఓ కన్నేసి, హద్దులు దాటి ప్రవర్తించిన వారు ఎంతటి వారైనా వదిలిపెట్టకుండా, అరెస్ట్ చేసే రీతిలో పోలీస్ శాఖ రెడీ అవుతోందట. మరి రెడ్ బుక్ లో 2వపేజీ ట్రోలర్స్ దే అయితే, మూడవ పేజీలో బడా నేతల లిస్ట్ ఉన్నట్లు సోషల్ మీడియా కోడై కూస్తోంది. అందులో అవినీతికి పాల్పడ్డ మాజీ మంత్రుల లిస్ట్ ఉందంటూ ప్రచారం ఊపందుకుంది.

Leave a Reply