ఆంధ్రప్రదేశ్

‘ఇదేం ఖర్మ’ పేరుపై సీనియర్ల అభ్యంతరాలు

ఏపీ : తెలుగదనం ఉట్టిపడే పేర్లు పెట్టడంలో తెలుగుదేశం పార్టీకి ఓ ప్రత్యేకత ఉంది. ఎన్టీఆర్‌ నుంచి చంద్రబాబునాయుడు వరకూ ప్రభుత్వ-పార్టీకి సంబంధించిన అనేక పేర్లు అలా వచ్చినవే. మీకోసం, మళ్లీ వస్తున్నా వంటి జనాకర్షక నిదానాలతో చేపట్టిన అనేక కార్యక్రమాలు సూపర్‌హిట్టయ్యాయి. అలాంటి తెలుగుదేశం తాజాగా ఒక కార్యక్రమానికి పెట్టిన పేరు అంతర్గతంగా విమర్శలపాలవుతోంది. ‘ఇదేం ఖర్మ’ పేరుతో డిసెంబర్‌ 1 నుంచి ప్రారంభించనున్న కార్యక్రమంపై టీడీపీలోని అన్ని వర్గాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి.

ఏపీ సీఎం జగ న్‌ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా.. ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ ఇటీవలి కాలంలో, భారీ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. వాటిలో భాగంగా ‘బాదుడే బాదుడు’ పేరుతో నిర్వహిస్తున్న నిరసన ప్రదర్శనలు, జనాలకు చేరువవుతున్నాయి. వాటికి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, లోకేష్‌, ఇతర సీనియర్లు కూడా స్వయంగా పాల్గొంటున్నారు. ఇటీవల చంద్రబాబు నిర్వహించిన కర్నూలు జిల్లా పర్యటన కూడా అంచనాలకు మించి విజయవంతమయింది. ఆ క్రమంలో డిసెంబర్‌ 1 నుంచి, మరో కొత్త నిరసన కార్యక్రమం నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది.

దానికి ఏం పేరు పెట్టాలన్న దానిపై చర్చ జరుగుతున్న సమయంలో, టీడీపీ వ్యూహకర్త రాబిన్‌శర్మ బృందం రంగంలోకి దిగింది. ఆ కార్యక్రమాలకు ‘ఇదేం ఖర్మ’ అన్న పేరు నిర్ణయించారు. అయితే పార్టీ నాయకత్వానికి సన్నిహితంగా ఉండే వర్గాలు మాత్రం, ఆ పేరును వ్యతిరేకించనట్లు సమాచారం.

తాజాగా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్వహించిన సమావేశంలో ఈ పేరుపై చర్చకు వచ్చినట్లు తెలిసింది. చంద్రబాబునాయుడు ఈ పేరు ప్రతిపాదించిన సందర్భంలో దాదాపు ఒకరిద్దరు తప్ప, మిగిలిన వారంతా అభ్యంతరం వ్యక్తం చేశారు. యనమల రామకృష్ణడు, ఎమ్మెల్యే రామానాయుడు, దేవినేని ఉమ, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, బోండా ఉమ, పంచుమర్తి అనురాధ వంటి సీనియర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

వీరిలో ఒకరిద్దరు తప్ప, మిగిలిన వారంతా ఆ పేరుపై అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ‘ఇదేం ఖర్మ’ అనేది మనుషుల సెంటిమెంట్‌కు సంబంధించినదని, పైగా ఇది అధికార వైసీపీ అవకాశంగా తీసుకుని, పార్టీపై వ్యంగ్యాస్ర్తాలు సంధించడానికి మనమే అవకాశం ఇచ్చినట్లవుతుందన్నారు.

ఆ క్రమంలో కొందరు సీనియర్లు మరికొన్ని పేర్లు సూచించారు. ప్రభుత్వ వ్యతిరేకతను ప్రతిబింబించే ఆ పేర్లపై చర్చించారు. అయితే అవేమీ చంద్రబాబును సంతృప్తి పరచలేకపోయినట్లు పార్టీ వర్గాల సమాచారం. ఇదేం ఖర్మ పేరయితే జనంలోకి బాగా వెళుతుందని, కొద్దిరోజుల తర్వాత జనం ఆ పేరు విలువ తెలుసుకుంటారని, బాబు వారి అభ్యంతరాలను త్రోసిపుచ్చారు. చివరకు చంద్రబాబును మరింత ఇబ్బంది పెట్టడం ఇష్టం లేని సీనియర్లు, ‘ఇదేం ఖర్మ మన రాష్ర్టానికి’ అని పెట్టాలని ముక్తకంఠంతో సూచించగా, చంద్రబాబు మౌనం వహించనట్లు సమాచారం.

కాగా.. ఇలాంటి పేర్లు పెట్టడం వల్ల టీడీపీలో, మేధావులు మాయమయ్యారన్న సంకేతాలు జనంలోకి వెళ్లే ప్రమాదం ఉందని సీనియర్లు తలపట్టుకుంటున్నారు. గతంలో వివిధ అంశాలపె,ై నేతల అభిప్రాయాలు తీసుకునే చర్చించే సంప్రదాయం ఉండేదని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు అలాంటి సంప్రదాయం స్థానంలో వ్యూహకర్తల నిర్ణయాలు అమలుచేసే దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈవిధంగా కీలకమైన నిర్ణయాలు తీసుకునే సందర్భంలో.. సీనియర్ల అభిప్రాయాలు తెలుసుకునే విధానం పార్టీలో, క్రమక్రమంగా అంతరించిపోతోందని ఓ మాజీ మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రం గురించి ఏమీ తెలియని ఒక వ్యూహకర్త చేతిలో పార్టీని పెడుతున్నారంటే, నాయకత్వంలో చైతన్యం-స్ఫూర్తివంతమైన ఆలోచనలు కరవవుతున్నాయని అర్ధమవుతోందని మరో సీనియర్‌ నేత వ్యాఖ్యానించారు.

‘ మా సార్‌కు కనీసం మీలాంటి వాళ్లయినా చెప్పండి. మేం చెబితే వినడం లేదు. రేపు ప్రెస్‌మీట్‌లో మాట్లాడే సమయంలో ‘ఇదేం ఖర్మ’కు జనం బాగా వచ్చారని చెప్పాలా? ఇదేం ఖర్మ సక్సెస్‌ అయిందని చెప్పాలా? మాకు మాత్రం ఈ పేరు చాలా ఇబ్బందిగా ఉంద’ని ఓ సీనియర్‌ నేత పార్టీ ఆఫీసులో మీడియా ప్రతినిధుల వద్ద వ్యాఖ్యానిస్తున్నారు. ‘రాబిన్‌శర్మ మా పార్టీకి ఓ ఖర్మ’ అని సీనియర్లు మీడియా ప్రతినిధుల వద్ద సెటైర్లు వేస్తున్నారు.

అంటే రాబిన్‌శర్మ ప్రవచిత ‘ఇదేం ఖర్మ’ పేరు పై, పార్టీ వర్గాల్లో ఏ స్థాయిలో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయో స్పష్టమవుతోంది. అదే సమయంలో రాబిన్‌శర్మ వ్యూహకర్తగా, పార్టీకి ఏం ఉపయోగపడుతున్నారో తమకు అర్ధం కావడం లేదని టీడీపీ సీనియర్లు వాపోతున్నారు. రాబిన్‌శర్మ సహచరుడయిన ప్రశాంత్‌కిశోర్‌, వైసీపీని విపక్షంలో సమర్ధవంతంగా నడిపించారని గుర్తు చేస్తున్నారు. కానీ రాబిన్‌శర్మ తమ పార్టీని ఏం నడిపిస్తున్నారో, ఎటు తీసుకువెళుతున్నారో తమకు అర్ధం కావడం లేదని వ్యాఖ్యానిస్తున్నారు. సుదీర్ఘకాలం నుంచి రాజకీయాల్లో ఉన్న తమ కంటే… ఎక్కడో ఉండో రాబిన్‌శర్మ లాంటి వ్యూహకర్తలకు స్థానిక సమస్యలు, ప్రజల మనోభావాలు ఏం తెలుసని ప్రశ్నిస్తున్నారు.

Leave a Reply