సిని వార్తలు

ఆమెను కలిసిన వారికి డయాబెటిస్‌ వస్తుందేమో: రామ్‌ గోపాల్‌వర్మ

ఇంటర్నెట్‌ డెస్క్‌ : ‘నలభై ఏళ్ల క్రితం నాకు ఇలాంటి అమ్మాయి కనిపించి ఉంటే నేనిప్పుడు ఇలా ఉండేవాడ్ని కాదేమో’ అని నాయిక మేఘ ఆకాశ్‌ని ఉద్దేశించి ప్రముఖ దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ అన్నారు. ‘డియర్‌ మేఘ’ చిత్రం ప్రీరిలీజ్‌ వేడుకకి రామ్‌ గోపాల్‌ వర్మ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మేఘ ఆకాష్‌, అరుణ్‌ అదిత్‌, అర్జున్‌ సోమయాజుల ప్రధాన పాత్రల్లో నటించిన ‘డియర్‌ మేఘ’ చిత్రానికి సుశాంత్‌ రెడ్డి దర్శకత్వం వహించారు. అర్జున్‌ దాస్యన్‌ నిర్మించారు. భావోద్వేగాలే ప్రధానంగా రూపొందిన ఈ ప్రేమకథా చిత్రం సెప్టెంబర్‌ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నేపథ్యంలో ప్రీరిలీజ్‌ వేడుకను చిత్రబృందం ఏర్పాటు చేసింది. రామ్‌ గోపాల్‌ వర్మ మాట్లాడుతూ.. ‘మేఘ చాలా స్వీట్‌గా ఉంటుంది. తనని కలిసిన వారికి డయాబెటిస్‌ వస్తుందని నా అభిప్రాయం.

40 ఏళ్ల క్రితం నాకు ఇలాంటి అమ్మాయి కనిపించి ఉంటే నేనిప్పుడు ఇలా ఉండేవాడ్ని కాదు. మేఘని పొగిడినట్టు హీరో అదిత్‌ని పొగిడితే నన్ను మరోలా అనుకుంటారు కాబట్టి అలా నేను చేయను. అదిత్‌ మంచి నటుడు. త్వరలోనే అతనితో ఓ సినిమా చేయబోతున్నా.

ఈ సినిమా పాటలు, టీజర్‌, ట్రైలర్‌ చాలా బాగున్నాయి. చిత్ర బృందానికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా’ అని అన్నారు. ‘గతంలో నా పేరు మీద పాట వచ్చింది. ఇప్పుడు సినిమా వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.

ఈ చిత్రం నాకు ప్రత్యేకమైంది. నాకు అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకి ధన్యవాదాలు’ అని మేఘ పేర్కొంది. ఈ కార్యక్రమంలో ఈ చిత్ర నటులతోపాటు పలువురు యువ గాయకులు, కథానాయకుడు కిరణ్‌ అబ్బవరం తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply