జాతీయ వార్తలు

ఊరూవాడా మహాశివరాత్రి వైభవం ప్రారంభం

ఎ.పి & తెలంగాణ : Grand Maha Shivarathri Celebrations in AP and Telanagana States: తెలుగురాష్ట్రాల్లోని శైవక్షేత్రాలన్నీ శివనామస్మరణతో హోరెత్తిపోతున్నాయి. అప్పుడే బ్రహ్మోత్సవాల వైభవంతో శివాలయాలు దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి. ఆది దంపతులుగా కీర్తి పొందిన శివపార్వతులను దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు.

ముఖ్యంగా శ్రీశైల మహాక్షేత్రం, శ్రీకాళహస్తీశ్వరాలయం, తిరుపతిలోని కపిలేశ్వర స్వామి ఆలయం కళకళలాడుతోంది.

ఉభయగోదావరి, క్రష్ణా జిల్లాల్లోని నదీతీర ప్రాంతాల్లోని శైవ క్షేత్రాలు, పంచారామాలు శోభాయమానంగా దర్శనమిస్తున్నాయి. అన్నిచోట్ల శివ భక్తులకు అసౌకర్యం కలగడకుండా దేవాలయ సిబ్బంది పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. అలాగే వీఐపీ దర్శనాలకు ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నారు.

నల్లమల కొండ నుంచి కాలినడకన భక్తులు శివనామస్మరణతో శ్రీశైల భ్రమరాంబికా మల్లికార్జున స్వామిని చూసేందుకు తండోపతండాలుగా కదిలివెళుతున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాదు కర్ణాటక, మహారాష్ట్రల నుంచి కూడా భక్తులు తరలిరావడంతో అప్పుడే ఆలయ ప్రాంగణమంతా కిటకిటలాడిపోతోంది. శ్రీశైల మహా పుణ్యక్షేత్రంలో ఇసుకేస్తే రాలనంత భక్తులు వచ్చారు.

వసతి కోసం భక్తులు తంటాలు పడుతున్నారు. అన్నదాన సత్రాలు కిక్కిరిసిపోయి ఉన్నాయి. లడ్డూ కౌంటర్ల దగ్గర కూడా చాంతాడంత లైన్లు ఉన్నాయి. దేవస్థానం 15 కౌంటర్లను ఏర్పాటు చేసింది. శ్రీశైల గిరులు శివనామస్మరణతో మార్మోగిపోతున్నాయి. శివరాత్రి ముందురోజు రాత్రి స్వామి, అమ్మవార్లకు గజ వాహన సేవ జరగనుంది.

తిరుపతిలోని శ్రీకాళహస్తీశ్వరాలయాన్ని అతి సుందరంగా పూలతో అలంకరించారు. గాంధర్వ రాత్రిని పురస్కరించుకుని శ్వేతవర్ణాలు, విశేష దివ్యాభరణాలతో ఆది దంపతులైన సర్వేశ్వరుడు రావణ వాహనంపై, శ్రీజ్నాన ప్రసూనాంబికా అమ్మవార్లు కలిసి మయూర వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.

తిరుపతిలోని కపిలేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజు అవతరణలో భాగంగా శ్రీ కామాక్షి సమేత సోమ స్కంధమూర్తి స్వామి వారు వ్యాఘ్ర వాహనంపై ఊరేగారు. భజన మండళ్లు, కోలాటాల ప్రదర్శనలు, మహిళల హారతులతో తిరుపతి పుర వీధులన్నీ కోలాహలంగా మారిపోయాయి.

Leave a Reply