ఆంధ్రప్రదేశ్

గన్నవరంలో ఊహించని షాక్.. వంశీ ఫసక్..?

KPS డిజిటల్ మీడియా నెట్‌వర్క్, కృష్ణా :- ఉమ్మడి కృష్ణా జిల్లాలో అందరి దృష్టిని ఆకర్షించిన నియోజకవర్గాల్లో గుడివాడ, గన్నవరం ముందు వరుసలో ఉంటాయి. యావత్తు రాష్ట్రవాసులు కూడా ఆ సెగ్మెంట్ల వైపు ఆసక్తిగా చూశారు. ప్రత్యర్ధులను ఎంత మాట అనడానికి అయినా వెనుకాడని కొడాలి నాని, వల్లభనేని వంశీలు అక్కడ నుంచి పోటీలో ఉండటమే అందుకు కారణం. తనమన బేధం లేకుండా ఎవరిపైనానే విరుచుకుపడుతూ.. ఎప్పుడూ దూకుడు ప్రదర్శించే ఆ ఇద్దరిలో పోలింగ్ రోజున ఆ స్పీడ్ కనిపించలేదు. మరీ ముఖ్యంగా వల్లభనేని పోల్ మేనేజ్‌మెంట్‌పై దృష్టి పెట్టకుండా సెల్ఫ్ డిఫెన్స్‌లో పడ్డట్లు కనిపించారు. అదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

పోలింగ్ రోజున వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గుడివాడ వైసీపీ అభ్యర్ధి కొడాలి నాని వ్యవహరించిన తీరు ఇప్పుడు ఆ నియోజకవర్గంలో చర్చానీయాంశంగా మారింది. పార్టీలో ఎప్పుడూ అవసరమైన దానికంటే దూకుడు ప్రదర్శిస్తూ, అన్నీ తానై వ్యవహరించే కొడాలి నాని పోలింగ్ రోజు చివరి గంటల వరకు కనిపించకుండా పోయారు. సాధారణంగా పోటీ చేసే ఏ పార్టీ అభ్యర్ధయినా నియోజకవర్గంలో తమ పార్టీ శ్రేణులను, అభిమానులు కలుస్తూ ఓటింగ్ సరళని పరిశీలిస్తుంటారు. కార్యకర్తలందరూ ఓటు వేసేలా ప్రోత్సహిస్తూ పోల్ మేనేజ్‌మెంట్‌పై దృష్టి పెడతారు.

కాని ఓట్ల పండుగ నాడు కొడాలి నాని ఉదయం నుంచి ఇంటికే పరిమితమయ్యారు . టీడీపీలో 2 సార్లు గుడివాడ ఎమ్మెల్యేగా గెలిచిన నాని, తర్వాత వైసీపీ నుంచి మరో రెండు సార్లు గెలిచి రెండున్నరేళ్లు మంత్రిగా కూడా పనిచేశారు. వైసీపీలో చేరిన నాటి నుంచి టీడీపీ పార్టీతో పాటు చంద్రబాబు, లోకేష్‌లపై అభ్యంతకర పదజాలంతో విరుచుకుపడటమే పనిగా పెట్టుకున్నారు. దానికి తోడు ఆయనపై ఉన్న ఆరోపణలు, ఆయన గ్యాంగ్ ఆరాచకాలతో నియోజకవర్గంలో ఆయనపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్న అభిప్రాయం వ్యక్తమైంది. మరోవైపు టీడీపీ నుంచి ఎన్ఆర్ఐ వెనిగండ్ల రాము ఆయనకు ఈ సారి బలమైన ప్రత్యర్ధిగా మారారు. ఆ క్రమంలో గుడివాడ నుంచి అయిదో సారి గెలవడం అంత ఈజీ కాదన్న భావనతోనే ఆయన ప్రజలకు ముఖం చాటేసారన్న ప్రచారం జరిగింది.

అయితే సాయంత్రానికి గడప దాటిన మాజీ మంత్రి కుటుంబ సమేతంగా వెళ్లి ఓటు వేశారు. ఎన్నికల్లో పోటీ చేసిన నాయకుడు, కనీసం పోలింగ్ బూత్‌ల పరిశీలన కూడా చేయకపోవడంతో అప్పటి వరకు తలో మాట అనుకున్నారు. అయితే ఓటింగ్ సమయంలో కూడా కొడాలి నాని తన సహజశైలికి భిన్నంగా ముభావంగా వ్యవహరించడంతో రకరకాల చర్చలు తెరమీదకొస్తున్నాయి.

మరోవైపు గన్నవరం నియోజకవర్గంలో ఎలక్షన్ వన్ సైడ్‌గా జరిగిందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి.. జగన్‌కు జై కొట్టిన వల్లభనేని వంశీ ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధిగా పోటీలో నిలిచారు. అప్పట్లో మంత్రిగా ఉన్న కొడాలి నాని వెంట బెట్టుకుని వెళ్లి మరీ వంశీతో జగన్‌కు జై కొట్టించారు. 2014లో గన్నవరంలో టీడీపీ తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన వంశీ.. అప్పట్లో అధికారంలోకి రావడంతో పార్టీలోనే కొనసాగారు. గత ఎన్నికల్లో టీడీపీ అధికారానికి దూరమవ్వడంతో ఎమ్మెల్యే గెలిచిన ఆయన కొద్దికాలానికే పార్టీకి దూరమయ్యారు.

ఏవో తన స్వప్రయోజనాలు కోసం పార్టీ మారారని అనుకుంటే తనకు రాజకీయభిక్ష పెట్టిన చంద్రబాబుపై పర్సనల్‌ విమర్శలతో వివాదాలకు కారణమయ్యారు. దాంతో గన్నవరం టీడీపీ కేడర్ అంతా ఆయనకు దూరం జరిగింది. మరో వైపు వైసీపీ నుంచి గత రెండు సార్లు వంశీ చేతిలో ఓడిపోయిన దుట్టా రాంచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావులు ఆయనకు రాజకీయ శత్రువులయ్యారు. ఆ ఇద్దరు స్థానికంగా బలమైన నేతలే కావడంతో వైసీపీలో సైతం వంశీకి వ్యతిరేక వర్గాలు తయారయ్యాయి. ఇక వంశీకి చెక్ పెట్టడానికి యార్లగడ్డ వెంకట్రావునే ఎన్నికల బరిలో దించారు చంద్రబాబు.

అటు టీడీపీ, ఇటు వైసీపీల్లో సొంత కేడర్ అంటూ లేకుండా పోయిన వంశీ.. పోలింగ్ రోజున పోల్ మేనేజ్మెంట్ విషయంలో పూర్తిగా చేతులెత్తేశారు. పోలింగ్ జరిగే ప్రాంతాల్లో టీడీపీ అభ్యర్ధి యార్లగడ్డ వెంకట్రావు చురుగ్గా పర్యటిస్తుంటే వంశీ ఆయన వెనుకే తిరగడం కనిపించింది. ఆ క్రమంలో అక్కడక్కడా యార్లగడ్డ వర్గాన్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేశారు. విజయవాడ రూరల్‌ మండలం నున్న, గన్నవరం మండలం సూరంపల్లి, ఉంగుటూరు మండలం తేలప్రోలులో ఉద్దేశపూర్వకంగా యార్లగడ్డ వెంకట్రావుపై దాడికి యత్నించారు.పోలీసులు చెదరగొట్టడంతో వివాదం సద్దుమణిగింది.

తర్వాత వంశీ సూరంపల్లి బైపాస్‌ వద్ద వెంకట్రావును అడ్డుకునేందుకు యత్నించారు. భారీగా తెదేపా శ్రేణులూ అక్కడికి చేరుకోవడంతో ఇరువర్గాలూ పరస్పరం దూసుకొచ్చాయి. పోలీసులు వారిని చెదరగొట్టారు. ఆ క్రమంలో యార్లగడ్డ వర్గీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వంశీ కాన్వాయ్‌పై దూసుకొచ్చారు. వంశీ కాన్వాయ్‌లోని రెండు వాహనాలపై రాళ్లు విసరడంతో పాక్షికంగా అద్దాలు ధ్వంసమయ్యాయి. ఆ దశంలో టీడీపీ శ్రేణులు వంశీపై ప్రత్యక్షంగా దాడికి దిగే ప్రయత్నం చేశాయి. అయితే పోలీసులు అడ్డుకోవడంతో వంశీని వదిలేశారు. దాంతో నిస్సహాయస్థితిలో వంశీ అక్కడ నుంచి వెళ్లిపోయారు. మొత్తానికి ఓ పక్క వైసీపీ కోపరేషన్ లేక మరోపక్క పోల్ మేనేజ్మెంట్ చేయలేక ఢీలాపడ్డ వంశీ అలజడులు సృష్టించడానికి విఫల యత్నాలు చేయడం, ఓటమి భయంతోనే అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Leave a Reply