తమిళనాడు సీఎంగా విజయ్..! మొదలైన ప్రోటోకాల్-ఇంటికి భారీ భద్రత..!
KPS డిజిటల్ మీడియా నెట్‌వర్క్, తమిళనాడు :- ఒక్క రోజులో అంతా మారిపోతోంది. నిన్నటి వరకూ తమిళనాడు (Tamil Nadu) అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన కూటములైన డీఎంకే లేదా అన్నాడీఎంకే గెలుస్తాయని, లేదా విజయ్ (Vijay) కింగ్ మేకర్ గా మారుతారని అనుకున్న వారందరికీ ఇవాళ వెలువడుతున్న ఎన్నికల ఫలితాలు భారీ షాకిచ్చాయి. విజయ్ పార్టీ టీవీకే (TVK) ఏకంగా సెంచరీకి పైగా సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతుండటంతో తమిళనాడులో రాజకీయ వాతావరణం పూర్తిగా మారిపోయింది. దీనికి తగ్గట్టుగానే అధికార లాంఛనాలు కూడా మొదలయ్యాయి.
తమిళనాడు అసెంబ్లీలో 234 సీట్లకు జరిగిన ఎన్నికల్లో విజయ్ పార్టీ టీవీకే ఇప్పటికే 100కు పైగా సీట్లలో ఆధిక్యంలో ఉండటంతో ప్రభుత్వ ఏర్పాటుపై క్రమంగా క్లారిటీ వస్తోంది. అందులోనూ టీవీకే అధినేత విజయ్ సీఎం కావడం తథ్యమని కూడా తేలిపోయింది. దీంతో విజయ్ పార్టీని సంప్రదించేందుకు అధికార డీఎంకే, విపక్ష అన్నాడీఎంకే కూటములతో పాటు ప్రముఖులు కూడా బారులు తీరుతున్నారు. ఈ నేపథ్యంలోనే చెన్నైలోని విజయ్ నివాసానికి పోలీసులు భద్రత పెంచారు.
విజయ్ సీఎం కావడం తథ్యమని దాదాపుగా తేలిపోవడంతో ఆయన ఇంటికి పోలీసు ఉన్నతాధికారులు చేరుకుంటున్నారు. విజయ్ కు అదనపు భద్రత ఏర్పాటు చేయడంతో పాటు ప్రోటోకాల్ కూడా కల్పిస్తున్నారు. ఇవాళ్టి నుంచి విజయ్ నివాసానికి వచ్చే ప్రముఖులపై ఆరా తీయడంతో పాటు విజయ్ సూచనల మేరకు పోలీసులు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. విజయ్ ఇంటికి ఇప్పటికే ఆయన కచ్చితంగా గెలుస్తాడని చెప్పిన జ్యోతిష్కుడు రోహన్ పండిట్ కూడా చేరుకున్నారు. దీంతో విజయ్ నివాసం సందడిగా మారుతోంది.

