ఆంధ్రప్రదేశ్

ఆంధ్రాలో వేల ఎకరాల్లో తడిసిన ధాన్యం-తెలంగాణాలో వర్షం

అమరావతి : మాండూస్ తుపాన్ తీరం దాటిపోయినా…వర్షాలు వీడటం లేదు. ఆంధ్ర రాష్ట్రంలో తుపాన్ దెబ్బకి రాయలసీమ, దక్షిణ కోస్తా కలిపి ఆరు జిల్లాలు అతలాకుతలమయ్యాయి. పంటలు నష్టపోయి రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తునారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రాన్ని వర్షం వీడటం లేదు. హైదరాబాద్ లో ముసురు పట్టి చిన్నచిన్నజల్లులతో కూడిన వర్షం అలా పడుతూనే ఉంది.

ఇక ఆంధ్రప్రదేశ్ లో కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయి, చేతికొచ్చిన పంట నోటికి అందకుండా పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో రెండురోజుల్లో పంటను తీసుకువెళ్లి ఒబ్బిడి చేసుకుందామనే వేళ మాయదారి తుపాను రోడ్డున పడేసిందని రైతులు గగ్గోలు పెడుతున్నారు.

ఉమ్మడి గుంటూరు, కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల్లో ధాన్యం తడిసిపోతే, పల్నాడు, బాపట్ల, గుంటూరు జిల్లాల్లో పత్తిపంట పాడైపోయిందని, మరోవైపు వానల వల్ల మిరపరైతులకు నష్టాలు తప్పేలా లేవని రైతులు ఆందోళన చెందుతున్నారు.

తెలంగాణ విషయానికి వస్తే మాండూస్ తుపాను ప్రభావం మూడు రోజులు ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడతాయని అంటున్నారు. తుపాను వదిలిపోయినా వర్షాలు పడుతుండటంపై వాతావరణంలో సమతుల్యత దెబ్బతిందని, విపరీతమైన ఎండలు, వణికించే చలి గాలులు ఇవన్నీ వీటి ఫలితమేనని సీనియర్లు నొక్కి వక్కానిస్తున్నారు.

Leave a Reply