షర్మిలపై కాంగ్రెస్ నేతలు తిరుగుబాటు.. పోస్ట్ పోయినట్టేనా..?
KPS డిజిటల్ మీడియా నెట్‌వర్క్, ఆంధ్రప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కష్టాలు అన్ని ఇన్ని కావు అన్నట్లు తయారైంది. ఓవైపు తండ్రి , దివంగత వైఎస్‌ఆర్‌లాగా కాంగ్రెస్‌ని ఒంటి చేత్తో నడపాలని పీసీసీ ప్రెసిడెంట్ షర్మిల చూస్తున్నారు. అయితే రాష్ట్రంలోని కాంగ్రెస్ సీనియర్ నేతలు ఆమెకు ఏ మాత్రం సహకరిచడం లేదంట. పైపెచ్చు పార్టీలోని పలువురు నేతలు షర్మిల ఒంటెద్దు పోకడ పోతున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. ఆమెపై హైకమాండ్‌కు ఫిర్యాదులు కూడా వెళ్తున్నాయి. అయినా ఢిల్లీ పెద్దలు పట్టించుకోకపోవడంపై కొందరు నేతలు తీవ్ర అసంతృప్తితో కనిపిస్తున్నారు.
ఏపీలో తిరిగి పుంజుకోవాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీని బాలారిష్టాలు వీడేలా కనిపించడం లేదు. ఏపీలో ఎలాగైనా కాంగ్రెస్ పార్టీకి పునర్ వైభవం తీసుకురావాలని పార్టీ జాతీయ అధినాయకత్వం ఏరికోరి వైఎస్ షర్మిలకు పిసిసి పగ్గాలు అప్పగించింది. రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని పూర్తిగా కోల్పోయింది. దాంతో పార్టీ సీనియర్లు చెట్టుకొకరు పుట్టకొకరు అయ్యారు. విభజన తర్వాత జరిగిన మూడు ఎన్నికల్లో కనీసం డిపాజిట్లు దక్కించుకోలేకపోయిన కాంగ్రెస్ పూర్తిగా ఉనికి కోల్పోయింద.
గత ఎన్నికల ముందు తెలంగాణ రాజకీయాల్లో ఉన్న వైఎస్ షర్మిలను ఏపీకి తీసుకొచ్చిన కాంగ్రెస్ హైకమాండ్ పీసీసీ పగ్గాలు కట్టబెట్టింది . దివంగత వైఎస్ కుమార్తె ఛరిష్మాతో ఏపీలో ఉనికి చాటుకోవాలని కాంగ్రెస్ పెద్దలు భావించారు. అయితే ఆమె పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మూడు అడుగుల ముందుకి నాలుగు అడుగులు వెనక్కి అన్నట్లు రాష్ట్ర కాంగ్రెస్ పరిస్థితి తయారైందంటున్నారు. షర్మిల సీనియర్లను కలుపుకొని వెళ్లడంతో పాటు, కొత్త రాష్ట్ర కమిటీని నియమించి సంస్థాగతంగా పార్టీ పునర్నిర్మాణం దిశగా అడుగులు వేస్తారని భావిస్తే ఏపీ కాంగ్రెస్లో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయని ఆ పార్టీ సీనియర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పీసీసీ అధ్యక్షురాలుగా షర్మిల బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అమె చుట్టూనే ఏపీ కాంగ్రెస్ రాజకీయాలు జరుగుతున్నాయి. ఎన్నికల్లో షర్మిల తానే స్వయంగా పోటీ చేసి దూకుడు ప్రదర్శించిన కాంగ్రెస్ బోణీ చేయడం కాదుకదా కనీసం డిపాజిట్లు దక్కిచుకోలేకపోయింది. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల్లో చాలా మంది ముఖాలు అసలు పార్టీ వర్గాలకే పార్టీలోని ఒక వర్గం నేతలు విమర్శిస్తున్నారు. పార్టీలో సీనియర్లుగా ఉన్నవారికి పెద్దపీట వేయకుండా, పదవుల్లో వారికి న్యాయం చేయకుండా కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం సంబంధం లేని వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు.
ఎన్నికల ముందు పార్టీలోకి వచ్చిన వారికి పదవులు, సీట్లు ఇచ్చారని కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకుని, రాహుల్ గాంధీ చేపట్టిన జూడో యాత్రలో పాల్గొని దేశవ్యాప్తంగా తిరిగొచ్చిన తమకు ఎక్కడ న్యాయం చేయలేదని కాంగ్రెస్ పార్టీలోని ఒక వర్గం నేతలు షర్మిలపై దుమ్మెత్తి పోస్తున్నారు. షర్మిల అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టాక పార్టీలో కేవలం కొంతమందిని మాత్రమే ప్రోత్సహిస్తున్నారని, పదవులు విషయంలో పూర్తిగా సీనియర్లకు అన్యాయం చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి . పార్టీ విధానాలకు పూర్తి వ్యతిరేకంగా పనిచేయడంతో పాటు ప్రజా సమస్యల కంటే వ్యక్తిగత ఎజెండాతోనే ఆమె పనిచేస్తున్నారని ఆరోపిస్తున్నారు. షర్మిల పీసీసీ ప్రెసిడెంట్ అయ్యాక ఏపీ కాంగ్రెస్లో ఏమి మార్పులు తెచ్చారు? ఏ మేరకు పార్టీకి పునర్ వైభవం తీసుకొచ్చారో చెప్పాలని నిలదీస్తున్నారు.
అలాగే ప్రతిపక్షం వైసీపీ విషయంలో దూకుడుగా ఉన్న షర్మిల అధికార కూటమి పార్టీలపై ఆ స్పీడ్ ఎందుకు చూపించడం లేదని బాహాటంగానే ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా షర్మిల ఏదో ఆశించి ఇక్కడికి వచ్చారు తప్ప , కాంగ్రెస్ పార్టీపై ఉన్న ప్రేమతో కాదని కాంగ్రెస్ పార్టీని గతంలో తూర్పారబట్టిన అంశాన్ని సైతం కాంగ్రెస్ పార్టీలోని కొందరు సీనియర్లు గుర్తు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు ఎందుకు చేస్తున్నారో? స్పష్టత లేకుండా సమావేశాలు ఎందుకు పెడుతున్నారో? చెప్పాలని టార్గెట్ చేస్తున్నారు.. సమూల మార్పులు చేసి సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేస్తారని జాతీయ అధినాయకత్వం భావిస్తే అందుకు భిన్నంగా షర్మిల అడుగులు వేయడంపై ఏపీ కాంగ్రెస్‌లో జోరుగా చర్చ నడుస్తోంది. గ్రూపులను ప్రోత్సహించడం ఒక వర్గానికి మాత్రమే పార్టీలో పదవులు కట్టబెట్టడం లాంటివి తప్ప… షర్మిల సీనియర్లకు న్యాయం చేసింది ఏమీ లేదని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ బాహాటంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. మొత్తమ్మీద అసలు ఏపీలో ఉనికిలోనే లేని పార్టీలో రగులుతున్న అసంతృప్తి జ్వాలలు చర్చనీయాంశంగా మారాయి.