ఆంధ్రప్రదేశ్

ఏపీలో జగన్‌ చాప్టర్‌ క్లోజ్‌.. వైసీపీ ఖేల్‌ ఖతమ్‌

KPS డిజిటల్ మీడియా నెట్‌వర్క్, ఆంధ్రప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ తన ఐదేళ్ల పాలనతో ప్రజా విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయారు. కనీసం వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. అయితే ఓటమి నుంచి పాఠాలు నేర్చుకునేందుకు జగన్ సిద్ధంగా లేరు. ఇప్పటికీ తానే అధికారంలో ఉన్నట్లు ఆర్డర్లు వేస్తున్నారు. తనకు ప్రతిపక్షనేత హోదా కావాల్సిందే అంటున్నారు. కూటమి సర్కారు ఏర్పడి కనీసం రెండు నెలలు గడవలేదు. జగన్ ప్రభుత్వం చేసిన అప్పులు. ప్రభుత్వ ఆస్తుల తాకట్టుల లెక్కలే ఇంకా తేలలేదు. వాటిని డైవర్ట్ చేయడానికి అన్నట్లు రాష్ట్రంలో శాంతిభద్రతలపై గగ్గోలు పెడుతున్నారు. దాంతో సొంత పార్టీ నేతల్లోనే ఆయనపై అసహనం వ్యక్తం అవుతోందంట.

సీఎంగా ఉన్నప్పుడు నియంతలా వ్యవహరించిన జగన్ మాజీ అయ్యాక కూడా తాను పట్టిన కుందేలుకి మూడేకాళ్లన్నట్లు కూటమి సర్కార్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. రాష్ట్రంలో హింస తాండవిస్తోందంటూ గగ్గోలు పెడుతున్నారు. గెలిచిన తన అరొకొర టీమ్‌ని వెంటపెట్టుకుని హస్తిన వరకూ వెళ్లి మరీ ధర్నా చేసి వచ్చారు. అయితే తెలుగుదేశం కూటమి అధికార పగ్గాలు చేపట్టి నిండా రెండు నెలలు కాలేదు. అప్పుడే జగన్ విమర్శలకు ఉపక్రమించడమేంటని జనం అసహనం వ్యక్తం చేస్తున్నారు.

హామీల అమలులో చంద్రబాబు చేతులెత్తేశారంటూ జగన్ చేస్తున్న వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అరాచకం సృష్టిస్తుందని, వైసీపీ కార్యకర్తలపై దాడులు,హత్యా కాండ జరుగుతున్నదన్న జగన్ ఆరోపణలపై లెక్కలు చెప్పాలని అధికార పార్టీయే కాదు. సొంత పార్టీ నేతలు కూడా అడుగుతున్నారు. జగన్ హస్తిన వేదికగా చేసిన ధర్నాలో ఇదే ప్రశ్న జాతీయ మీడియా నుంచి కూడా ఎదురైంది.

చంద్రబాబు పాలనా పగ్గాలు చేపట్టిన తరువాత రాష్ట్రంలో 36మంది వైసీపీ కార్యకర్తలను చంపేశారంటూ జగన్ చేసిన ఆరోపణపై ఆధారాలు, వివరాలు చెప్పాలంటూ జాతీయ స్థాయి మీడియా ప్రశ్నిస్తే.. టాపిక్ డైవర్ట్ చేయవద్దు. లంచ్ టైం అయ్యింది, భోజనం చేయండంటూ మాట దాటేశారాయన. ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ఇదే డిమాండ్ చేశారు. అయితే జగన్ మాత్రం ఆ ప్రశ్నకు సమాధానం చెప్పడం లేదు. అసలు అసెంబ్లీ ముఖమే చూడలేదు. దీంతో నిత్యం విశ్వసనీయత గురించి మాట్లాడే జగన్ మాటలకు అసలు విశ్వసనీయతే లేకుండా పోయిందంటున్నారు.

ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేత పత్రాల విడుదల పై కూడా జగన్ విమర్శలు గుప్పిస్తున్నారు. తన పాలనను విమర్శించే లక్ష్యంతోనే తప్పుడు లెక్కలతో, శ్వేత పత్రాల పేర చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని జగన్ గగ్గోలు పెడుతున్నారు. తన హయాంలో అప్పుల గురించి చంద్రబాబు చెప్పినవన్నీ అబద్ధాలని ప్రకటిస్తున్న జగన్.. అవి అబద్ధాలన్న ఆరోపణకు మాత్రం ఆధారాలు చూపమంటే మాట దాటేస్తున్నారు. జగన్ తీరుతో సొంత పార్టీలో కూడా వ్యతిరేకత వ్యక్తం అవుతోందంట.

ధర్నాకు ఇండియా కూటమి నేతల హాజరును గొప్పగా చెప్పుకుంటున్న జగన్.. వారు ఆ ధర్నాలో వారు కూటమి ప్రభుత్వంపై ఒక్కటంటే ఒక్క విమర్శ కూడా చేయకపోవడంపై ప్రశ్నిస్తే సమాధానం చెప్పడం లేదు. జగన్ తాపత్రయమంతా.. ఎలాగోలా కాంగ్రెస్ కూటమికి దగ్గరై తనపై ఉన్న అక్రమాస్తుల కేసుల విచారణ వేగవంతం అయితే పొలిటికల్ ప్రొటక్షన్ సంపాదించుకోవడం కోసమేనన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే జగన్ ధర్నాకు కాంగ్రెస్ నేతలు హాజరు కావడం కాదుకదా.. కనీసం మద్దతు కూడా ప్రకటించలేదు.

మరోవైపు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తుంటే కాంగ్రెస్ ఎందుకు మద్దతు తెలపడం లేదో అర్ధం కావడం లేదని జగన్ అంటున్నారు. ఆ క్రమంలో జగన్‌కు ఏపీసీసీ ప్రెసిడెంట్ హోదాలో ఆయన చెల్లెలు షర్మిల గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. అయిదేళ్లు అరాచక పాలన సాగించి ఇప్పుడు ఉనికి కోసం ఢిల్లీలో డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. అదలా ఉంటే అసెంబ్లీకి గైర్హాజరై.. ప్రభుత్వ తీరును అసెంబ్లీ బయట తప్పుపడుతూ చేస్తున్న హంగామా వల్ల జగన్ కు రాజకీయంగా ఎటువంటి ప్రయోజనం ఉండదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

దేశంలో బీజేపీ ప్రభ నెమ్మది నెమ్మదిగా మసకబారుతున్న సూచనలు కనిపిస్తుండటం, అదే సమయంలో కాంగ్రెస్ పుంజుకుంటున్న సంకేతాలు కనిపిస్తుండటంతో.. జగన్ తన విధేయతను కాంగ్రెస్ వైపు మళ్లించి, ఆ పార్టీ అండకోసం నేల విడిచి సాము చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే నిజంగానే కాంగ్రెస్ దేశంలో బలపడి, బీజేపీ బలహీన పడినా జగన్ కు రాజకీయంగా నష్టం తప్ప ఎటువంటి ప్రయోజనం ఉండదు. కాంగ్రెస్‌తో విభేదించి పార్టీ పెట్టుకున్న జగన్‌ను కాంగ్రెస్ పెద్దలు దగ్గరకు రానివ్వరు.

అదీకాక రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతం అయితే.. ఆ మేరకు నష్టపోయేది వైసీపీ మాత్రమే.. వైసీపీ ఓటు బ్యాంకు కాంగ్రెస్ నుంచి వచ్చిందే. అలాగే వైసీపీలో నేతలూ, క్యాడర్ దాదాపు కాంగ్రెస్ నుంచి వచ్చి చేరిన వారే.. రాష్ట్ర విభజన ఎఫెక్ట్‌తో కాంగ్రెస్ దెబ్బతినడం వైసీపీకి కలిసి వచ్చింది. కనుక జాతీయ స్థాయిలో, ఏపీలో కాంగ్రెస్ బలపడితే జగన్ పార్టీ ఉనికి కూడా కనిపించదంటున్నారు. ఇప్పటికైనా జగన్ తన తీరు మార్చుకోకుండా.. కనీసం జనంనమ్మడానికి కూడా అవకాశం లేని ఆరోపణలు చేస్తూ రచ్చ చేసుకోవడం వల్ల నష్టమే కానీ ఇసుమంతైనా ప్రయోజనం ఉండే పరిస్థితి కనిపించడం లేదు.

Leave a Reply