శాకంబరీ ఉత్సవాలు ప్రారంభం.. దుర్గమ్మని దర్శించుకుంటున్న భక్తులు
KPS డిజిటల్ మీడియా నెట్‌వర్క్, విజయవాడ :- విజయవాడలోని ఇంద్రకీలాద్రి కనకదుర్గ అమ్మవారి ఆలయంలో శాకంబరీ ఉత్సవాలు (Shakambari festival Vijayawada) ఇవాళ(మంగళవారం) ఉదయం నుంచి ప్రారంభమయ్యాయి. ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో నిర్వహించే శాకంబరీ మహోత్సవాలు ఈరోజు(జులై 8) నుంచి 10వ తేదీ వరకు జరుగనున్నాయి. మూడు రోజుల పాటు శాకంబరీ ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు. శాకంబరీదేవి రూపంలో దుర్గమ్మని కూరగాయలతో విశేషంగా అలంకరించారు. భక్తులకు మూడు రోజుల పాటు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు.
రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. భక్తులు భారీగా తరలి వస్తుండటంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. దుర్గమ్మ దర్శనం కోసం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అమ్మవారికి విరాళంగా భక్తులు కూరగాయలు సమర్పిస్తున్నారు. ఆలయం పరిసర ప్రాంతాలను కూరగాయలతో దేవాలయ అధికారులు ప్రత్యేకంగా అలంకరించారు.
ఆలయంలో బ్రాహ్మణులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇవాళ ఉదయం 8:00లకు విఘ్నేశ్వరపూజ, రుత్విక్ వరుణం, పుణ్యాహవచనం, అఖండ దీపారాధన, అంకురార్పణ నిర్వహించనున్నారు. సాయంత్రం 4:00లకు కలశస్థాపన, అగ్నిప్రతిష్టాపన, మండపారాధన, హారతి, మంత్రపుష్పం, ప్రసాద వితరణ జరుగనుంది. ఈ ఉత్సవాల సందర్భంగా దుర్గమ్మ ఆలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు విజయవాడ పోలీసులు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆర్జిత సేవలకు ఆన్‌లైన్ బుకింగ్‌లో ఆలయ అధికారులు మార్పులు చేశారు.