ఆంధ్రప్రదేశ్

ఆంధ్రాలో దేవదాయ లీలలు

ఏపీ : దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్న సామెత.. ఏపీ దేవదాయ శాఖలో అక్షర సత్యంగా కనిపిస్తోంది. ప్రభుత్వం నయాపైసా నిధులు ఇవ్వాల్సిన అవసరం లేని ఆ శాఖలో.. ముఖ్య కార్యదర్శి, కమిషనర్లే కీలకం. అందుకే మిగిలిన శాఖల మాదిరిగా ఆ శాఖకు, ఆర్ధిక శాఖలో ఎలాంటి అడ్డంకులు ఉండవు. ఎందుకంటే ప్రభుత్వం వారికి బడ్జెట్ ఏమీ ఇవ్వదు కాబట్టి. మిగిలిన శాఖలకు సర్కారే నిధులివ్వాలి. కాబట్టి ఏ ఫైలయినా ఆర్ధిక శాఖలో ఏళ్లూ, పూళ్లూ పడుతుంది. దేవదాయ శాఖ యవ్వారం అలా కాదు. అయినా సరే వందల పోస్టులు ఖాళీగా పడి ఉంటాయి.

చివరాఖరకు ఖాళీల భర్తీకి.. రెవిన్యూ శాఖ నుంచి డిప్యుటేషన్లకు సర్కారు అవకాశం ఇచ్చినా, దానికీ మోకాలడ్డే. ఎందుకంటే ఆ శాఖపై మంత్రిది కాదు పెత్తనం. సదరు శాఖలో సచివుడు ఉత్సవ విగ్రహమే. మంత్రిగా ఉన్నది ‘కొట్ట’యినా… అసలు మూలవిరాట్టు.. విష్ణుమూర్తిలా చక్రం తిప్పేది మాత్రం విశాఖ స్వామిలోరే.

ఆ జగ ద్గురువయిన.. ‘జగన్గురువు’ మాటే ఆ శాఖలో వేదం. చెప్పిందే శాసనం. ఆయన ముందు సెక్రటరీలు, కమిషనర్లు, ఆర్జేసీలు పరమాణువులే. మంత్రి నుంచి కమిషనర్ల వరకూ ఆయన దివ్యసన్నిధికి చేరుకుని, స్వామివారికి కృపకు పాత్రులు కావలసిందే. సర్కారులో అంత మహిమాన్వితుడాయన.

అంత అమేయ శక్తిసంపన్నులు కాబట్టే.. సర్కారు ఇచ్చిన వెసులుబాటును స్వాములోరు వీటో చేశారు. ఇప్పుడు దేవదాయ శాఖలో, సదరు స్వాములోరికి ఏకంగా ఒక వర్గమే తయారయింది. ఈ వర్గమే స్వాములోరితో డిప్యుటేషన్లకు వీటో చేయించింది. నమ్మటం లేదా?.. అయితే సదరు స్వాములోరి, అమేయ మహిమాన్విత శక్తేమిటో మీరే చూసి తరించండి. ఆ ‘నారాయణ’కథను మీరే వినండి.

ఏపీ దేవదాయ శాఖ ఖాళీలతో ఏళ్ల తరబడి ‘కొట్టు’ మిట్టాడుతోంది. ఈఓ, రెగ్యులర్ ఆర్జేసీల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఫలితంగా శాఖలో ఇన్చార్జిల రాజ్యం నడుస్తోంది. అంటే ఒక్కోరు మూడు, నాలుగు పోస్టుల్లో పనిచేయాల్సిన పరిస్థితి. అయినా మంత్రి కొట్టు సత్యనారాయణకు, సొంత శాఖ సమస్యలు పట్టడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

అయితే మరోవైపు మాత్రం.. పేరుకు కొట్టు మంత్రి అయినప్పటికీ, పెత్తనమంతా విశాఖ స్వాములోరిదేనన్న ప్రచారం జరుగుతోంది. దానితో మంత్రి కొట్టు.. దేవాలయ దర్శనాలు చేస్తున్నారన్న వ్యాఖ్యలు, దేవదాయ శాఖలో వినిపిస్తున్నాయి.

ఏపీలోని 8 పెద్ద దేవాలయాల నుంచే, ఆ శాఖకు సింహభాగం ఆదాయం వస్తుంది. అయితే విచిత్రంగా అందులో ఒక్క ఆలయానికి మాత్రమే పూర్తి స్థాయి ఈఓ ఉండగా, మిగిలిన ఏడు ఆలయాలకూ ఇన్చార్జి ఈఓలే దిక్కయ్యారు. 11 మంది ఆర్జేసీలు ఉండాల్సి ఉంది. అయితే అందులోనూ.. కేవలం ఐదుగురే రెగ్యులర్ ఆర్జేసీలుండగా, మిగిలిన వారంతా ఇన్చార్జులే.

నిజానికి ఏపీ దేవదాయ శాఖపై పనిభారం, ఒత్తిళ్లు ఎక్కువ. 6 ఏ, 6 బీ, 6 సీ ఆలయాల్లో.. 6 ఏ, 6 బీ ఆలయాలకు వీఐపీల తాకిడి ఎక్కువ. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఐఏఎస్, ఐపిఎస్ అధికారులు, మాజీ ఎమ్మెల్యేల తాకిడి, ఈ తరహా ఆలయాలకు ఎక్కువగా ఉంటుంది. వారితో వచ్చే సిబ్బంది, అనుచరుల సంఖ్య వారికి అదనం. వారందరికీ సకల మర్యాదలు చేయాల్సిందే. కాబట్టి వారికి ప్రొటోకాల్, ఇతర సేవలకు ప్రత్యేకంగా సిబ్బంది అవసరం ఉంటుంది. కానీ చాలాకాలం నుంచి నియామకాలు నిలిచిపోవడంతో, ఉన్న ఉద్యోగులపై పనిభారం పెరుగుతోంది.

నిజం చెప్పాలంటే దేవదాయ శాఖలో, ప్రస్తుతం పనిచేస్తున్న సిబ్బంది 480 మంది మాత్రమే. అవును. ఆ 480 మందితోనే అధికారులు పనిచేయించుకుంటున్న వైచిత్రి. మరో 435 పోస్టులు ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్నా, వాటిని భర్తీ చేసేందుకు దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి, ఎందుకో పెద్దగా ఆసక్తి చూపించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అందులో 66 పోస్టులకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. 257 పోస్టులు నేరుగా భర్తీ చేసుకునే వెసులుబాటు ఇచ్చినా దానినీ సద్వినియోగం చేసుకోకపోవడమే ఆశ్చర్యం.

అసలు ‘మీ శాఖలో ఉన్న ఖాళీలన్నీ భర్తీ చేసుకోండి. మేము అనుమతిస్తున్నాం’అని ప్రభుత్వమే, దేవదాయ శాఖకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేసింది. సహజంగా ప్రభుత్వం అనుమతించినప్పటికీ, నిధుల సాకుతో కాళ్లూ వేళ్లూ పెట్టే ఆర్ధిక శాఖ కూడా.. ‘మీ ఖాళీలన్నీ భర్తీ చేసుకోండి’ అని అనుమతించింది. ఎందుకంటే.. ఆర్ధికశాఖేమీ దేవదాయ శాఖకు నిధులు మంజూరు చేయదు కాబట్టి!

రాష్ట్రంలోని ఏ శాఖలో అయినా ఖాళీలు భర్తీ చేసుకోవాలంటే, అందుకు ప్రభుత్వ అనుమతి అవసరం. ఒకవేళ ప్రభుత్వం ఆ శాఖల్లో పోస్టులు మంజూరు చేసినా, ఆర్ధిక శాఖ వెంటనే ఆమోదించదు. ఆర్ధిక అంశాలన్నీ చూసుకుని, కొన్నేళ్లకు గానీ వాటికి మోక్షం ఇవ్వదు. ఇది కొన్ని దశాబ్దాల నుంచి చూస్తున్న సంప్రదాయమే. ఆవిధంగా ప్రభుత్వం అంగీకరించిన అనేక ఫైళ్లు, ఇప్పటికీ ఏళ్ల తరబడి ఆర్ధిక శాఖ కచేరీలో మూలుగుతున్నాయి.

కానీ దేవదాయ శాఖ పరిస్థితి అందుకు భిన్నం. ఎందుకంటే ప్రభుత్వం దేవదాయ శాఖకు నయాపైసా నిధులివ్వదు. ఇంకా విచిత్రమేమిటంటే.. దేవదాయ శాఖ మంత్రి, కమిషనర్ల పేషీలకు దేవదాయ శాఖ సిబ్బందినే డిప్యుటేషన్‌పై తీసుకుంటారు. ఈఓ, అర్చకులు, సిబ్బందికి జీతాలు కూడా ప్రభుత్వం ఇవ్వదు. ఆలయ ఆదాయం నుంచే వాటిని సర్దుబాటు చేస్తారు.

ఒకవేళ ఒక ఆలయంలో పనిచేసే ఈఓకు, ఆ ఆలయంలో నిధులు రాక కొంత జీతం నిలిచిపోతే.. ఆయన ఇన్చార్జిగా ఉన్న మరో దేవాలయం నుంచి, మిగిలిన వేతనం తీసుకునే వెసులుబాటు ఉంది. ఏ పండుగకు ఎంత ఖర్చు పెట్టుకోవాలో ఆలయ అధికారులే నిర్ణయిస్తారు తప్ప, ప్రభుత్వం పట్టించుకోదు. ప్రభుత్వం నిధులు మంజూరు చేయదు.

ఇంకో ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే… దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్ల జీతాలు ప్రభుత్వం ఇస్తుందనుకుంటే.. తప్పులో కాలేసినట్లే. వారి జీతాలు కూడా, భక్తులు గుళ్లకు ఇచ్చే విరాళాల నుంచే చెల్లిస్తారు. మిగిలిన ఐఏఎస్‌ల మాదిరిగా వారు ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకోరు. వారికి దేవదాయశాఖనే మహరాజ పోషకురాలు. అంటే ప్రభుత్వం పూర్తిగా దేవదాయ శాఖపై వాలిపోయిందన్నమాట.

పైగా కామన్‌గుడ్ ఫండ్ పేరుతో.. ఆయా ఆలయాల స్థాయిని బట్టి, ప్రభుత్వమే దేవాలయాల నుంచి డబ్బులు తీసుకుంటుంది. తిరుపతి వంటి పెద్ద ఆలయాల నుంచి, పట్టణాల్లో ఉండే సాధారణ ఆలయాల వరకూ, కొన్ని దశాబ్దాల నుంచి జరుగుతోంది ఇదే. కానీ దేవాలయాల నుంచి, డబ్బులు వసూలు చేసే ప్రభుత్వం.. మసీదు, చర్చిల సంపాదనలో జోక్యం చేసుకోవు. వాటి నుంచి డబ్బు వసూలు చేయకపోగా, ప్రభుత్వమే వాటి నిర్మాణాలకు నిధులిస్తుంది. కానీ ఆలయాల నిర్మాణాలకు నిధులివ్వదు. చర్చి-మసీదులో పనిచేసే ఫాదర్లు, ముల్లాలకు గౌరవ వేతనాలిస్తుంది. అది వేరే కథ.

అలాంటి వెసులుబాటును వినియోగించుకోవడంలో, దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి కార్యాలయం, ఘోరంగా విఫలమవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. శాఖలో 435 పోస్టుల భర్తీకి అటు ప్రభుత్వం – ఇటు ఆర్ధిక శాఖ అంగీకరించినా, దేవదాయ శాఖ ఉన్నతాధికారులు మాత్రం, మీనమేషాలు లెక్కిస్తుండటం ఆశ్చర్యం.

ముఖ్యంగా పెద్ద దేవాలయాలకు ఈఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏడెనిమిది ఆలయాలకు, ఒక ఈఓ ఇన్చార్జిగా వ్యవహరించాల్సిన పరిస్థితి. ఆయా దేవాలయాలు దూరంగా ఉండటంతో, ఈఓలు ప్రతి రోజూ అక్కడికి వెళ్లలేని పరిస్థితి. చాలామంది ఈఓలు అనేక మండలాల్లో, తమకు కేటాయించిన ఆలయాలను పర్యవేక్షించాల్సి ఉంది. దానితో సమయం సరిపోక, అక్కడ పూజా కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయో ఈఓలు పర్యవేక్షించలేని దుస్థితి.

దేవదాయ శాఖలో నెలకొన్న ఈ ప్రత్యేక పరిస్థితులతోపాటు.. ఖాళీల భర్తీ చేయాలన్న ఉద్యోగ సంఘాల డిమాండు మేరకు ప్రభుత్వం, దేవదాయ శాఖకు ఒక వెసులుబాటు కల్పించింది. రెవిన్యూ శాఖ నుంచి డిప్యుటేషన్‌పై.. డిప్యూటీ కలెక్టర్, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల స్థాయి వారిని తీసుకోవచ్చని అంగీకరించింది. వారిని దేవదాయ శాఖలో డిప్యూటీ కమిషనర్లు, ఆర్జేసీలు, ఈఓలుగా నియమించుకోవచ్చని ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. దాన్ని అమలు చేసి ఉంటే, ఇన్చార్జిలు లేకుండా రెగ్యులర్ అధికారులతోనే, ఆలయాలను నిర్వహించుకునే అవకాశం ఉండేది.

కానీ.. సీఎంకు ‘జగన్గురువు’గా ప్రచారంలో ఉన్న ఓ విశాఖ పీఠాథిపతి అనే ఓ జగద్గురువు, సర్కారు ఉత్తర్వులను వీటో చేశారు. ఫలితంగా రెవిన్యూ నుంచి డిప్యుటేషన్లు నిలిచిపోయాయి. దానితో మళ్లీ యధాప్రకారంగా ఇన్చార్జి రాజ్యమే దిక్కయింది. దాని వెనుక పెద్ద కథే నడిచిందట. దేవదాయ శాఖలో ఏళ్ల తరబడి పాతుకుపోయి, లాబీయింగ్- సంపాదనకు అలవాటు పడ్డ ఓ అధికారవర్గం.. సదరు విశాఖ స్వామి శరణు కోరిందట.

రెవిన్యూ అధికారులు దేవదాయ శాఖలో చొరబడితే.. తమ కన్నాలు ఎక్కడ బయటపడతాయోనన్న భయంతో రింగుగా ఏర్పడి, సదరు స్వాములోరి సన్నిధికి చేరి, తమ ఈతి బాధలు వెళ్లబోసుకున్నారట. రెవిన్యూ వాళ్లొస్తే ‘తమ రెవిన్యూ సంగతేమిట’ని స్వాములోరి ముందు కన్నీళ్ల పర్యంతమయ్యారట. వారి కన్నీరు, స్వాములోరి పాదాలను కడిగేశాయట.

అప్పటికే సదరు స్వాములోరు.. లోకకల్యాణం కోసం అప్పుడప్పుడు చేసే ధార్మిక కార్యక్రమాలకు, సదరు అధికారులు తమ ఆలయాల నుంచి, అధికార-అనధికారిక తాంబూలాలు సమర్పించుకుంటున్నారట. చివరాఖరకు దేవదాయ శాఖకు రెవిన్యూ వారొస్తే, తమ ‘శిష్యుల రెవిన్యూ’ దెబ్బతింటుందని గ్రహించిన స్వాములోరు, వారిని అనుగ్రహించారట.

అలా ‘శ్రమదానం’ చేసిన ఆ చనువు-హక్కుతోనే , జగన్గురువుల వారి చేత ..రెవిన్యూ అధికారులు ఆలయాల్లో, అధికారులుగా రాకుండా అడ్డుకున్నారట. రెవిన్యూ అధికారులు రాకుండా, సైంధవపాత్ర పోషించిన సదరు స్వాములోరికి.. అందుకు ప్రత్యుపకారంగా, చందనతాంబూలాలు ఉడతాభక్తిగా సమర్పించుకున్నారన్నది, దేవదాయ శాఖలో వినిపిస్తున్న గుసగుస. నిజం ‘జగన్నాధుడి’కెరుక?!

Leave a Reply