Warning: Undefined array key -1 in /var/www/fastuser/data/www/kpsnetwork.in/wp-includes/post-template.php on line 330
సిని వార్తలు

సాయిధరమ్ తేజ్ ఆరోగ్యంపై మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. అల్లు అరవింద్ కీలక ప్రకటన

హైదరాబాద్ : శుక్రవారం సాయంత్రం బైక్ యాక్సిడెంట్‌కు గురైన టాలీవుడ్ యంగ్ హీరో సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై అభిమానుల్లో ఆందోళన నెలకొన్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఎలాంటి బులెటిన్ విడుదల చేయకపోవడంతో.. ఆయన పరిస్థితి ఎలా ఉందో అనే టెన్షన్ పెరిగిపోయింది. అయితే అందరి ఆందోళనను తగ్గించేలా మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కీలక ప్రకటన చేశారు. సాయిధరమ్ తేజ్ క్షేమంగా ఉన్నాడని అపోలో ఆస్పత్రి ముందు మీడియాకు వెల్లడించారు. తలకు, శరీరంలో తీవ్ర గాయాలేమీ లేవని ఆయన ప్రకటించారు. రేపు ఉదయం సాధారణ వార్డుకు తరలించేలా ఆయన పరిస్థితి మెరుగవుతుందని వైద్యులు తనకు చెప్పారని అల్లు అరవింద్ చెప్పారు. మరికాసేపట్లో సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేస్తారని అన్నారు. మీడియాలో వస్తున్న వార్తలు, అభిమానుల ఆందోళన నేపథ్యంలోనే.. తాము ముందుగా ఈ విషయాన్ని చెబుతున్నానని అల్లు అరవింద్ అన్నారు.

అంతకుముందు శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జ్ సమీపంలో హీరో సాయిధరమ్ తేజ్ ప్రయాణిస్తున్న స్పోర్ట్స్‌ బైక్‌ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆయన గాయపడ్డారు. అపస్మారక స్థితిలోకి వెళ్లపిోయారు. ప్రమాదం జరిగిన వెంటనే సాయిధరమ్‌తేజ్‌ను 108 సాయంతో సమీపంలోని మెడికవర్‌ ఆస్పత్రికి తరలించారు. సాయిధరమ్‌ తేజ్‌ కుడికన్ను, ఛాతి భాగంలో తీవ్రగాయాలు అయినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో హెల్మెట్ ఉన్నప్పటికీ సాయిధరమ్ తేజ్‌కు తీవ్ర గాయాలు అయినట్టుగా వార్తలు వచ్చాయి.

మెడికవర్ ఆస్పత్రిలో చికిత్స అనంతరం మరింత మెరుగైన చికిత్స కోసం సాయిధరమ్ తేజ్‌ను జూబ్లీ హిల్స్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన వెంటనే పవన్ కళ్యాణ్ మెడికవర్ ఆస్పత్రికి వెళ్లి సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను ఆరా తీశారు. అనంతరం చిరంజీవి అపోలో ఆస్పత్రికి చేరుకున్నారు. చిరంజీవితో పాటు మెగా ఫ్యామిలీలోని సభ్యులంతా ఆస్పత్రికి చేరుకుని సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు తెలుసుకున్నారు. మరోవైపు మెగా అభిమానులు సైతం పెద్ద సంఖ్యలో అపోలో ఆస్పత్రి దగ్గరకు చేరుకున్నారు. వైద్యులు సాయిధరమ్ ఆరోగ్య పరిస్థితి గురించి ఏం చెబుతారని అంతా ఎదురుచూస్తున్న సమయంలో అతడు పూర్తి క్షేమంగా ఉన్నాడని అల్లు అరవింద్ ప్రకటన చేశారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

మరోవైపు సాయిధరమ్ తేజ్ యాక్సిడెంట్ ఘటనపై మాదాపూర్ పోలీసులు స్పందించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. బైక్‌ను నియంత్రించలేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి సాయిధరమ్ తేజ్‌పై రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

Leave a Reply

%d bloggers like this: