జాతీయ వార్తలు

మారుతున్న బీజేపీ ధోరణి

ఢిల్లీ : కాలం ప్రకారం ఎవరైనా మారాల్సిందే. అంటే సిద్ధాంతాలు కూడా మార్చుకోవాలన్నమాట. కానీ అది భారతీయ జనతా పార్టీకి మాత్రం మినహాయింపు. ఎందుకంటే బీజేపీ భిన్నమైన పార్టీ కాబట్టి. సిద్ధాంతాలు అనే మడికట్టుకుని బతికే పార్టీ కాబట్టి. నీతి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనమైన పార్టీ కాబట్టి.

నిజమే. అయితే ఇవన్నీ.. అటల్‌ బిహారీ వాజపేయి, లాల్‌కృష్ణ అద్వానీ, మురళీమనోహర్‌ జోషి, కుష్‌భవ్‌ ఠక్రే, బంగారు లక్ష్మణ్‌, జనా కృష్ణమూర్తి, వెంకయ్యనాయుడు, నితిన్‌ గడ్కరీ, రాజనాధ్‌సింగ్‌ బీజేపీకి సారథ్యం వహించిన రోజుల్లో మాత్రమే. ఒక్క ఓటును కొనుగోలు చేసే అవకాశం ఉన్నా, నమ్మిన సిద్ధాంతం కోసం.. ప్రభుత్వాన్నే కాదనుకున్న పిచ్చిమారాజులున్న, ఒకప్పటి పార్టీ అది. ఉన్న బలం పెంచుకోవడమే అప్పటి నాయకత్వం లక్ష్యం. రెక్కల కష్టంతో మాత్రమే.. ప్రభుత్వాలను నిర్మించుకోవాలన్న సిద్ధాంతాలను ఆచరించిన పార్టీ అది. మిత్రపక్షాలను బలంగా మార్చాలన్న కోరిక ఉన్న, ఒకప్పటి పార్టీ నాయకత్వం అది.

మరి ఇప్పుడు? పార్టీ అదే. కానీ మారింది రాజకీయ సిద్ధాంతాలే! మారింది వ్యక్తుల ‘అలెగ్జాండర్‌ ఆలోచనలే’. ఫలితం.. పార్టీ నడక, నడత అన్నింట్లోనూ అనూహ్య మార్పు. అదే ఇప్పటి నవ భారతీయ జనతా పార్టీ! అది వాజపేయ్‌-అద్వానీ బీజేపీ. ఇది మోదీ-అమిత్‌షా బీజేపీ. అదే అసలు తేడా!!

ఒకప్పుడు బీజేపీకి శ్వాస ఆర్‌ఎస్‌ఎస్‌. బీజేపీ తప్పటడుగులు వేయకుండా, చేయి పట్టుకుని నడిపించే ఆర్‌ఎస్‌ఎస్‌దీ, మడికట్టుకునే సిద్ధాంతమే. అతి సాధారణ జీవనానికి పెట్టింది పేరు ఆర్‌ఎస్‌ఎస్‌. ఒకప్పుడు వారిది సైకిళ్లు, స్కూటర్లు, బస్సులు, రైళ్లలో ప్రయాణం. ఎక్కడ ఎవరు భోజనం పెడితే.. వారి ఇళ్లకు వెళ్లి , ఆతిధ్యం స్వీకరించే ప్రచారక్‌లు కనిపించిన గొప్ప సంస్థ అది. ఇదంతా ఒకప్పుడు!

బీజేపీకి మూలస్తంభమైన సంఘ్‌ స్వరూపం కూడా, బీజేపీ మాదిరిగానే కాలక్రమంలో సమూలంగా మారిన వైచిత్రి. ప్రధాని రేసులో ఉండే సంఘ్‌కు ఇష్టుడైన నితిన్‌ గడ్కరీని బీజేపీ పార్లమెంటరీ బోర్డు నుంచి తప్పించడమే పెద్ద ఆశ్చర్యం. అంటే సంఘ్‌పై మోదీ-అమిత్‌షా ప్రభావం, ఎంతన్నది ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదన్నది ‘సంఘ’జీవుల ఉవాచ. ఇప్పుడు సంఘ్‌ నాయకులు సేదతీరేది స్టార్‌ హోటళ్లలో. తిరిగేది విమానాల్లో. సంఘ్‌ను శాసించిన చాలామంది ఇప్పుడు వందల ఎకరాలు కొని, ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారట.

అలా.. బీజేపీతోపాటు నడక,నడత మారిన సంఘ్‌ను, ఇప్పుడు బీజేపీ శాసిస్తోందన్నది ఒక టాక్‌. అంటే ఒకప్పుడు తనను శాసించిన సంఘ్‌ను, ఇప్పుడు బీజేపీ తానే శాసిస్తోందన్నమాట. రాష్ట్ర పార్టీ సంఘటనా మంత్రుల రూపంలో వస్తున్న సంఘ్‌ నేతలకు సైతం, బీజేపీకి ఉన్న అన్ని అవలక్షణాలూ అబ్బాయన్నది సంఘ్‌ కార్యకర్తల ఆవేదన. అలా సైద్ధాంతిక స్వరూపాలు మార్చుకున్న బీజేపీ, ఇప్పుడు సరికొత్త ‘సైన్స్‌ పాలిటక్స్‌’ను ప్రోత్సహిస్తోంది. దానిపేరే ‘సరోగసీ పాలిటిక్స్‌’.

సరోగసీ.. ఇటీవలి కాలంలో ఇది విస్తృంగా వినిపిస్తున్న పదం. పిల్లలు పుట్టే అవకాశం లేని వారు, కృత్రిమ గర్భధారణ ద్వారా పిల్లలను కనేస్తున్న షార్ట్‌కట్‌ యుగమిది. ఈ పద్ధతి కేవలం మనుషులే కాదు. రాజకీయ పార్టీలూ విజయవంతంగా అమలుచేస్తుంటడమే విశేషం. అంటే.. మహిళలు కృత్రిమ గర్ధం ద్వారా పిల్లలు కనేస్తుంటే, రాజకీయ పార్టీలు కూడా తమకు బలం లేకపోయినా తమ కోరిక నెరవేర్చుకుంటున్నాయన్నమాట.

కృత్రిమ బలం సృష్టించుకోవడం ద్వారానో, లేక ఎదుటివాడి బలాన్ని లాగేసుకోవడం ద్వారానో, పొలిటికల్‌ సరోగసీకి బీజం వేస్తున్నాయి. అలా భారత రాజకీయాల్లో, పోలిటికల్‌ సరోగసీని విజయవంతంగా అమలుచేస్తున్న పార్టీగా , బీజేపీ సరికొత్త రికార్డు సృష్టిస్తోంది.

దేశంలో డబుల్‌ ఇంజన్‌ సర్కార్ల స్థాపన లక్ష్యంతో, అడుగులేస్తోన్న బీజేపీ.. అందుకు సరోగసీ పాలిటిక్స్‌ను, దగ్గరిదారిగా ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. తనకు స్వతహాగా బలం లేని రాష్ర్టాల్లో, ఆయా ప్రాంతీయ పార్టీల్లో చీలిక తెచ్చి వారి భాగస్వామిగా మారుతోంది. ఆ తర్వాత వాటిని కూడా పడగొట్టి సొంత ప్రభుత్వాలు నిర్మించుకుంటోంది. రెండు బలమైన పార్టీలున్న చోట.. ఒకరికి తెరవెనుక మద్దతు, మరొకరికి బహిరంగమద్దతు ఇచ్చి, అక్కడ పాగా వేసే మాయోపాయం అమలుచేస్తోంది.

తెలంగాణ-ఆంధ్రాలో, బీజేపీ సరోగసీ పాలిటిక్స్‌ను సీరియస్‌గా అమలుచేసే పనిలో ఉన్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా తెలంగాణలో బీజేపీ సరోగసీ పాలిటిక్స్‌, బాగా పనిచేస్తున్నట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. వైస్సార్‌టీపీ అధినేత్రి షర్మిలారెడ్డి ఎవరు వదిలిన బాణమన్న దానిపై, ఇటీవలి కాలం వరకూ చర్చ జరిగింది. ఎవరికోసమో పనిచేయాల్సిన ఖర్మ తనకు లేదని, షర్మిల కూడా ఎదురుదాడి చేశారు.

తాజాగా షర్మిలపై పోలీసు చర్య తర్వాత.. ఆమె ఎవరు వదిలిన బాణమో, మెడపై తల ఉన్న అందరికీ అర్ధమయిపోయింది. ఆమెపై పోలీసుల దూకుడును గవర్నర్‌ తమిళసై ఖండించారు. ఒక మహిళకు అవమానం జరగడంపై గవర్నర్‌ బాధపడ్డారు. దానికిముందు.. బీజేపీ కార్యకర్తలు, ఎమ్మెల్సీ కవిత ఇంటివద్ద ధర్నా చేశారు. దానిపై గవర్నర్‌ సహజంగా నోరు మెదపలేదు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ అధ్యక్షుడు సంజయ్‌ కూడా షర్మిలారెడ్డిపై పోలీసు చర్యను ఖండించారు.

చివరాఖరకు ప్రధాని మోదీ కూడా షర్మిలకు ఫోన్‌ చేసి, సానుభూతి వ్యక్తం చేశారట. మాటా-ముచ్చటకు ఢిల్లీకి రమ్మని పిలచారట. అంటే.. రేపటి ఎన్నికల్లో షర్మిల పార్టీ.. బీజేపీతో కలసి పోటీ చేసినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. లేదా ఎక్కువ స్థానాలకు పోటీ చే సి.. రెడ్డి- క్రైస్తవ-దళితుల ఓట్లకు గండి కొట్టించడం ద్వారా, కాంగ్రెస్‌ను దెబ్బకొట్టడమో జరగబోతోందన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. ఒకవైపు టీఆర్‌ఎస్‌ను చీల్చడం, అది సాధ్యం కాకపోతే టీఆర్‌ఎస్‌ను వ్యతిరేకించేవారితో ఉండటమన్నదే, బీజేపీ ద్విముఖ వ్యూహంగా స్పష్టమవుతోంది.

ఇప్పటికే గరికపాటి మోహన్‌రావు, ఈటల రాజేందర్‌, డికె అరుణ, కోమటిరెడ్డివంటి బలవంతులను చేర్చుకున్న బీజేపీ ఖాతాలో.. ప్రత్యక్షంగానయినా, పరోక్షంగానయినా షర్మిల కూడా చేరినట్లే లెక్క. ఆవిధంగా తాను బలంగా లేకపోయినా.. బలమైన నేతలను చేర్చుకోవడం ద్వారా, బలమైన పార్టీగా అవతరించాలన్న బీజేపీ కోరిక, నెరవేరుతున్నట్లే కనిపిస్తోంది.

ఇక ఆంధ్రాలో సినీ గ్లామర్‌ ఉన్న పవన్‌తో దోస్తానా చేస్తున్న బీజేపీ.. పవన్‌ వ్యతిరేకించే, వైసీపీతోనూ తెరచాటు స్నేహం చేస్తోందన్నది బహిరంగరహస్యమే. పవన్‌తో కలసి ఉంటే, ఎక్కువ ఓట్లు సంపాదించవచ్చన్నదే ప్రధాన లక్ష్యం. ఒకవైపు వైసీపీ వైఫల్యాలపై చార్జిషీట్‌ వేయాలన్న బీజేపీ, మరోవైపు తన అవసరాల కోసం జగన్‌ను దువ్వుతోంది. అంటే ఏపీలో కూడా బీజేపీ ద్విముఖ వ్యూహం అమలవుతోందన్నమాట.

అటు టీడీపీ కూడా అనివార్య పరిస్థితిలో, తనకే మద్దతునిచ్చేలా చేస్తున్న బీజేపీ చాణక్య రాజకీయ ఫలితంగా.. ఏపీలో తనకు ఎదురులేకుండా, కథ నడుపుతున్నట్లు స్పష్టమవుతోంది. ఏపీలో మతమార్పిళ్లకు వ్యతిరేకంగా సంఘ్‌పరివార్‌ సంస్థలు ఉద్యమిస్తున్నాయి. కానీ బీజేపీ మాత్రం.. అదే ప్రభుత్వానికి, దన్నుగా నిలవడం బట్టి.. అవసరార్ధం, బీజేపీ ఏ తరహా రాజకీయాలు చేస్తుందో, నిశితంగా పరిశీలిస్తే గానీ అర్ధంకాదన్నమాట. తన సొంత పార్టీవారిపై నమ్మకం లేని బీజేపీ నాయకత్వం, ఈవిధంగా సరోగసీ పాలిటిక్స్‌’ ద్వారా డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ లక్ష్యానికి వేగంగా అడుగులు వేస్తోంది.

Leave a Reply