శ్రీకృష్ణుడి అలంకరణలో శ్రీవారు శనివారం భక్తజనులకు దర్శనమిచ్చారు.
KPS డిజిటల్ మీడియా నెట్‌వర్క్, ద్వారకాతిరుమల :- చేతిన పిల్లనగ్రోవి, శిరస్సుపై నెమలిపింఛాన్ని ధరించి నీలమేఘశ్యాముడైన శ్రీకృష్ణుడి అలంకరణలో శ్రీవారు శనివారం భక్తజనులకు దర్శనమిచ్చారు.
నేటి రాత్రి స్వామి వారి కల్యాణం.. సర్వం సిద్ధం
నేత్రపర్వంగా ఎదుర్కోలు ఉత్సవం
చేతిన పిల్లనగ్రోవి, శిరస్సుపై నెమలిపింఛాన్ని ధరించి నీలమేఘశ్యాముడైన శ్రీకృష్ణుడి అలంకరణలో శ్రీవారు శనివారం భక్తజనులకు దర్శనమిచ్చారు. సర్వాభర ణాలు ధరించి ఉన్న ఈ అలంకరణ భక్తులను ఆకట్టుకుంది. వేసవి సెలవులు, పెళ్లిళ్ల సీజన్ కావడంతో శనివారం దాదాపు 20వేల మంది వరకు భక్తులు వచ్చి ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని పూజల అనంతరం అన్నప్రసాదాన్ని స్వీకరించారు.
హనుమద్వాహనంపై.. తిరువీధులకు శ్రీవారు
భక్తవరదుడైన శ్రీవారు హనుమద్వాహనాన్ని అధిష్టించి శనివారం ఉదయం తిరువీధుల్లో ఊరేగారు. చిన్నతిరుమ లేశుని వైశాఖమాస దివ్య బ్రహ్మోత్సవాలలో భాగంగా దనుర్భాణాలను ధరించి రామావతారంలో కొలువుతీరిన శ్రీవారు హనుమత్ వాహనంపై భక్తజనరంజకంగా తిరువీధుల్లో ఊరేగారు. శ్రీవారి హనుమ ద్వాహన సేవ నాటి రామరాజ్య వైభవాన్ని పురవీధుల్లో సాక్షాత్కరింప చేసింది. ప్రతీ ఇంటి ముందు భక్తులు స్వామి, అమ్మవార్లకు హారతులు పట్టారు.
శ్రీవారికి ఎదుర్కోలు ఉత్సవం
దివ్యబ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి ఎదుర్కోలు ఉత్సవాన్ని అర్చకులు, పండితులు, అధికారులు, భక్తులతో వేడుకగా నిర్వహించారు. స్వామివారి నిత్యకల్యాణమండపం వేదికైంది. ఆద్యంతం ఉల్లాసంగా ఉత్సాహంగా జరిగిన ఈ ఉత్సవం చూపరులకు నేత్రపర్వమైంది.
ఎదుర్కోలు ఉత్సవం ఇలా..
స్వామివారి కల్యాణానికి ముందురోజున ఈ ఎదుర్కోలు ఉత్సవాన్ని నిర్వహించడం సంప్రదాయం. శ్రీవారి ఆలయ ఆవరణలో వెండి శేషవాహనంపై ఉభయదేవేరులతో స్వామిని ఉంచి ప్రత్యేక పుష్పాలంకరణ చేశారు. అట్టహాసంగా నిత్యకల్యాణ వేదిక వద్దకు తెచ్చారు. అనంతరం హారతులిచ్చి అర్చకులు ఎదుర్కోలు ఉత్సవాన్ని ప్రారంభించారు. మండపంలో అర్చకులు, అధికారులు, పండితులు, భక్తులు రెండు జట్లుగా విడిపోయి ఒక జట్టు స్వామివారి గుణగణాలను, ఆయన విశిష్టతను కొనియాడారు. రెండో జట్టు అమ్మవార్ల గుణగణాలను, వారి కీర్తిని తెలియజేశారు. వివాహం జరిగే ముందు రోజు వధూవరుల తరఫున బంధువులు శుభలేఖను పఠించేందుకు జరిపే కార్యక్రమమే ఎదుర్కోలుగా పండితులు చెబుతున్నారు.
నేడు వెంకన్న కల్యాణం
శ్రీవారి దివ్య కల్యాణమహోత్సవానికి దేవస్థానం సర్వం సిద్ధం చేసింది. చినవెంకన్న కల్యాణాన్ని ఆదివారం రాత్రి ఎనిమిది గంటలకు వైభవంగా జరిపేందుకు కళావైభవాలతో అనివేటిమండపంలో కల్యాణ మండపాన్ని సిబ్బంది ముస్తాబు చేస్తున్నా రు. పూలఅలంకరణ పనులు శనివారం రాత్రికి పూర్తవుతాయని ఈవో ఎన్వీ సత్యనారాయణమూర్తి తెలిపారు. కల్యాణవేడుక అనంతరం స్వామివారి తిరువీధి సేవకు వినియోగించే వెండి గరుడ వాహనాన్ని ఇప్పటికే సిద్ధం చేశారు.