సూర్యతేజ’ యాజమాన్యానిది నేరపూరిత నిర్లక్ష్యమే
KPS డిజిటల్ మీడియా నెట్‌వర్క్, శ్రీకాకుళం :- సూర్యతేజ’ యాజమాన్యానిది నేరపూరిత నిర్లక్ష్యమే: బాధ్యులపై A2 కేసు నమోదు చేయాలి!
– విద్యాశాఖ నిబంధనలు, POSH చట్టాన్ని గాలికి వదిలేసి, ప్రశ్నిస్తే వ్యక్తిగత దూషణలా?
– ప్రభుత్వ ఉద్యోగి అయిన ప్రిన్సిపల్ భర్త అక్రమ జోక్యంపై విజిలెన్స్ విచారణ జరిపించాలి!
– బమ్మిడి సంతోష్ కుమార్
(ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిశోధక విద్యార్థి – Ph.D. Research Scholar)
పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని ‘సూర్యతేజ’ ప్రైవేట్ కళాశాలలో ఇటీవల వెలుగులోకి వచ్చిన లైంగిక వేధింపుల ఉదంతం, విద్యార్థినుల భద్రత పట్ల యాజమాన్యం ప్రదర్శించిన బాధ్యతారాహిత్యం నన్ను తీవ్రంగా కలచివేసింది. ఒక విద్యావంతుడిగా, బాధ్యతాయుతమైన పౌరుడిగా విద్యార్థినుల భద్రత, చట్టపరమైన నిబంధనలపై నేను ప్రశ్నిస్తుంటే… దానికి సరైన సమాధానం చెప్పలేక కాలేజ్ ప్రిన్సిపల్ పత్రికా సమావేశం పెట్టి నాపై వ్యక్తిగత దూషణలకు దిగడం వారి అహంకారానికి, దిగజారుడుతనానికి నిదర్శనం.
1. ఘటన నిజమని ప్రిన్సిపాలే సొంత నోటితో ఒప్పుకున్నారు!
అన్ని అనుమతులు ఉన్నాయని కాగితాలు చూపిస్తున్న ప్రిన్సిపల్ గారు… పత్రికా సమావేశంలో ‘తన కాలేజీలో లైంగిక వేధింపుల ఘటన జరిగింది నిజమే’ అని ఒప్పుకోవడం ద్వారా తమ యాజమాన్య బాధ్యతారాహిత్యాన్ని సొంత నోటితో బహిర్గతం చేసుకున్నారు. ఘటన జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వకుండా, కేవలం నాన్-టీచింగ్ స్టాఫ్‌ని ఉద్యోగం నుంచి తీసేసి నేరాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం (Concealing Offence / POSH Act Violation) చేయడం తీవ్రమైన నేరం కాదా అని నేను ప్రశ్నిస్తున్నాను.
“ఆ అమ్మాయి ఫిబ్రవరిలో వెళ్ళిపోయింది, జూలైలో కంప్లైంట్ ఇస్తే నాకేంటి సంబంధం” అని మాట్లాడటం ఆవిడ మానసిక పరిపక్వతకు నిదర్శనం. లైంగిక వేధింపులకు గురైన బాధితులు ధైర్యం తెచ్చుకుని బయటకు రావడానికి సమయం పడుతుంది. కాలేజీ ప్రాంగణంలో జరిగిన ప్రతీ అక్రమానికి యాజమాన్యానికి పూర్తి సంరక్షణా బాధ్యత (Duty of Care) ఉంటుంది అనే ప్రాథమిక సూత్రాన్ని ఆవిడ విస్మరిస్తున్నారు.

2. 38 సీసీ కెమెరాలు ఉన్నాయంటున్నారు… మరి ఆ నిఘాలోనే వేధింపులు ఎలా జరిగాయి?
కాలేజీలో 38 సీసీ కెమెరాలు ఉన్నాయని గొప్పగా చెప్తున్న ప్రిన్సిపల్ గారిని నేను ప్రత్యక్షంగా ప్రశ్నిస్తున్నాను:
38 సీసీ కెమెరాల నిఘా కళ్లముందే ఒక విద్యార్థినికి అన్యాయం జరుగుతుంటే మీ యాజమాన్యం ఏం చేస్తోంది?
ఆ రికార్డింగ్స్ తనిఖీ చేసి విద్యార్థినులకు రక్షణ కల్పించడంలో ఎందుకు విఫలమయ్యారు?
నిజంగానే రికార్డింగ్స్ మీ దగ్గర ఉంటే, ఘటన జరిగిన నాటి సీసీ టీవీ ఫుటేజ్‌ను పోలీసులకు, విద్యాశాఖ అధికారులకు ఎందుకు అప్పగించలేదు? కేవలం స్టాఫ్‌ని ఉద్యోగం నుంచి తీసేసి సాక్ష్యాలను తుడిచిపెట్టే యత్నం (Destruction of Evidence) ఎందుకు చేశారు?
సుప్రీంకోర్టు ఉత్తర్వులు (విశాఖ కేసు) మరియు POSH Act, 2013 ప్రకారం కాలేజీలో అంతర్గత ఫిర్యాదుల కమిటీ (ICC) బోర్డు ఎక్కడ ఉందో చూపించగలరా?

3. ప్రభుత్వ ఉద్యోగి (ప్రిన్సిపల్ భర్త) అక్రమ జోక్యంపై విజిలెన్స్ విచారణ జరగాలి:
ప్రిన్సిపల్ గారి భర్త ఒక ప్రభుత్వ ఉద్యోగి! ఏపీ ప్రభుత్వ సర్వీస్ రూల్స్ (AP Civil Services Conduct Rules) ప్రకారం ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా ప్రైవేట్ విద్యాసంస్థల నిర్వహణలో, వ్యాపారాల్లో భాగస్వామి కాకూడదు, అధికారిక సమావేశాల్లో పాల్గొనకూడదు. కానీ ఆయన ఈ ప్రైవేట్ కాలేజీ స్టాఫ్ మీటింగ్‌లలో, పరిపాలనా వ్యవహారాల్లో నిరంతరం పాల్గొంటున్నారనే స్పష్టమైన సమాచారం ఉంది. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ప్రైవేట్ కాలేజీని నడిపిస్తున్న ఆ ప్రభుత్వ ఉద్యోగిపై, ప్రిన్సిపల్‌పై ఏపీ ప్రభుత్వ విజిలెన్స్ శాఖకు మరియు సంబంధిత ఉన్నతాధికారులకు ఆధారాలతో ఫిర్యాదు చేస్తున్నాను.

4. ప్రశ్నిస్తే వ్యక్తిగత దూషణలా?
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో Ph.D. రీసెర్చ్ స్కాలర్‌గా, ఒక విద్యావంతుడిగా అమాయక విద్యార్థినుల హక్కులు, భద్రత కోసం నేను ప్రశ్నిస్తుంటే… సమాధానం చెప్పలేక నా వయస్సు, రాజకీయాలపై మాట్లాడటం మీ బలహీనతకు నిదర్శనం. ప్రజా సమస్యలపై, మహిళా భద్రతపై పోరాడటానికి వయస్సుతో పనిలేదు, సమాజం పట్ల నైతికత ఉంటే చాలు. బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి నాపై ఆధారాలు లేని నిందలు వేసి అవమానించినందుకు ప్రిన్సిపల్ మరియు కాలేజ్ యాజమాన్యంపై సివిల్ & క్రిమినల్ మాననష్ట దావా (Defamation Notice) వేస్తున్నాను.
నా ప్రధాన డిమాండ్లు:
A2/Co-Accused గా కేసు నమోదు: లైంగిక వేధింపుల ఘటనను దాచిపెట్టి, చట్టాన్ని ఉల్లంఘించిన కాలేజీ యాజమాన్యాన్ని ప్రధాన బాధ్యులను చేసి కేసులో A2 (Co-Accused) గా చేర్చాలి.
గుర్తింపు రద్దు & కాలేజీ సీల్: BIEAP నిబంధనలు మరియు భద్రతా ప్రమాణాలు పాటించని ఈ కాలేజీ గుర్తింపును రద్దు చేసి సీల్ వేయాలి.
విజిలెన్స్ విచారణ: కాలేజీ వ్యవహారాల్లో అక్రమంగా జోక్యం చేసుకుంటున్న ప్రభుత్వ ఉద్యోగి (ప్రిన్సిపల్ భర్త) పై ప్రభుత్వం వెంటనే శాఖాపరమైన విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి.
తల్లిదండ్రుల నమ్మకాన్ని, విద్యార్థినుల భవిష్యత్తును వ్యాపార సరుకుగా మార్చే ఏ కాలేజీ యాజమాన్యాన్ని వదిలిపెట్టేది లేదు. విద్యాశాఖ, పోలీసులు తక్షణమే స్పందించి బాధితులకు పూర్తి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాను!
బమ్మిడి సంతోష్ కుమార్
Ph.D. Research Scholar, ఆంధ్ర విశ్వవిద్యాలయం

