క్రీడా వార్తలు

కోహ్లి విషయంలో మొయిన్‌ అలీ చరిత్ర; డకౌట్లలో రహానే చెత్త రికార్డు

లండన్‌ : టీమిండియా, ఇంగ్లండ్‌ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు ఆసక్తికరంగా మారింది. ఆటలో తొలి రెండు రోజులు ఇంగ్లండ్‌ ఆధిపత్యం ప్రదర్శించగా.. మూడు, నాలుగు రోజులు టీమిండియా ఆధిపత్యం కనబరిచింది. ఇక ఐదో రోజు ఇరు జట్లకు కీలకంగా మారింది. 368 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ వికెట్‌ నష్టపోకుండా 77 పరుగులు చేసింది. టీమిండియా విజయానికి పది వికెట్లు అవసరం కాగా.. ఇంగ్లండ్‌ గెలుపుకు 291 పరుగుల దూరంలో ఉంది. ఇక ఈ మ్యాచ్‌లో కొన్ని కొత్త రికార్డులు వచ్చి చేరాయి. ఒకసారి వాటిని పరిశీలిస్తే..

► విరాట్‌ కోహ్లిని ఔట్‌ చేయడం ద్వారా మొయిన్‌ అలీ కొత్త రికార్డు సాధించాడు. ఓవరాల్‌గా మొయిన్‌ అలీ అన్ని ఫార్మాట్లు కలిపి కోహ్లిని ఇప్పటివరకు 10 సార్లు ఔట్‌ చేశాడు. దీంతో కోహ్లిని ఎక్కువసార్లు ఔట్‌ చేసిన తొలి బౌలర్‌గా నిలిచాడు. అంతేకాదు టెస్టుల్లో ఆరుసార్లు కోహ్లిని అవుట్‌ చేశాడు. టెస్టుల్లో కోహ్లిని ఎక్కువసార్లు అవుట్‌ చేసిన జాబితాలో అలీ రెండో స్థానంలో ఉన్నాడు. జేమ్స్‌ అండర్సన్‌(ఇంగ్లండ్‌), నాథన్‌ లియాన్‌(ఆస్ట్రేలియా)లు కోహ్లిని ఏడేసి సార్లు ఔట్‌ చేసి తొలి స్థానంలో నిలిచారు.

► 21వ శతాబ్దంలో ఇంగ్లండ్‌ గడ్డపై టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 400కు పైగా పరుగులు చేయడం ఇది రెండోసారి మాత్రమే. ఇంతకముందు 2002లో నాటింగ్‌హమ్‌ టెస్టులో టీమిండియా 428 పరుగులు చేసింది.

► డకౌట్ల విషయంలో అజింక్యా రహానే చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. ఇంగ్లండ్‌ గడ్డపై మూడుసార్లు డకౌట్‌గా వెనుదిరిగిన తొలి భారత బ్యాట్స్‌మన్‌గా రహానే నిలిచాడు. 2014, 2018లో ఇదే ఓవల్‌ మైదానంలో రహానే రెండుసార్లు డకౌట్‌ అయ్యాడు.

► ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా గడ్డపై వెయ్యి పరుగులు సాధించిన మూడో ఆసియా ప్లేయర్‌గా కోహ్లి నిలిచాడు. ఇంతకముందు ఆసియా నుంచి సచిన్‌, ద్రవిడ్‌లు మాత్రమే ఉన్నారు.

Leave a Reply