సింధూరం చెరిగిపోతే.. ఆపరేషన్ కు ఆ పేరా ? జయాబచ్చన్ సూటి ప్రశ్న..!
KPS డిజిటల్ మీడియా నెట్‌వర్క్, ఢిల్లీ :- ఆపరేషన్ సింధూర్ పై ఇవాళ రాజ్యసభలో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సమాజ్ వాదీ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ జయా బచ్చన్ ఆపరేషన్ సింధూర్ కు ఆ పేరు పెట్టడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరును ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. కాశ్మీర్ భూతల స్వర్గంగా మారిందని హామీ ఇచ్చిన కేంద్రం పహల్గాం దాడి తర్వాత బాధిత కుటుంబాలకు ఏం సమాధానం చెప్తుందని ఆమె నిలదీశారు.
ఇవాళ ఆపరేషన్ సింధూర్ పై రాజ్యసభలో జరిగిన చర్చలో పాల్గొన్న ఎంపీ జయా బచ్చన్ కేంద్రం తీరుపై నిప్పులు చెరిగారు. మాట్లాదింది తక్కువే అయినా కేంద్రంపై ఆమె సూటి విమర్శలు చేశారు. అలాగే కీలక ప్రశ్నలు కూడా సంధించారు. కేంద్రం దగ్గర మంచి రైటర్లు ఉన్నారని, వారు ఆపరేషన్ సింధూర్ వంటి గొప్ప పేర్లు ఇచ్చారని జయాబచ్చన్ సెటైర్లు వేశారు. అసలు పహల్గాం దాడిలో మహిళల సింధూరం చెరిగిపోతే .. దానికి కారకులైన ఉగ్రవాదుల్ని మట్టుబెట్టే ఆపరేషన్ కు సింధూర్ అని ఎలా పేరు పెట్టారని జయా బచ్చన్ నిలదీశారు.
మధ్యలో తన ప్రసంగాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తూ నినాదాలు చేసిన బీజేపీ ఎంపీలపై జయాబచ్చన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాట్లాడితే మీరు మాట్లాడండి.. లేకపోతే నన్ను మాట్లాడనివ్వండి.. మీరు మాట్లాడినప్పుడు నేను అడ్డుపడలేదు.. నేను మాట్లాడినప్పుడు మీరూ అడ్డుపడొద్దంటూ బీజేపీ ఎంపీలపై మైండ్ యువర్ టంగ్ అని జయ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే క్రమంలో తన పక్కన కూర్చొన్న శివసేన ఉద్ధవ్ వర్గం ఎంపీ ప్రియాంక చతుర్వేదీ తనను ఆపేందుకు ప్రయత్నించగా.. ఆపొద్దంటూ ఆమెపై ఫైర్ అయ్యారు.
పహల్గాంలో ఉగ్రదాడికి కేంద్రం నిఘా వైఫల్యమే కారణమని జయా బచ్చన్ విమర్శించారు. మీరు ప్రజల విశ్వాసాన్ని ధ్వంసం చేశారంటూ కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పహల్గాం ఉగ్రదాడిలో బాధిత కుటుంబాలు మిమ్మల్ని ఎప్పటికీ క్షమించబోవన్నారు. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రతి రోజూ మేం ఏదో సాధించామని మాటలు చెప్తారని, మరి పహల్గాంలో ఉగ్రవాదులు చొరబడుతుంటే ఆ నిఘా ఏమైందని జయాబచ్చన్ ప్రశ్నించారు.