భూత శుద్థి వివాహం అంటే ఏంటి
KPS డిజిటల్ మీడియా నెట్‌వర్క్, తమిళనాడు :- టాలీవుడ్ అగ్ర కథానాయిక సమంత (Samantha) మరోసారి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. కొన్నాళ్లుగా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న రాజ్ నిడియోరును (Raj nidumoru) సోమవారం తెల్లవారుజామున కోయంబత్తూరులోని ఈశా యోగా సెంటర్‌లో ఉన్న లింగ భైరవి దేవాలయంలో సమంత పెళ్లాడారు. ఈ మేరకు సామ్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఫొటోలతోపాటు 1-12-2025 అని డేట్ కూడా పోస్ట్ చేసింది సామ్. ఈ నేపథ్యంలో సమంత-రాజ్‌నిడియోరుకు శుభాకాంక్షలు తెలుపుతూ ఈశా ఫౌండేషన్ (Isha Foundation)ఓ ప్రకటన విడుదల చేసింది. ఇరువురు ‘భూత శుద్థి వివాహం’ చేసుకున్నట్లు తెలిపారు. ఇరువురి కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ వేడుకను అనాదిగా వస్తున్న యోగ సంప్రదాయం ప్రకారం నిర్వహించారని ఈశా ఫౌండేషన్ ప్రకటనలో పేర్కొంది.
భూత శుద్థి వివాహం అంటే ఏంటి?
తమిళనాడులోని కోయంబత్తూరు నగరంలో ఈశా ఫౌండేషన్ (Isha Foundation Coimbatore)ను సద్గురు స్థాపించారు. మన భారత దేశంలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రాలలో ఇదొకటి. ఎక్కువ శాతం మంది యోగ నేర్చుకునేందుకు, మానసిక ప్రశాంతతకు అక్కడికి వెళ్తుంటారు. ఈశా యోగ ఆధ్యాత్మిక కేంద్రంలో లింగ భైరవి ఆలయం ఉంది. భైరవి మాతను సద్గురు ప్రాణ ప్రతిష్ఠ చేశారు. ఆ ఆలయం ‘భూత శుద్ధి వివాహాల’కు పేరొందింది. డిసెంబర్ 1న సమంత వివాహం సైతం ఆ ఆలయంలో జరిగింది. అయితే సమంత పెళ్లి తర్వాత ‘భూత శుద్ధి వివాహం అంటే ఏంటో అని నెటిజన్లు తెగ సెర్చ్ చేసేస్తున్నారు. ఇదొక పురాతన వివాహ ఆచారం. యోగ సంప్రదాయం నుంచి వచ్చింది. సద్గురు స్థాపించిన ఈశా ఫౌండేషన్ ఈ వివాహాలను నిర్వహిస్తోంది.
పంచభూతాలైన నింగి, నేల, నీరు, నిప్పు, వాయువు గురించి అందరికి తెల్సిందే. పంచ భూతాల శుద్ధీకరణ ద్వారా ఇద్దరు వ్యక్తులు వివాహ బంధంతో ఒక్కటి కావడమే ‘భూత శుద్ధి వివాహం’. ఈ విధానంలో వధూవరుల దేహాల్లోని పంచ భూతాలను శుద్ధి చేస్తారు. స్త్రీ పురుషుల మధ్య ఆలోచనలు, భావోద్వేగాలు లేదా భౌతికతకు అతీతంగా, దంపతుల మధ్య లోతైన బంధాన్ని ఏర్పరచడానికి రూపొందించిన విశిష్ఠమైన ప్రక్రియే ఈ ‘భూత శుద్థి వివాహం’. వారి దాంపత్య ప్రయాణంలో సామరస్యం, శ్రేయస్సు, ఆధ్యాత్మికత వెల్లివిరిసేలా దేవి అనుగ్రహాన్ని ప్రసాదిస్తుందని ఈశా ఫౌండేషన్ తమ ప్రకటనలో వివరించింది.

