గవర్నర్‌గా చంద్రబాబు.. సీఎంగా పవన్.. డిప్యూటీ సీఎంగా లోకేష్?
KPS డిజిటల్ మీడియా నెట్‌వర్క్, విజయవాడ :- ఏపీలో సైలెంట్ గా వార్ జరుగుతోందా.. నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఏమో కానీ, టీడీపీ వర్సెస్ జనసేనగా ఈ అంశం మారుతున్న దాఖలాలు కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకుల అంచనా. ఓ వైపు టీడీపీకి చెందిన కొందరు లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాల్సిందేనని పట్టుబడుతుంటే, మరోవైపు జనసేనకు చెందిన కొందరు రివర్స్ ఎటాక్ చేస్తున్న పరిస్థితి సోషల్ మీడియాలో కనిపిస్తోంది. ఈ సైలెంట్ వార్ ఇప్పుడు గీత దాటే పరిస్థితి ఉండగా, రెండు పార్టీల అధినాయకులు జోక్యం చేసుకొని సద్దుమణిగించే పరిస్థితి కూడ వస్తోందని టాక్.
ఏపీలో ఇటీవల మంత్రి నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలన్న డిమాండ్ ను టీడీపీ క్యాడర్ వినిపిస్తోంది. ఇప్పటికే డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ కొనసాగుతున్నారు. కూటమి విజయంలో కీలక పాత్ర వహించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం పదవి వరించింది. పవన్ కూడ ఆ పదవికి తగినట్లుగానే నిరంతరం ప్రజల్లో ఉంటూ, తన హవా సాగిస్తున్నారు. సీఎం చంద్రబాబు కూడ ఎక్కడ కూడా పవన్ కు మర్యాదల్లో లోటు లేకుండా చూస్తున్నారు.
అయితే చంద్రబాబు తనయుడు నారా లోకేష్ కూడ ఎన్నికలకు ముందు యువగళం పేరుతో రాష్ట్రమంతా పాదయాత్ర నిర్వహించారు. ఎన్నికల తర్వాత లోకేష్ కు మంత్రి పదవి దక్కింది. అంతా సవ్యంగా సాగుతున్న వేళ ఒక్కసారిగా లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలన్న డిమాండ్ ను టీడీపీలోని కొందరు నేతలు వినిపిస్తున్నారు.
అంతటితో ఆగక సోషల్ మీడియాలో కూడ విస్తృత ప్రచారం సాగిస్తున్నారు. ఇదే ఇప్పుడు కొందరు జనసేన కార్యకర్తలకు రుచించడం లేదట. సీఎం కావాల్సిన తమ నాయకుడు పవన్, డిప్యూటీ తో సరిపెట్టుకున్నారని అందుకు సమానంగా లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి అంటూ టీడీపీ లోని కొందరు కావాలని ప్రచారం చేస్తున్నట్లు ఘాటుగా రిప్లై ఇస్తున్నారు.
దీనితో సోషల్ మీడియాలో గత రెండు రోజులుగా ఇరు పార్టీల కార్యకర్తల మధ్య వార్ సాగుతోంది. కొంత మంది జనసేన క్యాడర్ అయితే సంచలన కామెంట్స్ చేస్తున్నారు. సీఎం హోదాలో ఉన్న చంద్రబాబుకు గవర్నర్ పదవి, డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కు సీఎం, మంత్రి లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవులు ఇవ్వాలన్న కొత్త డిమాండ్ వినిపిస్తున్నారు. ఎలాగూ తమ అధినేతకు సీఎం కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయని, ఎన్డీఏ నేతలు ఆలోచించాలని కూడ ఉచిత సలహాలను కామెంట్స్ రూపంలో చేస్తున్నారు.
అయితే ఇంత ప్రచారాలు సాగుతున్నా లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవిపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడ కూడా ఒక్క మాట చెప్పక పోవడం విశేషం. అంతేకాదు సాక్షాత్తు లోకేష్ కూడ దీని గురించి పట్టించుకోని తీరులోనే తనపని తాను చేసుకుపోతున్నారు. అమిత్ షా పర్యటనలో పవన్ , లోకేష్ పక్కపక్కనే కూర్చొని మాట్లాడుకోవడం, నవ్వుకోవడం చూస్తే అసలు వారి మధ్య విభేదాలకు చోటులేదని చెప్పవచ్చు. కానీ కొందరు ఇరు పార్టీల కార్యకర్తలు మాత్రం సోషల్ మీడియా వేదికగా సై అంటే సై అంటూ కాలు దువ్వుతున్న పరిస్థితి ఉంది. మరి ఈ పరిస్థితిని ఇరు పార్టీల నేతలు ఎలా చక్కబెడతారో వేచి చూడాలి.