జాతీయ వార్తలు

27 న భారత్‌ బంద్‌… విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం..

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ అనుసరిస్తున్న ఉద్యోగ, కార్మిక , రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం ఈ నెల 27న జరిగే భారత్‌ బంద్‌ను జయప్రదం చేయాలని ప్రజాసంఘాల నాయకులు పిలుపునిచ్చారు.

కేంద్ర ప్రభుత్వం నూతన వ్యవసాయ చట్టాలు తెచ్చి రైతులకు ఉరితాళ్ళుగా మార్చిందన్నారు. ఆ చట్టాలు రద్దు చేయాలని గత 10 నెలలుగా ఆందోళన చేస్తున్నా స్పందించడం లేదన్నారు. కార్మికులకు హాని కలిగించే నాలుగు లేబర్‌ కోడ్లు తెచ్చారని, విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రయివేటు పరం చేస్తున్నారని, ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మకానికి పెట్టారని విమర్శించారు.

గ్రామీణ పేదలకు వరంగా ఉన్న ఉపాధిహామీ పథకాన్ని నిరుగారుస్తున్నారని, ఈ పథకాన్ని పటిష్టంగా అమలు చేస్తూ పట్టణాలకు విస్తరింప చేయాలని, 200 రోజులు పనిదినాలు కల్పించి రోజుకు రూ.600 వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

మానిటైజేషన్‌ పేరుతో ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టడాన్ని వ్యతిరేకించాలన్నారు. దేశవ్యాపితంగా మోడీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ దేశాన్ని రక్షించుకునేందుకు ఈ నెల 27న నిర్వహించే భారత్‌ బంద్‌ ను విజయవంతం చేయాలన్నారు.

Leave a Reply