తెలంగాణ

శ్రీ తేజ్ ఇంకా కోలుకోలేదు…క్లారిటీ ఇచ్చిన ఆసుపత్రి యాజమాన్యం

KPS డిజిటల్ మీడియా నెట్‌వర్క్, హైదరాబాద్‌ :- ఒక సినిమా ఒక కుటుంబంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ‘పుష్ఫ 2’ సినిమా ప్రీమియర్స్ సమయంలో ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌లో జరిగిన ఘటన గురించి తెలిసిందే. ఇప్పటికే ఈ ఘటన జరిగి దాదాపు 17 రోజులు అవుతున్నా బ్రెయిన్ డ్యామేజ్ వల్ల ఆసుపత్రిలో చేరిన బాలుడు శ్రీ తేజ్ ఇంకా కోలుకోలేదు. బ్రెయిన్ డ్యామేజ్ వల్ల తాను కోమాలోకి వెళ్లిపోయాడని మొదట్లో వైద్యులు తెలిపారు. కానీ ఆ తర్వాత తన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అనే విషయాన్ని వైద్యులు పెద్దగా బయటపెట్టడం లేదు. తాజాగా కిమ్స్ ఆసుపత్రి యాజమాన్యం శ్రీ తేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి వివరణ ఇచ్చింది.

క్లారిటీ ఇచ్చేశారు

సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కసలాటలో శ్రీ తేజ్‌కు ఆక్సిజన్ అందలేదు. చాలాసేపు అలాగే ఉండడంతో తనకు బ్రెయిన్ డ్యామేజ్ జరిగింది. అలా కోమాలోకి వెళ్లిపోయాడు. అప్పటినుండి శ్రీ తేజ్ ఇంకా కోమాలోనే ఉన్నాడు. ఒకానొక సందర్భంలో శ్రీ తేజ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా లేదని, తను బ్రతకడం కష్టమని వార్తలు వినిపించాయి. కానీ వాటిపై తన కుటుంబం గానీ, ఆసుపత్రి యాజమాన్యం గానీ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. మరుసటి రోజే కమీషనర్ సీపీ ఆనంద్ స్వయంగా వచ్చి శ్రీ తేజ్‌ను చూసి తన ఆరోగ్య పరిస్థితి గురించి అందరికీ వివరించారు. దీంతో ప్రేక్షకులు కాస్త కుదుటపడ్డారు. ఇప్పుడు స్వయంగా కిమ్స్ ఆసుపత్రి శ్రీ తేజ్ పరిస్థితి గురించి బయటపెట్టింది.

ఎవరినీ గుర్తుపట్టడం లేదు

శ్రీ తేజ్ (Sri Tej) ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని కిమ్స్ ఆసుపత్రి యాజమాన్యం చెప్పుకొచ్చింది. వెంటిలేటర్‌పై చికిత్స జరుగుతుందని, ఫీడింగ్ కూడా తీసుకుంటున్నాడని అన్నారు. కానీ అప్పుడప్పుడు ఫిట్స్ రావడం లాంటిది జరుగుతున్నాయని బయటపెట్టింది. అంతే కాకుండా కళ్లు కూడా తెరుస్తున్నాడు కానీ ఎవరినీ గుర్తుపట్టడం లేదని తెలిపింది. దీంతో శ్రీ తేజ్ త్వరగా కోలుకోవాలని చాలామంది ప్రేక్షకులు కోరుకుంటున్నారు. ఈ ఘటన చాలామందిలో చర్చనీయాంశంగా మారింది. అసలు ఇంత పెద్ద తప్పు ఎలా జరిగింది? అనుమతి లేకుండా థియేటర్‌కు హీరో రావడం వల్లే ఇది జరిగిందా? ఇందులో అల్లు అర్జున్ తప్పు నిజంగా ఉందా అని ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు.

ముందుగా తెలియడం వల్లే

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన ‘పుష్ఫ 2’ సినిమా డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ డిసెంబర్ 4న పెయిడ్ ప్రీమియర్స్‌ను నిర్వహించారు మేకర్స్. హైదరాబాద్‌లోని కొన్ని థియేటర్లలో మాత్రమే ఈ పెయిడ్ ప్రీమియర్స్ జరిగాయి. అందులో అందులో ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్ కూడా ఒకటి. సంధ్య థియేటర్‌లో ఫ్యాన్స్‌తో కలిసి పెయిడ్ ప్రీమియర్ చూడడానికి అల్లు అర్జున్ కూడా వస్తున్నాడనే విషయం ముందుగానే బయటపడింది. అందుకే టికెట్స్ లేనివాళ్లు కూడా థియేటర్‌లోకి దూసుకురావడంతో తొక్కిసలాట జరిగింది. ఇదే సందర్భంలో శ్రీ తేజ్ తల్లి రేవతి మరణించారు.

Leave a Reply