రేపటి నుంచి అన్ని స్కూళ్లకు వరుసగా 3 రోజులు సెలవులు.. ఆ జిల్లాల విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్!
KPS డిజిటల్ మీడియా నెట్వర్క్, విశాఖపట్నం :- తుఫాను ముప్పు నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించారు. లోతట్టు, తీర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
బంగాళాఖాతంలో ముంచుకొస్తున్న ‘అర్నాబ్’ తుఫాను విలయతాండవం సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాబోయే మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు, భీకరమైన ఈదురు గాలులు విరుచుకుపడనున్న నేపథ్యంలో అనకాపల్లి జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదివారం మధ్యాహ్నం జిల్లా స్థాయి అధికారులతో వెబ్ఎక్స్ ద్వారా అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రకృతి విపత్తును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్త చర్యలపై ఆమె అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. ఏ చిన్న పొరపాటు జరిగినా ప్రాణనష్టం జరిగే ప్రమాదం ఉందని అధికారులను తీవ్రంగా హెచ్చరించారు.

