తెలంగాణ

హైదరాబాద్ మెట్రో స్టేషన్లో యువకుడికి వల వేసిన మహిళ.. ఆపై

హైదరాబాద్ : ఓ యువకుడికి ఓ కిలాడీ లేడీ మెట్రోస్టేషన్ లోనే వల వేసింది. ఆపై నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి దోపిడికి పాల్పడింది. దాంతో ఆ యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమెను, మరో ఇద్దరు నిందితులను వారు అరెస్టు చేశారు. ఈ ఘటన హైదరాబాద్ లో జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..హైదరాబాద్‌ కేపీహెచ్‌బీ కి చెందిన శ్రీధర్‌ అనే యువకుడు భద్రాచలం వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. అందుకోసం ఈనెల 22న ఉదయం కేపీహెచ్‌బీ మెట్రోస్టేషన్‌కు వెళ్లాడు. అక్కడ స్టేషన్‌లో ఉన్న విజయ అనే మహిళ.. యువకుడిని పరిచయం చేసుకుంది. మాయమాటలు చెప్పి యువకుడిని భద్రాచలం ప్రయాణం వాయిదా వేసుకునేలా చేసింది.
ఆ తర్వాత అతడిని ఆటోలో ఎల్లమ్మబండలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లింది. అక్కడ అప్పటికే జోగేందర్ సింగ్, ముత్యాల విష్ణు అనే వ్యక్తులు ఉన్నారు. వారు శ్రీధర్‌పై బెదిరింపులకు దిగారు. యువకుడి వద్ద నుంచి ఫోన్‌, వాచ్‌, పర్సు లాక్కునేందుకు ప్రయత్నించారు. దాంతో మోసపోయానని గ్రహించిన యువకుడు వారపై ఎదురు తిరిగాడు. అయితే యువకుడిపై నిందితులిద్దరూ దాడికి దిగారు. యువకుడి మెడలో ఉన్న బంగారు గొలుసు లాక్కున్నారు. ఇక వారి నుంచి తప్పించుకున్న యువకుడు..
భద్రాచలం వెళ్లాడు. ఈ ఘటన గురించి తన స్నేహితుడికి చెప్పి.. అతడి సాయంతో జగద్గిరిగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. యువకుడిని మోసం చేసిన ముగ్గురు నిందితులు విజయ, జోగేందర్ సింగ్, ముత్యాల విష్ణులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 10 గ్రాముల బంగారు గొలుసు, రెండు బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకన్నారు. అనంతరం నిందితులను రిమాండ్‌కు తరలించారు.

Leave a Reply