ఆంధ్రప్రదేశ్

పండగ వేళ ట్రావెల్స్‌ దందా..

పశ్చిమ విశాఖ : సంక్రాంతి రద్దీని ప్రైవేటు ట్రావెల్స్‌ నిర్వాహకులు సొమ్ము చేసుకుంటున్నారు. డిమాండ్‌ను ఆసరాగా తీసుకుని చార్జీలను భారీగా పెంచేశారు. సాధారణ రోజుల్లో వుండే ధరల కంటే 50 నుంచి వంద శాతం వరకూ అదనంగా వసూలు చేస్తున్నారు.

తెలుగు ప్రజలకు అత్యంత ప్రధానమైన పండుగల్లో సంక్రాంతి ఒకటి. ఎక్కడెక్కడో స్థిరపడిన వారంతా పండక్కి తమ స్వస్థలాలకు వచ్చి కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులతో గడుపుతారు. దీంతో రైళ్లు, బస్సులకు ఫుల్‌ డిమాండ్‌ ఉంటుంది. కొంతమంది మూడు నెలల ముందే రైలు ప్రయాణానికి రిజర్వేషన్‌ చేయించుకుంటారు. రిజర్వేషన్‌ దొరకనివారు, ముందస్తుగా ప్రణాళిక సిద్ధం చేసుకోనివారు ప్రెవేటు ట్రావెల్స్‌పై ఆధారపడుతుంటారు. అందుకే ఏటా సంక్రాంతి సీజన్‌లో ప్రైవేటు ట్రావెల్స్‌కు డిమాండ్‌ ఎక్కువగా ఉంటుంది. దీన్ని ఆసరాగా తీసుకుని నిర్వాహకులు టిక్కెట్‌ ధరను భారీగా పెంచేస్తుంటారు. టిక్కెట్‌ పెంపు భారం పడుతున్నా, సంక్రాంతి పండుగకు స్వస్థలాలకు వెళ్లి రావడం ఆనవాయితీ కావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణం చేయాల్సి వస్తోందని వాపోతున్నారు. దీనిపై రవాణా శాఖ అధికారులు దృష్టిసారించి, ప్రైవేటు ట్రావెల్స్‌ ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Leave a Reply