క్రీడా వార్తలు

నేస్తమా త్వరగా కోలుకో..: సచిన్‌

ముంబై : న్యూజిలాండ్‌ మాజీ క్రికెటర్‌, దిగ్గజ ఆల్‌రౌండర్‌ క్రిస్‌ కెయిన్స్‌ పక్షవాతం బారినపడ్డ సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియాలో గుండెకు ఎమర్జెన్సీ సర్జరీ చేసేటప్పుడు వెన్నెముకలో స్ట్రోక్‌ రావడంతో రెండు కాళ్లు చచ్చుబడిపోయాయి. ప్రస్తుతం అతనికి రీహాబిలిటేషన్ ప్రక్రియ నిర్వహించేందుకు ఆస్ట్రేలియాలోనే మరో ఆసుపత్రికి తరలించి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కాగా క్రిస్‌ కెయిన్స్‌ త్వరగా కోలుకోవాలంటూ బ్యాటింగ్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ చేసిన ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

” గెట్‌ వెల్‌ సూన్‌ క్రిస్‌ కెయిన్స్‌.. నేస్తమా త్వరగా కోలుకో.. నీ ఆరోగ్యం తొందరగా బాగవ్వాలని దేవుడిని మనస్పూర్తిగా కోరుకుంటున్నా.” అంటూ ట్వీట్‌ చేశాడు. కాగా 51 ఏళ్ల క్రిస్‌ కెయిన్స్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో 1989 నుంచి 2006 వరకు న్యూజిలాండ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. తన 17 ఏళ్ల కెరీర్‌లో కెయిన్స్‌ కివీస్‌ తరపున 62 టెస్టుల్లో 3320 పరుగులు.. 218 వికెట్లు , 215 వన్డేల్లో 4950 పరుగులు.. 201 వికెట్లు పడగొట్టాడు. టెస్టు, పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మంచి ఆల్‌రౌండర్‌గా పేరు పొందిన కెయిన్స్‌ ఎక్కువగా ఆరు, ఏడు స్థానాల్లో బ్యాటింగ్‌కు దిగేవాడు.

Leave a Reply