జాతీయ వార్తలు

మళ్లీ ఎగరనున్న జెట్ ఎయిర్‌వేస్‌.. తొలి విమానం ఎప్పుడంటే..

న్యూఢిల్లీ : రెండున్నరేళ్ల కిందట ఆర్థిక భారంతో సతమతమవుతూ తన విమానాలను గ్రౌండ్ చేసిన జెట్ ఎయిర్‌వేస్ ( Jet Airways ) మళ్లీ ఎగరడానికి సిద్ధమవుతోంది. 2022 తొలి త్రైమాసికంలో తమ తొలి దేశీయ విమానాన్ని న్యూఢిల్లీ నుంచి ముంబై మధ్య నడపడానికి ప్లాన్ చేస్తున్నట్లు జలన్ కాల్‌రాక్ కన్సార్టియమ్ ఓ ప్రకటనలో వెల్లడించింది. ప్రస్తుతం ఆ సంస్థ అధికారులు, ఎయిర్‌పోర్ట్ కోఆర్డినేటర్లతో కలిసి పని చేస్తూ ఆ దిశగా అడుగులు వేస్తోంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే మూడేళ్ల తర్వాత మళ్లీ ఓ జెట్ ఎయిర్‌వేస్ విమానం గాల్లోకి ఎగరనుంది.

దీనికోసం చిన్న సైజు ఎయిర్‌క్రాఫ్ట్‌లను లీజుకు తీసుకునే పనిలో ఆ సంస్థ ఉంది. ఇక వచ్చే ఏడాది మూడు లేదా నాలుగో త్రైమాసికంలో తక్కువ దూరం అంతర్జాతీయ విమానాలను కూడా ప్రారంభిచాలని అనుకుంటున్నట్లు ఈ జలన్ కాల్‌రాక్ కన్సార్టియంలో మెజార్టీ వాటా ఉన్న యూఏఈ వ్యాపారవేత్త మురారీ లాల్ జలన్ వెల్లడించారు.

మూడేళ్లలో 50కిపైగా, ఐదేళ్లలో 100కుపైగా విమానాలను ప్రారంభించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. రెండేళ్లు గ్రౌండ్ అయిన ఓ ఎయిర్‌లైన్ మళ్లీ గాల్లోకి ఎగరడం ఏవియేషన్ చరిత్రలోనే తొలిసారి అవుతందని ఈ సందర్భంగా జలన్ చెప్పారు. ఇప్పటికే 150 మందికిపైగా ఉద్యోగులును ఈ సంస్థ రిక్రూట్ చేసుకోగా.. మరో 1000 మందిని తీసుకునే క్రమంలో ఉంది.

Leave a Reply