ఉపరాష్ట్రపతి ఎన్నిక వేళ…కీలక మలుపు…జగన్ నిర్ణయం…!!
KPS డిజిటల్ మీడియా నెట్‌వర్క్, విజయవాడ :- ఉప రాష్ట్రపతి ఎన్నిక వేళ ఏపీ కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ధన్కర్ రాజీనామా ఆమోదంతో ఎన్నికల సంఘం ఉప రాష్ట్రపతి ఎన్నిక కోసం కసరత్తు మొదలు పెట్టింది. లోక్ సభ – రాజ్యసభ సభ్యులతో కూడి ఎలక్టోరల్ కాలేజీ ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటుంది. ఏపీ నుంచి టీడీపీ, బీజేపీ, జనసేన మూడు పార్టీల ఎంపీలు ఎన్డీఏ అభ్యర్ధికే ఓటు వేస్తారు. మరి.. వైసీపీ ఓటు ఎవరికి. జగన్ నిర్ణయం ఏంటి. ప్రస్తుత పరిణామాల్లో జగన్ ఇదే అంశం పై నిర్ణయం.. రాజకీయంగా కీలక మలుపు కానుంది.
ఉపరాష్ట్రపతి ఎన్నిక
ఆకస్మికంగా ఉపరాష్ట్రపతి ధన్కర్ తన పదవికి రాజీనామా చేసారు. ఇప్పుడు జాతీయ స్థాయిలో ఈ వ్యవహారం సంచలనంగా మారింది. ఇదే సమయంలో వెంటనే కొత్త ఉపరాష్ట్రపతిని ఎంపిక చేయా లని ప్రధాని మోదీ డిసైడ్ అయ్యారు. తాజాగా రాష్ట్రపతి ధన్కర్ రాజీనామా ఆమోదించటంతో అటు ఎన్నికల సంఘం ఈ ఎన్నిక కోసం కసరత్తు మొదలు పెట్టింది. కాగా, రాజ్యాంగంలోని ఆర్టికల్ 66 ప్రకారం.. పార్లమెంటు ఉభయ సభల (లోక్‌సభ, రాజ్యసభ) సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటుంది. ఈ ఓటింగ్ రహస్య బ్యాలెట్ విధానంలో జరుగుతుంది. ఏపీలో మూడు పార్టీలు కూటమిగా ఉండటంతో… 21 మంది లోక్ సభ – 4 రాజ్యసభ సభ్యులు ఉన్నారు. వీరు కూటమి అభ్యర్ధికే మద్దతుగా ఓటింగ్ లో పాల్గొంటారు. కాగా, వైసీపీ ఎవరి వైపు నిలుస్తుందనేది చర్చ గా మారింది.
జగన్ మద్దతు ఎవరికి
2024 ఎన్నికల్లో వైసీపీని ఇదే కూటమి ఓడించటంతో జగన్ నిర్ణయం పైన పార్టీ నేతల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. 2018 సమయంలోనే టీడీపీ కూటమిలో ఉన్నా నాడు ఎన్డీఏ నిర్ణయాలకు జగన్ పార్టీ మద్దతు పలికింది. టీడీపీ ఆ తరువాత కూటమి నుంచి బయటకు రావటం.. 2019 లో ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చింది. 2024 ఎన్నికల వరకు కేంద్రంలోని ఎన్డీఏ బిల్లుకు వైసీపీ షరతు లు లేకుండానే మద్దతుగా నిలిచింది. కాగా, ఇప్పుడు ఏపీలో వైసీపీ నేతల పైన కేసులు.. వరుస అరెస్టుల వేళ జగన్ ఎన్డీఏకే మద్దతిస్తారా అనేది కీలక అంశంగా మారింది. జగన్ కు ఇంకా బీజేపీ ముఖ్య నేతల పరోక్ష మద్దతు ఉందని రాజకీయ వర్గాల్లో ప్రచారం ఉంది. దీంతో.. జగన్ కాంగ్రెస్ కూటమికి ఎట్టి పరిస్థితిల్లోనూ మద్దతు ఇవ్వరని.. ఎన్డీఏ వైపే నిలుస్తారని పార్టీ నేతల అంచనా.
కీలక మలుపు
కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ ఎన్డీఏ కూటమికి మద్దతుగా ఓటింగ్ చేయిస్తే ఇక భవిష్యత్ రాజకీయాలకు ఈ పరిణామం కీలకంగా మారనుంది. అయితే, ఎన్డీఏ కూటమికి ఉప రాష్ట్ర పతి ఎన్నికలో గెలిచేందుకు పూర్తి మెజార్టీ ఉంది. రెండు సభల్లోనూ 786 మంది సభ్యులకు ఓటు హక్కు ఉండగా.. అందులో గెలుపుకు 394 ఓట్లు అవసరం. కాగా, ఎన్డీఏకు 422 ఓట్ల మద్దతు ఉంది. అయితే, అవసరం లేకపోయినా బీజేపీ భవిష్యత్ రాజకీయాల కోసం ఇతర పార్టీలతో మైత్రి కొనసాగించటం 2014 నుంచి కొనసాగుతోంది. అదే 2018 లో వైసీపీని బీజేపీకి దగ్గర చేసింది. వైసీపీకి ఏడుగురు రాజ్యసభ… నలుగురు లోక్ సభ సభ్యుల బలం ఉంది. మరి.. జగన్ ఈ ఎన్నిక విషయంలో వేసే అడుగు భవిష్యత్ రాజకీయాలకు కీలక మలుపు కానుంది.