వారసత్వ రాజకీయాలకు ప్రజలు స్వస్తి పలకాలి! ప్రజాస్వామ్యంలో ప్రజాసేవకే ప్రాధాన్యత ఇవ్వాలి – రాష్ట్ర అధ్యక్షులు కంచరన కిరణ్ కుమార్
KPS డిజిటల్ మీడియా నెట్వర్క్, విశాఖపట్నం :- రాజకీయాల్లో వారసత్వానికి కాకుండా ప్రజాసేవకు, ప్రజల సమస్యల పరిష్కారానికి, నాయకుల సమర్థతకు ప్రాధాన్యత ఇవ్వాలని ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు కంచరన కిరణ్ కుమార్ అన్నారు. వారసత్వ రాజకీయాలకు ప్రజలు స్వస్తి పలికి, ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని ఆయన పిలుపునిచ్చారు.
ప్రజాస్వామ్యంలో అధికారం అనేది ప్రజలు ఇచ్చే బాధ్యత అని, అది ఎవరికీ కుటుంబ వారసత్వంగా సంక్రమించకూడదని ఆయన పేర్కొన్నారు. ప్రజల కష్టసుఖాలను అర్థం చేసుకుని, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే నాయకులకే ప్రజలు మద్దతు ఇవ్వాలని సూచించారు.
రాజకీయాల్లో యువతకు, సామాన్య ప్రజలకు, ప్రతిభ కలిగిన నాయకులకు సమాన అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజాసేవ చేయాలనే నిబద్ధత, నిజాయితీ, సమర్థత ఉన్నవారిని ప్రజలు ప్రోత్సహించాలని కోరారు.
ప్రజాస్వామ్య వ్యవస్థ మరింత బలోపేతం కావాలంటే ప్రజలు రాజకీయ చైతన్యంతో వ్యవహరించాలని, వ్యక్తులు లేదా కుటుంబాల ప్రభావానికి లోనుకాకుండా అభివృద్ధి, ప్రజా సంక్షేమం, సామాజిక న్యాయం వంటి అంశాల ఆధారంగా నాయకులను ఎన్నుకోవాలని కంచరన కిరణ్ కుమార్ విజ్ఞప్తి చేశారు.

