తెలంగాణకు ఏపీ డిప్యూటీ సీఎం భారీ విరాళం.. ఏపీ పంచాయతీలకు మరో రూ. 4 కోట్లు ?
KPS డిజిటల్ మీడియా నెట్‌వర్క్, తెలంగాణ :- ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. సర్వం కోల్పోయి బాధపడుతున్న తెలంగాణ వరద బాధితులకు ఆయన బాసటగా నిలిచారు. తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు ఆయన రూ. కోటి విరాళంగా ప్రకటించారు. త్వరలోనే ఆ రూ. కోటి చెక్కును తెలంగాణ సీఎంకు అందజేయబోతున్నట్లు పవన్ కల్యాణ్ వెల్లడించారు.
కాగా, ఇప్పటికే ఏపీ వరద బాధితుల కోసం ఆయన ఒక కోటి రూపాయలను ప్రకటించిన విషయం తెలిసిందే. అదేవిధంగా వరద బాధిత ప్రాంతాలకు చెందిన గ్రామపంచాయతీలకు రూ. మరో 4 కోట్ల విరాళం ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు పేర్కొన్నారు. బాధితులను ఆదుకునేందుకు తన వంతు సాయంగా ఏపీ సీఎం సహాయక నిధికి ఈ విరాళాన్ని ఇస్తున్నట్లు ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ పేర్కొన్నారు. కాసేపట్లోనే సీఎం చంద్రబాబును కలిసి విరాళం చెక్ ను అందజేస్తానని చెప్పారు. వరద బాధితుల కోసం మొత్తం రూ. 6 కోట్ల విరాళం ఇస్తున్న నేపథ్యంలో పవన్ కల్యాణ్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది.
ఇదిలా ఉంటే.. గత రెండు రోజుల నుంచి రాష్ట్ర విపత్తు నిర్వహణ కమిషనర్ కార్యాలయంలో వరద ప్రభావిత ప్రాంతాలపై పవన్ కల్యాణ్ సమీక్ష నిర్వహిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని ఆయన పరిశీలిస్తున్నారు. రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి అనిత, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులతో ఆయన సమీక్షించారు.
‘ప్రస్తుతం ఏపీలో వరద తగ్గుతోంది. సహాయక చర్యల్లో అధికారులు ముమ్మరంగా పాల్గొంటున్నారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూనే ఉన్నాయి. గత వైసీపీ ప్రభుత్వం తీరు వల్లే ఈ పరిస్థితులు ఎదురయ్యాయి. ఏపీకి పెద్ద ప్రమాదమే తప్పింది. సహాయం కోసం హెల్ఫ్ లైన్ నెంబర్లకు ఫోన్ చేయండి. సంబధిత అధికారులు వచ్చి సహాయం అందిస్తారు. బాధితులెవ్వరూ అధైర్యపడొద్దు. మీ అందరికీ ప్రభుత్వం అండగా ఉంటుంది. మిమ్మల్ని అన్ని విధాలుగా ఆదుకుంటాం.
ప్రకృతి విపత్తు సమయంలో నిందలు మోపడం కంటే ప్రజలకు సేవ చేసేందుకు ముందుకు రావాలి. భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా ఏం చేయాలనేదానిపైన మంత్రివర్గంలో చర్చిస్తాం. ప్రతి నగరానికి మాస్టర్ ప్లాన్ తయారు చేస్తాం. వరద నిర్వహణ కోసం బృహత్తు ప్రణాళిక తయారు చేస్తాం. వరద ప్రాంతంలో పర్యటించాలనుకున్నాను. కానీ, నా కారణంగా సహాయ కార్యక్రమాలకు ఆటంకం కలుగుతుందేమోనన్న భావనతో నేను పర్యటించలేకపోయాను. నా పర్యటన సహాయ పడేలా ఉండాలి కానీ, అదనపు భారం కావొద్దని భావించా.. అందుకే పర్యటించలేకపోయాను. వరద సమయంలో మా శాఖ క్షేత్రస్థాయిలో పనిచేస్తూనే ఉన్నది. నేను రాలేదని నిందలు వేయాలని అంటారు తప్ప.. మరోటి కాదు. ప్రతిపక్షాల నిందలను తాము పట్టించుకోబోం’ అని ఆయన అన్నారు.
సహాయక చర్యల్లో పంచాయతీరాజ్ శాఖ సిబ్బంది ముమ్మరంగా పాల్గొంటున్నారు. 175 బృందాలు విజయవాడ అర్బన్ లో పనిచేస్తున్నాయి. వరద ప్రభావం లేని జిల్లాల నుంచి 900 మంది పారిశుద్ధ్య కార్మికులను రప్పించాం. వారు ఈ సహాయక చర్యల్లో ముమ్మరంగా పనిచేస్తున్నారు. వరదల కారణంగా ఎన్టీఆర్ జిల్లా ఎక్కువగా దెబ్బతిన్నది. 24 ఎస్డీఆర్ఎఫ్, 26 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయ చర్యల్లో పాల్గొన్నాయి. నేవీకి చెందిన 2, ఎయిర్ ఫోర్స్ కు చెందిన 4 హెలికాప్టర్ల ద్వారా వరద బాధితులకు ఆహార పంపిణీ చేస్తున్నాం.
సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. బుడమేరులోని 90 శాతం ఆక్రమణలే విజయవాడకు భారీ శాపంగా మారాయి. ఇలాంటి ఆపద సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమర్థవంతంగా పనిచేస్తున్నారు. ఈ వయసులోనూ ఆయన జేసీబీలు, ట్రాక్టర్లు ఎక్కి మరి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ వరద బాధితులకు భరోసా ఇస్తున్నారు. ఎప్పటికప్పుడు సహాయక చర్యలపై సమీక్ష చేస్తున్నారు. ఈ విధంగా పనిచేస్తున్న ఆయనను అభినందించాల్సిందిపోయి విమర్శలు చేయడం సరికాదు. వైసీపీ నేతలు మొదటగా సహాయక చర్యల్లో పాల్గొనాలి.. ఆ తరువాత ఆరోపణలు చేస్తే బాగుంటది.