తెలంగాణ

న్యాయం చేస్తారా.. ఆత్మహత్య చేసుకోమంటారా?

తాండూరు(వికారాబాద్‌) : మండలంలోని కరన్‌కోట్‌ పోలీస్‌స్టేషన్‌ ఎదుట అక్కాచెల్లెళ్లు హల్‌చల్‌ చేశారు. ఆస్తి తగదాల నేపథ్యంలో సొంత తమ్ముడు వేధిస్తున్నాడని ఆత్మహత్య చేసుకుంటామని పోలీసుల ఎదుట వాపోయారు. కోత్లాపూర్‌కు చెందిన జగ్గమ్మ, రేణుక అక్క, చెల్లెళ్లు. నరేష్‌గౌడ్‌ వారి సోదరుడు. జగ్గమ్మ, రేణుక వివాహమైనా కోత్లాపూర్‌లోనే నివాసముంటున్నారు. ఈ నేపథ్యంలో వారి తమ్ముడు నరేష్‌గౌడ్‌ ఆస్తి విషయమై పలుమార్లు తమను కొట్టాడని అక్కాచెల్లెళ్లు ఆరోపిస్తున్నారు.

శనివారం జగ్గమ్మపై తమ్ముడు నరేష్‌ చేయిచేసుకోవడంతో ఆదివారం అక్క, చెల్లెలు ఇరువురు కరన్‌కోట్‌ పోలీస్‌ స్టేషన్‌కు వచ్చారు. తమ తమ్ముడు నరేష్‌ తరుచూ గొడవపెట్టుకొని మమ్మల్ని కొడుతున్నాడని పోలీస్‌స్టేషన్‌ ఎదుట వాపోయారు. పోలీసులు న్యాయం చేయకపోతే వెంటతెచ్చుకున్నపెట్రోల్‌ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. రూరల్‌ సీఐ జలంధర్‌రెడ్డి, ఎస్‌ఐ ఏడుకొండలు కల్పించుకోని నరేష్‌పై గతంలో కేసు నమోదు చేశామని ప్రస్తుతం మళ్లీ కేసు నమోదుచేస్తామని చెప్పడంతో అక్క, చెల్లెలు శాంతించారు.

Leave a Reply