విశాఖ లో ఘోరం.. మహిళ దారుణ హత్య
KPS డిజిటల్ మీడియా నెట్‌వర్క్, విశాఖపట్నం :- విశాఖపట్నంలో ఓ మహిళ దారుణ హత్యకు (Visakhapatnam Woman incident) గురయ్యారు. ఈ హత్యకు సంబంధించిన వివరాలను విశాఖపట్నం పోలీసులు మీడియాకు వెల్లడించారు. చినముషీడివాడకు చెందిన శ్రీనివాస్‌తో విజయనగరానికి చెందిన దేవి సహజీవనం చేస్తున్నారు. తాము భార్యభర్తలమని చెప్పి శ్రీనివాస్, దేవి వేపగుంట అప్పన్నపాలెంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ అద్దెకు తీసుకున్నారు.
నిన్న(శనివారం) ఇద్దరి మధ్య ఘర్షణ తలెత్తిందని…ఈ క్రమంలో వాగ్వాదం పెరగడంతో ఐరన్ కుర్చీతో దేవిపై శ్రీనివాస్ దాడి చేసి హత్య చేశారని వెల్లడించారు. అపార్ట్‌మెంట్‌కు వచ్చిన ప్రతిసారి ఎవరి కంట కనపడకుండా హెల్మట్ ధరించి వెళ్తుండేవారని మహిళా వాచ్‌మెన్ తెలిపారని అన్నారు. దేవి అరుపులు, కేకలు వినపడటంతో వెంటనే వాచ్‌మెన్ అపార్ట్‌మెంట్‌కు వెళ్లి ఆరా తీశారని వివరించారు. కుటుంబ సమస్య అని చెప్పడంతో తిరిగి మహిళా వాచ్‌మెన్ వెనక్కు వచ్చేశారని అన్నారు.
అయితే, శ్రీనివాస్ కాసేపటికే అక్కడ నుంచి వెళ్లిపోయారని తెలిపారు. ఫ్లాట్‌కు తాళం వేసి ఉండటంతో తలుపులు కొట్టి దేవిని వాచ్‌మెన్ పిలిచారని.. ఇంట్లో నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో వెంటనే తమకు మహిళా వాచ్‌మెన్ ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు. తాము తలుపులు పగలకొట్టి ఇంట్లోకి వెళ్లి చూడగా రక్తపు మడుగులో దేవి పడి ఉన్నారని తెలిపారు. ఐరన్ కుర్చీతో దేవి తలపై దాడి చేసినట్లుగా తమ క్లూస్ టీం గుర్తించారని చెప్పుకొచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని విశాఖపట్నం పోలీసులు పేర్కొన్నారు.

