ఆంధ్రప్రదేశ్

ఏపీ రాజకీయాల్లో మలుపులెన్నో

ఆంధ్రప్రదేశ్ : ప్రధాని మోదీ ఏపీ సీఎం జగన్‌తో ముచ్చట్లాడతారు. సర్కారును పొగుడుతారు. కేంద్రం నుంచి కావలసినంత సాయం చేస్తుంటారు. వైసీపీ నాయకులు మోదీ సభ కోసం ఏర్పాట్లు చేస్తారు. జనాలను వారే సమీకరిస్తారు. ఆ వెంటనే బీజేపీ కోర్‌ కమిటీలో.. అదే జగన్‌ సర్కారు అవినీతిపై, చార్జిషీట్‌ వేయమని మోదీ ఆదేశిస్తారు. జగన్‌ సర్కారుపై యుద్ధం చేయమని ప్రోత్సహిస్తారు. అదెలా సాధ్యమో అటు బీజేపీ నేతలకూ అర్ధం కాదు. జగన్‌ అటు వెళ్లిన వెంటనే.. జగన్‌ సర్కారు బాధితుడయిన, జనసేనాధిపతి పవన్‌తో మంతనాలు సాగిస్తారు. ఈ టక్కుటమార గోకర్ణ గజకర్ణ ముసుగు రాజకీయాలకు వేదిక విశాఖ!

ఈ సీన్‌ జరిగి కొద్దిరోజులయింది. అయినా అక్కడ ఏం జరిగింది? పవన్‌కు మోదీ ఏం హితబోధ చేశారు? ఇప్పుడే పవన్‌పై మోదీకి ఎందుకు ప్రేమపుట్టుకొచ్చింది? ఓ వైపు అభయహస్తం ఇచ్చిన జగన్‌ సర్కారుపైనే యుద్ధం చేయమని, మోదీ తన పార్టీ కోర్‌ కమిటీకి ఎందుకు ఉపదేశించారు? ఇవన్నీ ఇంకా రహస్యమే. ఈ పరిణామాలు టీడీపీకి నష్టమా? లాభమా? మారిన పవన్‌ వైఖరి జనసేన-బీజేపీకి లాభిస్తాయా? ఇన్ని గూడుపుఠాణీలకు కేంద్రమైన విశాఖ రహస్యమేమిటి? అసలు ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతోంది?.. ఇదీ ప్రశ్నార్ధకంగా మారిన ఏపీ రాజకీయ ముఖచిత్రం.

ఏపీ రాజకీయాలు చిత్ర విచిత్ర మలుపు తిరుగుతున్నాయి. ప్రధాని మోదీ విశాఖ పర్యటన తర్వాత, రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. ఇప్పటిదాకా జగన్‌ సర్కారుకు, తెరవెనుక ఆపన్నహస్తం అందిస్తూ వచ్చిన ప్రధాని మోదీ.. హటాత్తుగా వ్యూహం మార్చి, జగన్‌ సర్కారు అవినీతిపై చార్జిషీట్‌ వేయమని, బీజేపీ కోర్‌కమిటీని ఆదేశించడంతో ఏపీ రాజకీయాలు కొత్త మలుపు తిరిగాయి. తాజాగా మీడియాతో మాట్లాడిన బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు కూడా, జగన్‌ ప్రభుత్వ వైఫల్యాలపై బీజేపీ త్వరలో చార్జిషీట్‌ విడుదల చేస్తుందని ప్రకటించారు. ఈ కోణంలో చూస్తే, జగన్‌ సర్కారుపై బీజేపీ యుద్ధం ప్రకటించబోతోందని అర్ధమవుతుంది. ఇప్పటికే బీజేపీ మిత్రపక్షమైన జనసేన, ఎప్పటినుంచో జగన్‌ సర్కారుపై యుద్ధం చేస్తోంది.

సీఎం జగన్‌తో భేటీ అయిన ప్రధాని మోదీ, కేవలం అరగంట వ్యవధిలోనే.. జగన్‌ సర్కారు అవినీతి-వైఫల్యాలపై, చార్జిషీట్‌ వేయాలని బీజేపీ నేతలను ఆదేశించడమే, వైసీపీ-బీజేపీ వర్గాలకు ఇప్పటికీ అర్ధంకాకుండా ఉంది. ప్రధాని మోదీ విశాఖ సభకు ఆర్ధికవనరులు వెచ్చించి.. నానా కష్టాలు పడి జయప్రదం చేసిన వైసీపీ వర్గాలకు, మోదీ ఆదేశాలు సహజంగానే అశనిపాతంలా పరిణమించాయి. ఒకవైపు జగన్‌ సర్కారుకు కేంద్రం నుంచి అన్ని రకాల సహకారం అందిస్తూ, మరోవైపు అదే జగన్‌ సర్కారుపై యుద్ధం ఎలా చేయాలన్నది బీజేపీ వర్గాల్లో నెలకొన్న మరో గందరగోళం.

ఇక పవన్‌ కల్యాణ్‌తో మోదీ భేటీని, ఎలా అర్ధం చేసుకోవాలో తెలియక జనసేన-బీజేపీ-టీడీపీ వర్గాలు అయోమయంలో పడ్డాయి. గత ఎనిమిదేళ్లలో మోదీ ఏపీకి ఎన్నోసార్లు వచ్చినప్పటికీ, ఒక్కసారి కూడా పవన్‌కు అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదు. పవన్‌ ఢిల్లీకి వెళ్లినా, మోదీ దర్శనభాగ్యం దక్కలేదు. అలాంటిది హటాత్తుగా ప్రధాని కార్యాలయం నుంచి, పవన్‌కు పిలుపురావడం జనసైనికులను విస్మయపరిచింది.

విశాఖ ఘటన తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు-పవన్‌ భేటీ కావడమే మోదీ పిలుపునకు కారణమని టీడీపీ-జనసేన వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఒకవేళ పవన్‌ను చంద్రబాబు కలవకపోతే, పవన్‌ను ప్రధాని పట్టించుకునేవారే కాదన్న వ్యాఖ్యలు, అటు రాజకీయ వర్గాల్లోనూ వినిపిస్తున్నాయి. దాన్నిబట్టి చంద్రబాబుతో భేటీ, వారిద్దరూ కలిస్తే ప్రమాదమన్న ఆందోళనే పవన్‌ను, ప్రధాని పిలిచేలా చేసిందని జనసేన-టీడీపీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మరోవైపు ఈ భేటీ వివరాలు-దాని భవిష్యత్తు పరిణామాలేమిటో తెలియక, బీజేపీ వర్గాలు ఉత్కంఠకు గురవుతున్నాయి.

బీజేపీలోని ఒకవర్గం మాత్రం.. టీడీపీతో కలసి వెళ్లవద్దని సూచించడానికే, జనసేనాధిపతి పవన్‌ను ప్రధాని పిలిపించారని చెబుతోంది. భవిష్యత్తులో బీజేపీ-జనసేన కలసి పోటీ చేయాలని, టీడీపీతో కలసి ఉద్యమాలు నిర్వహించకూడదని పవన్‌కు మోదీ హితబోధ చేశారని ఆ వర్గం చెబుతోంది. అందుకు తగినట్లే.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఎంపీ జీవీఎల్‌ వచ్చే ఎన్నికల్లో జనసేనతో మాత్రమే పోటీ చేస్తామని చెప్పడం గమనార్హం. పనిలోపనిగా టీడీపీపై మళ్లీ దాడితీవ్రత పెంచడం ఆసక్తికలిగిస్తోంది.

అయితే రాజకీయ విశ్లేషకులు మాత్రం.. పైకి కనిపించేదంతా వ్యూహమేనంటున్నారు. జగన్‌కు మేలు చేసేందుకే, టీడీపీతో కలవకుండా.. పవన్‌తో విడి పోరాటాలకు మోదీ సిద్ధం చేయిస్తున్నారని చెబుతున్నారు. మరి అదే నిజమైతే.. జగన్‌పై చార్జిషీట్‌ వేయాలని మోదీ ఎందుకు ఆదేశిస్తారని మరో వర్గం ప్రశ్నిస్తోంది. తెలంగాణలో మాదిరిగా ఏపీలో కూడా వైసీపీ-బీజేపీ మధ్య యుద్ధం కేంద్రీకృతం చేసేలా, టీడీపీ ప్రాధాన్యం తగ్గించే రాజకీయ ఎత్తుగడ మాత్రమేనని జోస్యం చెబుతున్నారు.

దానికి తగ్గట్లుగానే.. మోదీతో భేటీ తర్వాత, పవన్‌లో మార్పు రావడాన్ని ప్రస్తావిస్తున్నారు. జగన్‌ను గద్దె దింపేందుకు, నాలుగు అడుగులు తగ్గేందుకైనా తాను సిద్ధమేనని పవన్‌ గతంలో ప్రకటించారు. తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడన్న బైబిల్‌ వాక్యం ఉదహరించారు. బాబుతో భేటీ తర్వాత, రెండు పార్టీలు ప్రభుత్వంపై కలసి ఉద్యమిస్తాయని చెప్పారు. కానీ, మోదీతో భేటీ తర్వాత, విజయనగరం వెళ్లిన పవన్‌.. వచ్చే ఎన్నికల్లో తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని పిలుపునిచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ వారి తాట తీస్తానన్నారు. దీన్నిబట్టి..మోదీ భేటీ ప్రభావం పవన్‌పై పనిచేయడం ప్రారంభించిందని స్పష్టమవుతుంది.

అయితే .. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను పవన్‌ తొలి నుంచీ వ్యతిరేకిస్తున్న పవన్‌.. ప్రధానితో భేటీ సందర్భంగా.. ఆ ప్రస్తావన తీసుకురాకపోవడమే ఆశ్చర్యం. ఈ అంశంలో బీజేపీతో విబేధిస్తానని పవన్‌ గతంలో స్పష్టం చేశారు. అదే అంశాన్ని ప్రధాని దృష్టికి తీసుకువెళ్లి .. ఎందుకు ఒత్తిడి చేయలేదన్న ప్రశ్నలు, రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. మోదీతో భేటీ తర్వాత.. మీడియాతో మాట్లాడిన పవన్‌ కూడా, విశాఖ ఉక్కు అంశంపై ప్రధానితో చర్చించనట్లు చెప్పకపోవడం ప్రస్తావనార్హం. అసలు పవన్‌ మీడియా సమావేశమే ముభావంగా కనిపించింది. ఆయనలో పెద్ద ఉత్సాహం ఉన్నట్లు కనిపించలేదు.

ఇక తాజా పరిణామాలు టీడీపీని సందిగ్థంలో పడేశాయి. పవన్‌తో జత కట్టి, ముందుకువెళ్లాలన్న టీడీపీ ఆశలను మోదీ గండికొట్టారా? లేక పవన్‌-బాబు భేటీని ప్రధాని తప్పుపట్టారా? అదీకాకపోతే జనసేన-బీజేపీ మాత్రమే కలసికదం తొక్కాలని హితబోధ చేశారా? అసలు జగన్‌ సర్కారుపై ఎలా వ్యవహరించాలన్న అంశంపై ప్రధాని ఏమైనా స్పష్టత ఇచ్చారా?

ఇవేమీ కాకపోతే.. ఎక్కడైతే పవన్‌కు అన్యాయం జరిగిందో, అదే విశాఖలో ఆయనకు గౌరవం కల్పించడానికే పవన్‌ను పిలిచారా? అన్న అంశాలు తెలియక టీడీపీ అయోమయంలో పడింది. ఎన్ని పరిణామాలు చోటు చేసుకున్నా వచ్చే ఎన్నికల్లో జనసేన తమతో కలసి పోటీ చేస్తుందని టీడీపీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

Leave a Reply