ఆంధ్రప్రదేశ్

సమర్ధుడు సజ్జల ఒక్కరేనా?

ఆంధ్రప్రదేశ్ : అసలే అప్పుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఖజానా.. అవసరం లేని సలహాదారుల నియామకాలతో మరింత బక్క చిక్కిపోతోంది. గత మూడున్నరేళ్లలో 45 మంది సలహాదారులను నియమించిన సర్కారు.. వారికి కోట్ల రూపాయల్లో ‘జీతాల హారతి’ పడుతోంది. ఇప్పటికే ప్రభుత్వానికి కన్సెల్టెంట్లు ఉండగా, పనిలేని సలహాదారులతో ఖజానా భోరుమంటోంది. అధికారపార్టీకి సేవలందించిన వారికి.. సలహాదారు పదవితో సంతృప్తిపరుస్తున్న వైనం, రాజకీయంగా అధికార వైసీపీకి లాభం కలిగిస్తోంది. అయితే ఆ నియామకాలు ఆర్ధికంగా ఖజానాకు నష్టంగా మారుతున్నాయి. ఇంతచేస్తే.. 45 మంది సలహాదారుల్లో సమర్ధుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఒక్కరే కనిపిస్తున్నారన్నది, పార్టీ-ప్రభుత్వ వర్గాల ఉవాచ. సర్కారు-పార్టీ జమిలిగా కష్టాల్లో పడినప్పుడల్లా ఆయనే ఆపద్బాంధవుడి అవతారమెత్తుతున్నారు. రాజకీయ ప్రత్యరుల్ధపై ఎదురుదాడికీ ఆయనే నాయకుడు. ఇలా అటు పార్టీ-ఇటు ప్రభుత్వంలో.. అలుపెరుగకుండా పనిచేస్తున్న సజ్జల తర్వాత, ఆ స్థాయిలో పనిచేసే సలహాదారులు భూతద్దం పెట్టి వెతికినా కనిపించడం లేదన్నది పార్టీ నేతల విశ్లేషణ.

సినీనటుడు అలీ పుణ్యమా అని ఏపీలో సలహాదారుల నియామకాల వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఇప్పటికే అలీ సహా, రాష్ట్రంలో 45 మంది వరకూ సలహాదారుల సంఖ్య చేరింది. పార్టీకి సేవలందించిన వారికి సలహాదారులతో సత్కరించడం, ఖజానాకు ఆర్థిక భారమవుతోందన్న ఆందోళన అధికారవర్గాల్లో వ్యక్తమవుతోంది. ఇప్పటికే 10వ తేదీ దాటినా ఉద్యోగులకు జీతాలివ్వలేని దుస్థితిలో.. డజన్ల సంఖ్యలో సలహాదారుల నియామకం అవసరమా అన్న చర్చకు తెరలేచింది. గతంలో చంద్రబాబు సర్కారు చేసిన నియామకాలను.. జగన్‌ ప్రభుత్వం బద్దలు కొట్టిందే తప్ప, ఆ నియామకాలతో సాధించిందేమీ లేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

గత మూడున్నరేళ్ల నుంచి 45 మంది సలహాదారులు తీసుకున్న జీతభత్యాలు అక్షరాలా 83.50 కొట్ల రూపాయలట. మిగిలిన ఒకటిన్నరేళ్లు కూడా కలిపితే వారు తీసుకున్న జీతభత్యాలు 138 కోట్లవుతాయి. వీరిలో క్యాబినెట్‌ హోదా ఉన్న వారి సంఖ్య 8. ఒకటవ కేటగిరి సలహాదారులకు నెలకు 5.82 లక్షల చొప్పున 41.90 కోట్లు ఇప్పటిదాకా వెచ్చించారు. ఇక రెండవ కేటగిరిలోని సలహాదారులకు నెలకు 2లక్షల 79 వేల రూపాయల చొప్పున, 24.1 కోట్లు ఖర్చుపెడుతున్నారు. మూడవ కేటగిరి సలహాదారులకు, నెలకు 4 లక్షలు చొప్పున ఇప్డటిదాకా 15.84 కోట్లు ఖర్చు చేశారు. ప్రత్యేక సలహాదారుకు 1.62 కోట్లు. ఆ ప్రకారంగా సలహాదారులకు ఏపీ సర్కారు ఇప్పటిదాకా చేసిన ఖర్చు 83.50. ప్రభుత్వ పదవీకాలం ముగిసేంతవరకూ, వారికయ్యే ఖర్చు 138 కోట్ల రూపాయలు. ఇదీ సలహాదారులకు ఏపీ సర్కారు పెడుతున్న ఖర్చు.

పోనీ వీరంతా ఆయా రంగాల్లో నిష్ణాతులా అంటే.. అదీ కాదు. సర్కారుకు ఏమైనా నివేదికల రూపంలో సలహాలిస్తున్నారా అంటే .. అదీ లేదు. ఇంకో ఆశ్చర్యమైన విషయమేమిటంటే.. అసలు ఏపీ నివసించే సలహాదారుల సంఖ్య తక్కువ. చాలామందికి ఏపీలో ఓటు హక్కు కూడా లేకపోవడం మరో ఆశ్చర్యం. వీరంతా హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై, ఢిల్లీలో ఎక్కువకాలం గడుపుతున్నారన్నది ఒక విమర్శ. వీరిలో ఒక్కరు కూడా సీఎం సమీక్షల్లో గానీ, మంత్రుల సమీక్షల్లో గానీ భూతద్దం వేసి వెతికినా కనిపించరు.

మాజీ సీఎస్‌ అజయ్‌ కల్లం ఒక్కరే సీఎం, మంత్రుల సమీక్షా సమావేశాల్లో కనిపిస్తుంటారు. జిల్లా పర్యటనలు చేస్తుంటారు. మిగిలిన వారి పేర్లు, వారు గతంలో ఏం చేశారన్న విషయం కూడా, చాలామంది వైసీపీ సీనియర్లకూ తెలియకపోవడం ఆశ్చర్యం. విదేశాల్లో కూడా ప్రభుత్వ సలహాదారులుండటం ఇంకో విశేషం. గతంలో టీడీపీ సర్కారు అమలుచేసిన.. సలహాదారుల విధానమే విమర్శలకు గురికాగా, ఇప్పుడు అంతకుమించిన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇక మొత్తం సలహాదారుల్లో చురుకుగా.. మంత్రులకు మించి పనిచేస్తున్నది ఒక్క సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రమే. పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో అటు పార్టీ వ్యవహారాలు- ఇటు ప్రభుత్వ సలహాదారుగా ఇటు ప్రభుత్వ వ్యవహారాల్లో క్రియాశీలకంగా వ్యవ హరిస్తున్నారు. వైసీపీ- జగన్‌ ప్రభుత్వంపై ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం- జనసేన చేసే రోజువారీ విమర్శల్లో, కీలక అంశాలకు సంబంధించి సజ్జల ఒక్కరే ఎదురుదాడి చేస్తున్నారు.

స్వతహాగా జర్నలిస్టు కావడంతో, మంత్రుల కంటే ఎక్కువ స్పష్టత మీడియాకు ఇవ్వగలుగుతున్నారు. కీలక అంశాలకు సంబంధించి, ప్రభుత్వ-పార్టీ విధానం ఎంతవరకూ ప్రజల్లోకి వెళ్లాలో, అంతవరకే పరిమితం చేయడం బట్టి, సజ్జల ఎంత ఆచితూచి మాట్లాడుతున్నారో స్పష్టమవుతోంది. ఆరకంగా.. ప్రభుత్వం-పార్టీ కష్టాల్లో పడినప్పుడల్లా, ఆయనే ఆపద్బాంధవుడి అవతారం ఎత్తుతున్నారు.

ఈ కారణాల వల్లనే రాష్ట్రంలోని పార్టీ నాయకులు, తమకు ఏ కష్టం వచ్చినా సజ్జలనే సంప్రదిస్తున్నారు. ఎమ్మెల్యేలు కూడా తమ సమస్యలను ఆయనకే మొరపెట్టుకుంటున్నారు. సీఎం జగన్‌ బీజీగా ఉండటంతో, ఆయన సూచన మేరకు వారంతా సజ్జలనే కలుస్తున్న పరిస్థితి. అందుకే మంత్రుల చాంబర్ల కంటే సజ్జల ఆఫీసే పార్టీ నేతలతో కిటకిటలాడుతుంది. వచ్చిన ఎమ్మెల్యేలు, నేతలు, సాధారణ కార్యకర్తలతో ఆయన ఉదయం నుంచి, రాత్రి వరకూ మాట్లాడుతూనే ఉండటం కనిపిస్తుంటుంది.

ఒక్కోసారి అర్ధరాత్రి వరకూ ఆయన సందర్శకులతో బిజీగా ఉంటున్నారంటే.. సజ్జలపై ఏ స్థాయిలో భారం ఉందో స్పష్టమనవుతోంది. సీఎం జగన్‌ తనపై పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా, దాన్ని నిలబెట్టుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలే, పార్టీ నేతల్లో సజ్జలపై నమ్మకం పెంచుతున్నాయి.

Leave a Reply