జనసేన ఎమ్మెల్యే శ్రీధర్‌పై … స్పందించిన మహిళా కమిషన్
KPS డిజిటల్ మీడియా నెట్‌వర్క్, అమరావతి :- జనసేన నేత, రైల్వే కోడూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అరవ శ్రీధర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు కలకలం రేపింది. శ్రీధర్‌పై ఒక మహిళ (ప్రభుత్వ ఉద్యోగి) లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. ఆన్‌లైన్‌లొ వైరల్ అవుతున్న ఒక వీడియోలో… ఎమ్మెల్యే శ్రీధర్ దాదాపు ఒకటిన్నర సంవత్సరాల పాటు తనను లైంగికంగా వేధించారని ఆ మహిళ ఆరోపించారు. శ్రీధర్ ఎమ్మెల్యే అయిన తర్వాత మొదట ఫేస్‌బుక్ ద్వారా తనను సంప్రదించారని, ఆ తర్వాత తనను లొంగిపోవాలని బెదిరించారని ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలకు సంబంధించినవనిగా చెబుతున్న వీడియోలు, వాట్సాప్ చాట్‌లు, రీల్స్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ అవుతున్నాయి.
ఎమ్మెల్యే శ్రీధర్ తనను పలుమార్లు లైంగికంగా వేధించారని, బలవంతంగా సంబంధం పెట్టుకున్నారని, దాని ఫలితంగా తాను గర్భవతి అయ్యానని ఆ మహిళ ఆరోపించారు. అయితే తన ఇష్టానికి విరుద్ధంగా గర్భస్రావం చేయించుకోవల్సి వచ్చిందని ఆమె చెప్పుకొచ్చారు. శ్రీధర్ తనను పెళ్లి చేసుకుంటానని వాగ్దానం చేశారని కూడా ఆరోపణలు చేశారు. తాను భర్తకు దూరంగా ఉంటున్నానని… విడాకులు తీసుకోవాలని ఎమ్మెల్యే శ్రీధర్ తనపై ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు.
తన డిమాండ్లకు ఒప్పుకోకపోతే తన మూడేళ్ల కొడుకును చంపేస్తానని ఎమ్మెల్యే శ్రీధర్ బెదిరించారని ఆ మహిళ ఆరోపించారు. ఈ విషయం బయటపెడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారని కూడా ఆమె ఆరోపణలు చేశారు. ఇక, ఇందుకు సంబంధించి వీడియోలను వైసీపీ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఎమ్మెల్యే శ్రీధర్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసింది. అయితే ఇందుకు సంబంధించి ఇప్పటివరకు పోలీసులకు ఎలాంటి అధికారిక ఫిర్యాదు అందలేదని తెలుస్తోంది.
మరోవైపు ఈ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రాయపాటి శైలజ స్పందించారు. రైల్వేకోడూరు ఎమ్మెల్యేపై వచ్చిన ఆరోపణలను రాష్ట్ర మహిళా కమిషన్ తీవ్రంగా పరిగణించిందని శైలజ తెలిపారు. బాధితురాలితో ఫోన్‌లో మాట్లాడి ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకున్నామని వెల్లడించారు. ఈ అంశంపై సమగ్ర విచారణ చేపట్టి నిజానిజాలు తేల్చి తగిన చర్యలు తీసుకుంటామని బాధితురాలికి భరోసా ఇచ్చామని పేర్కొన్నారు. మహిళల గౌరవం, భద్రతకు భంగం కలిగించే చర్యలను మహిళా కమిషన్ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని స్పష్టం చేశారు.
ఎమ్మెల్యే శ్రీధర్ రెస్పాన్స్ ఇదే…
ఎమ్మెల్యే శ్రీధర్ తనపై వచ్చిన ఆరోపణలపై స్పందిస్తూ ఓ వీడియో విడుదల చేశారు. తనపై తప్పుడు ప్రచారం జరుగుతుందని తెలిపారు. కొందరు డీప్ ఫేక్ వీడియోలతో తనపై ఆరోపణలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. తనపై దుష్ప్రచారం చేస్తున్నవారిని ధైర్యం ఎదుర్కొంటానని, తనపై వస్తున్న ఆరోపణలకు న్యాయస్థానంలో బదులిస్తానని చెప్పారు.

