జాతీయ వార్తలు

భారత్ లో… కరోనా కొత్త వేరియంట్ బీఎఫ్.7

ఢిల్లీ : చైనాని వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్ భారత్ లో కూడా అడుగు పెట్టేసింది. ఏం మాయదారి చైనా రోగమో, ఎక్కడ అంటించుకున్నారో తెలీదుగానీ మొత్తం ప్రపంచానికి అంటించేశారు. కొన్ని కోట్ల మందిని పొట్టన పెట్టుకున్న మహమ్మారి తగ్గిందిరా బాబూ…అనుకునే లోపు మళ్లీ తన జన్మస్థానమైన చైనా లోనే కొత్త వేరియంట్ రూపంలో వచ్చేసింది.

ఒమ్రికాన్ (బీఎఫ్ 5) రూపాంతరం చెంది బీఫ్ 7గా వచ్చేసిందని అంటున్నారు. అప్పుడే ఇది భారతదేశం లో కూడా అడుగుపెట్టేసింది. రెండు కేసులు వెలుగుచూడటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇది అత్యంత వేగంగా విస్తరిస్తుందని అంటున్నారు.

అందుకే ప్రధాని నరేంద్రమోదీ వెంటనే అప్రమత్తమయ్యారు. వైద్య ఉన్నతాధికారులతో మాట్లాడుతూ వారానికి ఒకసారి ఈ విషయమై సమావేశం కావాలని, ఎప్పటికప్పడు బీఎఫ్7 వేరియంట్ తీవ్రతను పర్యవేక్షించాలని ఆదేశించారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ముఖ్యంగా అంతర్జాతీయ విమానాశ్రయాల్లో బందోబస్తు పటిష్టం చేశారు.

ఈ కొత్త వేరియంట్ కారణంగా మరో మూడునెలల్లో చైనాలో 60 లక్షల మంది కరోనా బారిన పడతారని అమెరికాలోని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇది వెంట వెంటనే మూడు దశల్లోకి విస్తరిస్తుందని అన్నారు. 2023 జనవరి మధ్యలో అంతమై, మళ్లీ ఫిబ్రవరిలో వస్తుందని, ఆ తర్వాత అదే ఏడాది డిసెంబర్ వరకు ఉంటుందని అంటున్నారు. దీనివల్ల చైనాలో 10 లక్షల మంది మరణించే అవకాశాలున్నాయని చెబుతున్నారు. అయితే లాక్ డౌన్ ఆంక్షలు మళ్లీ పెడితే పరిస్థితి అదుపులోనికి వస్తుందని లేదంటే, ఆ నష్టాన్ని ఊహించలేమని అంటున్నారు.

ఇప్పటికే శ్మశాన వాటికలన్నీ కిక్కిరిసిపోయి ఉంటే, రోజుకి ఐదుగురు మాత్రమే చనిపోతున్నారని చైనా చెప్పడం ఆత్మహత్యా సదృశ్యమేనని ప్రపంచదేశాలు విమర్శిస్తున్నాయి. రోజుకి 50 వేల కేసులు నమోదవుతున్నాయని హాంకాంగ్ పోస్ట్ రిపోర్ట్ చేసింది. ఆసుపత్రుల్లో మందులు అయిపోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆసుపత్రులన్నీ రోగులతో నిండిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

కరోనా మహమ్మారి ముగిసిపోయిందని చెప్పడం కరెక్ట్ కాదని, ఇది రకరకాల రూపాంతరాలు చెందుతోందనేది అర్థం అవుతోందని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు. అయితే చైనాలో మళ్లీ విజృంభించడం చూస్తుంటే కరోనా చివరి స్టేజ్ లో వచ్చిన ‘వైల్డ్‌ కార్డు’ ఎంట్రీ అని తెలిపారు.

అయితే కరోనా వైరస్ కీలక దశలో ఉందని, ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువన్నట్టు ఇది ముగింపు దశ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవిడ్ ఎమర్జెన్సీ కమిటీలో సలహాదారుడిగా ఉన్న డచ్ వైరాలజిస్టు మేరియన్ కూప్స్ మన్ పేర్కొన్నారు. అయితే కంగారు పడాల్సిన పనిలేదని, ఎందుకంటే ఒక దెబ్బ తినేసి ఉన్నాం కాబట్టి, జననష్టం అంతగా ఉండకపోవచ్చునని, ప్రజలు కూడా మళ్లీ ఎప్పటిలా కోవిడ్ నిబంధనలు పాటించాలని కోరారు. మాస్క్ లు తీయండి, శానిటైజర్లు వాడండి అంటూ తెలిపారు.

Leave a Reply