అవసరమైతే రాజకీయ పార్టీ పెడతా: విజయసాయిరెడ్డి
KPS డిజిటల్ మీడియా నెట్‌వర్క్, శ్రీకాకుళం :- తన రాజకీయ జీవితంపై మాజీ ఎంపీ, మాజీ వైసీపీ నేత విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతానికి తనకు ఏ రాజకీయ పార్టీ పెట్టే ఆలోచన లేదని.. అవసరమైతే పార్టీ పెట్టడానికి తాను వెనకాడబోనని తేల్చి చెప్పారు. తనపై చాలా ఒత్తిళ్లు వచ్చాయని.. వాటికి ఏమాత్రం తలొగ్గలేదని స్పష్టం చేశారు. తన విషయంలో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ చుట్టూ ఉన్న కోటరీ ఆయన్ని డైవర్ట్ చేస్తోందని అభిప్రాయపడ్డారు. నిబద్ధత లేని వారి మాటలు వినవద్దని ఈ సందర్భంగా వైఎస్ జగన్‌కు విజయసాయిరెడ్డి హితవు పలికారు. ఆదివారం శ్రీకాకుళంలో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. ఏ రాజకీయ పార్టీ నుంచి తనకు పిలుపు రాలేదన్నారు.
ఏపీలో పొట్టి శ్రీరాములు, ఎన్టీఆర్, అన్నమయ్య, అల్లూరి సీతారామరాజు, వైఎస్ఆర్ పేరుతో జిల్లాలు ఉన్నాయని.. కానీ సైరా నరసింహరెడ్గి పేరుతో జిల్లా లేదని గుర్తు చేశారు. కర్నూలు జిల్లాకు సైరా నరసింహరెడ్డి పేరు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజయసాయిరెడ్డి సూచించారు. అలా చేస్తే ఒక స్వాతంత్ర్య సమరయోధుడిని గౌరవించినట్లు అవుతుందన్నారు. శ్రీకాకుళంలో రెడ్డి సంక్షేమ సంఘం భవన నిర్మాణానికి అయ్యే ఖర్చు మొత్తం తానే భరిస్తానన్నారు.
చాలా మంది తనపై చాలా సెటైర్లు వేస్తున్నారని.. ఎవరూ ఎన్ని అనుకున్నా తాను ప్రస్తుతం రైతును మాత్రమేనని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో తనకు 20 ఏళ్ల స్నేహం ఉందన్నారు. తాను ఎప్పుడు పవన్ కల్యాణ్‌ను విమర్శించలేదన్నారు. శ్రీకాకుళంలో రెడ్డి సంక్షేమ సంఘం భవన నిర్మాణానికి అయ్యే ఖర్చు మొత్తం తానే భరిస్తానని ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి తెలిపారు.

