జనసేనలోకి దువ్వాడ వాణి?
KPS డిజిటల్ మీడియా నెట్‌వర్క్, టెక్కలి :- వారిద్దరూ భార్యాభర్తలు.. భర్త ఎమ్మెల్సీ అయితే.. భార్య జడ్పీటీసీ.. రాజకీయంగా కూడా ఇద్దరు కలిసి నడిచారు. అయితే తర్వాత వారి మధ్య వచ్చిన మనస్పర్థలు, కుటుంబ కలహాలు తీవ్ర స్థాయికి చేరాయి. భర్త తన దారి తాను చూసుకుని.. తన ఓవర్ యాక్షన్‌తో ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ట్రోలింగ్ అవ్వడం అలవాటుగా మార్చకున్నాడు. భార్యాభర్తలుగా దూరంగా ఉంటూ ఎవరి రాజకీయం వారు చేసుకునే పనిలో పడ్డారు. ఇటీవల భర్తను కాదని భార్య ప్రజాసమస్యలపై గళమెత్తుతూ రాజకీయంగా ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు.
కొంత కాలంగా సైలెంట్ అయిన దువ్వాడ వాణి
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, వాణి .. మధ్యలో దివ్వెల మాధురి. వీరి ఫ్యామిలీ ఎపిసోడ్ గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరు. ప్రస్తుతం వారి వివాదం కోర్టులో కొనసాగుతోంది. దువ్వాడ వాణి గత కొంత కాలంగా మీడియాకి దూరంగా పిల్లలు, కుటుంబ వ్యవహారాలు చూసుకుంటూ సైలెంట్ గా ఉంటున్నారు .అదే సమయంలో దువ్వాడ శ్రీనివాస్, మాధురి మాత్రం చెట్టాపట్టాలేసుకుని గుళ్ళు, గోపురాలు, విహార యాత్రలు అంటూ తెగ హడావిడి చేస్తున్నారు. మరో వైపు రీల్స్‌తో సోషల్ మీడియా ఇంటర్వ్యూలతో బిజీగా గడుపుతున్నారు.
కలెక్టర్ గ్రీవెన్స్‌లో ఎంట్రీ ఇచ్చిన దువ్వాడ వాణి
అయితే సడెన్‌గా టెక్కలి నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జి పేరాడ తిలక్, పార్టీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో కలిసి శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో జరిగిన కలెక్టర్ గ్రీవెన్స్‌లో టెక్కలి వైసిపి జడ్పీటీసీ దువ్వాడ వాణి ఎంట్రీ ఇచ్చారు. రాజకీయ కక్షతో టెక్కలి నియోజక వర్గంలోని నాలుగు మండలాల పరిధిలో స్థానిక సంస్థల నిధులు వినియోగించకుండా అధికారులు అడ్డుకుంటున్నారని దానివల్ల అభివృద్ధి కుంటుపడుతున్నదని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై తక్షణం చర్యలు తీసుకోవాలని లేకపోతే కలెక్టరేట్ ఎదుట దీక్షలు చేపడతామని ఆమె హెచ్చరించారు. మొత్తానికి దువ్వాడ వాణి పొలిటికల్‌గా తిరిగి యాక్టివ్ అవ్వటం జిల్లాలో పెద్ద చర్చకు దారితీస్తోంది. పొలిటికల్ గా దువ్వాడ శ్రీను లూప్‌లైన్లోకి వెళ్లిపోతుంటే.. దువ్వాడ వాణి మెయిన్ లైన్లోకి రావడం ఆసక్తికరంగా మారింది.
రాజకీయ నేపథ్యం ఉన్న వాణి కుటుంబం
దువ్వాడ వాణి కన్న వారిది ముందు నుండి రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం. ఆమె తండ్రి సంపతరావు రాఘవరావు ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేసి రిటైర్ అయ్యాక పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఒకప్పటి హరిశ్చంద్రాపురం నియోజకవర్గం నుండి కాంగ్రెస్ తరుపున కింజరాపు ఎర్రన్నాయుడుపై 2 సార్లు, అచ్చెన్నాయుడుపై ఒకసారి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత అతని కుమార్తె వాణి 2004లో అదే నియోజకవర్గం నుండి కాంగ్రెస్ తరుపున అచ్చెన్నాయుడుపై పోటీ చేసి ఓడిపోయారు. గతంలో రాఘవరావు అదే కాంగ్రెస్ నుంచి టెక్కలి ఎంపీపీ గా గెలవగా, వాణి ప్రస్తుతం టెక్కలి వైసిపి జడ్పీటీసీగా కొనసాగుతున్నారు.
శ్రీకాకుళం జడ్పీ వైస్ చైర్మన్‌గా పనిచేసిన దువ్వాడ శ్రీను
ఇక వాణి భర్త దువ్వాడ శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. 2006లో శ్రీకాకుళం జిల్లా పరిషత్ వైస్ చైర్మన్‌గా పనిచేశాడు. దువ్వాడ శ్రీనివాస్ 2009లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి చిరంజీవి ఏర్పాటు చేసిన ప్రజారాజ్యం పార్టీలో చేరి 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టెక్కలి నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. తర్వాత వైసీపీలో చేరి 2014లో టెక్కలి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2019లో శ్రీకాకుళం ఎంపీ అభ్యర్ధిగా ఆయనకు జగన్ ప్రమోషన్ ఇచ్చినప్పటికీ పరాజయం తప్పలేదు. తర్వాత జగన్ చలవతో 2021లో ఎమ్మెల్సీ అయిన దువ్వాడ శ్రీను ప్రస్తుతం ఆ పదవిలో కొనసాగుతూ.. దివ్వెల మాధురితో కలిసి సోషల్ మీడియాలో అలా కానిచ్చేస్తున్నారు.
క్యాడర్‌కు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్న దువ్వాడ వాణి
దువ్వాడ శ్రీను ఇక ప్రత్యక్ష రాజకీయాలకు దూరమైనట్టే అన్న ప్రచారం జరుగుతోంది. భర్త దువ్వాడ శ్రీనివాస్ తో ఏర్పడిన కుటుంబ కలహాల నేపథ్యంలో తన కన్నవారి నుండి వచ్చిన రాజకీయాలను ఎందుకు దూరం చేసుకోవాలి అన్న ఆలోచనలో ఉన్నారట వాణి. పైగా రాజకీయాలలో యాక్టివ్ అవ్వటం వల్ల కుటుంబ కలహాల నుండి డైవర్ట్ కావచ్చని ఆమె సన్నిహితులు కూడా వాణికి సూచిస్తున్నారట. దీంతో గత కొద్ది రోజులుగా ఆమె మెల్లమెల్లగా తన సన్నిహితులకు, క్యాడర్ కి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారంట.
ఎన్నికల ముందు జగన్ ను కలిసి భర్తపై ఫిర్యాదు చేసిన వాణి
అసలు పలాసకు చెందిన దువ్వాడ శ్రీనివాస్ టెక్కలిలో ఆ మాత్రం ఎదగడానికి తన తండ్రి రాఘవరావు వారసత్వమే కారణమని ముందు నుంచి వాణి చెబుతున్నారు . తనను వివాహం చేసుకున్నాకే టెక్కలిలో రాజకీయంగా అతను ఎదిగారని వాదిస్తూ వస్తూన్నారు . అందుకనే దివ్వెల మాధురితో శ్రీనుకు ఉన్న రిలేషన్ తెలిసిన వెంటనే వాణి నియోజకవర్గ రాజకీయాలను తన చేతుల్లోకి తీసుకోవాలని యత్నించారు. అందులో భాగంగానే ఎన్నికల ముందు జగన్‌ని కలిసి తన భర్తపై ఫిర్యాదు చేశారు. శ్రీనును తప్పించి తనకు నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలు అప్పజెప్పాలని లేదంటే శ్రీను వల్ల పార్టీకి చెడ్డ పేరు వస్తుందని జగన్ దృష్టికి తీసుకెళ్లారంట. ఆ తర్వాతే శ్రీనుని తొలగించి జగన్ వాణికి ఆ బాధ్యతలు అప్పజెప్పారు.
టెక్కిలిలో 25వేల ఓట్లతో ఓడిన దువ్వాడ
అయితే మళ్ళీ ఎన్నికల ముందు అభ్యర్థులను ప్రకటించే క్రమంలో తిరిగి నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న వాణిని తప్పించి తిరిగి శ్రీనూకే టికెట్ కట్టబెట్టింది అధిష్టానం. గత ఎన్నికల్లో దువ్వాడ ఏకంగా పాతిక వేల పైచిలుకు ఓట్ల తేడాతో అచ్చన్నాయుడు చేతిలో మరోసారి ఓటమి మూటగట్టుకున్నారు. అదలా ఉంటే యూ ట్యూబ్ ఛానెళ్లలో దువ్వాడ బిజీగా ఉంటూ పొలిటికల్ కెరీర్ ను చేతులారా గజిబిజి చేసుకుంటున్నారన్న వాదన ఉంది. ఆయన కేడర్ కి దగ్గరయ్యేందుకు అడపాదడపా పలు కార్యక్రమాలు చేపడుతున్నప్పటికి అంతగా వర్కవుట్ కావటం లేదు. దీనికి తోడు జిల్లా పార్టీ శ్రేణులు కూడా శీనుకు దూరం జరుగుతున్నట్లు కనిపిస్తున్నాయి. అతని వ్యవహార శైలి నచ్చక జిల్లాలో జరిగే ఏ పార్టీ కార్యక్రమాలకు ఆయనను పిలవటం లేదు.
వాణికి అచ్చెన్న అండ ఉందని ఆరోపించిన శ్రీను
అటు యూ ట్యూబ్ ఛానెళ్లలో ఇంటర్వ్యూలు, స్టెప్పులు, కబుర్లతో శ్రీను, మాధురి జంట చేస్తున్న హడావిడి వారికి పొలిటికల్‌గా మరింత మైనస్ అవుతున్నాయి. లైకులు. షేర్లు చూసి మురిసిపోతున్న ఆ జంట.. ఇటు పార్టీ పరంగా పెరుగుతున్న వ్యతిరేకతను పట్టించుకోవడం లేదన్న వాదన ఉంది. ఆ క్రమంలో ప్రజాసమస్యలపై కలెక్టర్ గ్రీవెన్స్ లో వాణి గళ మెత్తటం ద్వారా చాలా అనుమానాలకు తెర దించారన్న చర్చ నడుస్తోంది. ముఖ్యంగా వాణికి మంత్రి అచ్చెన్నాయుడు అండదండలు ఉన్నాయని శ్రీను చేసిన ఆరోపణలకు, వాణి జనసేనలోకి వెళ్ళిపోతారంటూ సోషల్ మీడియాలో జరిగిన చర్చకు చెక్ పడింది. గ్రీవెన్స్‌లో గళమెత్త తాను వైసిపి లోనే కొనసాగుతానని వాణి స్పష్టంగా చెప్పినట్లైందన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది.
శ్రీనుని తప్పించి పేరాడ తిలక్ కు టెక్కిలి ఇన్ఛార్జ్ బాధ్యతలు
లేటెస్ట్‌గా పొలిటికల్ రీ ఎంట్రీ ఇచ్చిన వాణి శత్రువుకి శత్రువు మిత్రుడు అన్న సూత్రాన్ని కూడా పాటించారు. వాస్తవానికి టెక్కలి నియోజకవర్గ వైసీపీలో ముందు నుండి దువ్వాడ శ్రీనివాస్, పేరాడ తిలక్ వర్గాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. దువ్వాడ శ్రీను కుటుంబ వివాదం రోడ్డున పడటంతో వైసీపీ అధిష్టానం దువ్వాడ శ్రీనుని నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతల నుండి తప్పించి పేరాడ తిలక్ కి ఆ బాధ్యతలు అప్పజెప్పింది. ఇక అప్పటి నుండి ఈ ఇరువురు నేతల మధ్య మరింత దూరం పెరిగింది. ఈ నేపథ్యంలో నియోజకవర్గ ఇన్చార్జి అయిన పేరాడ తిలక్ తో కలిసి వాణి గ్రీవెన్స్ కి వెళ్ళటం పెద్ద చర్చకు దారితీస్తుంది.