జాతీయ వార్తలు

ముంబయిలో ఒక్కరోజులో 1.36 లక్షల కేసులు.. అప్రమత్తమైన బీఎంసీ

ముంబయి : కరోనా మూడో దశ త్వరలోనే రానుందని.. ఈ వేవ్‌ కారణంగా మహారాష్ట్రలో దాదాపు 60 లక్షల మంది వైరస్‌ బారిన పడతారనే సమాచారంతో ముంబయి అధికారులు అప్రమత్తమయ్యారు. నగర ప్రజలకు అవసరమయ్యే ఆరోగ్య సదుపాయాలు.. ముఖ్యంగా ఆసుపత్రి పడకలు, ఆక్సిజన్‌ సిలిండర్లను అందుబాటులో ఉంచేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు బృహన్‌ ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ (బీఎంసీ) తెలిపింది. థర్డ్‌వేవ్‌ నేపథ్యంలో ఆసుపత్రుల్లో 30వేల పడకలను సిద్ధం చేస్తున్నట్లు బీఎంసీ అదనపు మున్సిపల్‌ కమిషనర్‌ సురేశ్‌ కాకానీ పేర్కొన్నారు. నగరంలో ఆక్సిజన్‌ కొరత ఏర్పడకుండా చెంబూర్‌, మహాలక్ష్మి ప్రాంతాల్లో ఆక్సిజన్‌ రీఫిల్లింగ్‌ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

రెండో వేవ్‌లో మంబయిలో 21వేల పడకలు అందుబాటులో ఉంచామని.. ఆ సంఖ్యను ఇప్పుడు 30వేలకు పెంచనున్నట్లు సురేశ్‌ కాకానీ పేర్కొన్నారు. అయితే ఈ బెడ్లను ఒకేసారి అందుబాటులోకి తీసుకురామని.. అవసరాన్ని బట్టి దశలవారీగా అందుబాటులో ఉంచుతామని వెల్లడించారు. ‘మనకు ఉన్న వనరులను తెలివిగా ఉపయోగించుకోవాలని రెండో వేవ్‌ సమయంలోనే గుర్తించాం. అవసరం లేకున్నా ఆ వనరులను యాక్టివ్‌గా ఉంచడంలో ఎలాంటి ప్రయోజనం లేదు. ఒక్కరోజులో 10వేల మంది ఆసుపత్రుల్లో చేరినా వారికి తగిన ఏర్పాట్లు చేస్తాం’ అని వివరించారు.

సెకండ్‌వేవ్‌ సమయంలో మార్చి 11న ముంబయిలో 91,100 కేసులు నమోదయ్యాయి. మూడో దశ ఉద్ధృతి అధికంగా ఉంటే ఒక్కరోజులోనే 1.36 లక్షల కేసులు వెలుగుచూసే అవకాశాలున్నట్లు ప్రభుత్వం అంచనా వేస్తోంది. కొవిడ్‌ మొదటి, రెండో దశ సమయంలో ముంబయిలో పెద్దఎత్తున కేసులు వెలుగుచూశాయి. మూడో దశలోనూ ఈ తరహాలోనే కేసులు బయటపడతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రానున్న పలు పండగల నేపథ్యంలో కేసులు విపరీతంగా పెరిగే అవకాశాలున్నాయని హోంమంత్రిత్వ శాఖ కూడా వెల్లడించింది.

Leave a Reply