సినీ ఇండస్ట్రీలో మహిళలపై లైంగిక వేధింపులు నిజమే.. ‘కొత్త చట్టం తీసుకురావాలి’
KPS డిజిటల్ మీడియా నెట్‌వర్క్, బెంగళూరు :- సినిమా ఇండస్ట్రీలలో మహిళలు లైంగిక వేధింపులకు గురవుతున్నారని చాలా కాలంగా విమర్శలు వస్తూనే ఉన్నాయి. అయితే మలయాళ సినిమా ఇండస్ట్రీలో కూడా ఈ సమస్య విపరీతంగా ఉందని ఇటీవల ఒక కమిటీ రిపోర్ట్ వెలుగులోకి వచ్చింది. సినిమాల్లో అవకాశాల కోసం మహిళలను లైంగిక వేధిస్తున్నారని.. వారిని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్ ద్వారా తెలిసింది. ఈ రిపోర్ట్ వివరాలు సోమవారం ఆగస్టు 19న విడుదలయ్యాయి.
మలయాళ సినిమాలలో పనిచేసే చాలామంది మహిళలు కొందరు సినీ పెద్దలపై 2019లో ఫిర్యాదులు చేశారు. కేరళ సినీ ఇండస్ట్రీలో మహిళలకు భద్రత లేదని లైంగిక వేధింపులు మితిమీరితున్నారని బహిరంగంగా తెలిపారు. దీంతో 2019లో కేరళ ప్రభుత్వం జస్టిస్ హేమ ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ.. సినీ ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను 5 ఏళ్ల పాటు అధ్యయనం చేసి ప్రభుత్వానికి రిపోర్ట్ సమర్పించింది.
ఈ రిపోర్ట్ కాపీని ఆర్టీఐ చట్టం ద్వారా మీడియా కూడా అందించారు. ఈ రిపోర్ట్ ప్రకారం.. మలయాళ సినిమాలలో పనిచేస్తున్న మహిళా కళాకారులు వేధింపులకు గురవుతున్నారు. ఒంటరిగా ఉన్న సమయంలో, పనివేళల్లో వీరి గదుల్లో చాలామంది పురుషులు తాగివచ్చి వేధించారనే ఘటనలు జరిగినట్లు కమిటీ రిపోర్ట్ ద్వారా తెలిసింది.
వేధింపులు ఎదురవుతున్నా.. చాలామంది మహిళా కళాకారులు అవకాశాలు పోతాయనే భయంతో సమస్యల గురించి బయటికి చెప్పడం లేదు. పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదు. సినీ ఇండస్ట్రీ పెద్దలు చెప్పినట్లు వారికి శారీరక సుఖాలు అందించకపోతే అలాంటి మహిళలను సినిమాలలో అవకాశాలు ఇవ్వరు. పైగా మహిళా క్యారెక్టర్ ఆర్టిస్టులతో సినిమాకు సంబంధించి అధికారిక కాంట్రాక్టులు లేకుండానే పనిచేయిస్తుంటారని రిపోర్టులో కమిటీ పేర్కొంది.
కాంట్రాక్టులు లేకపోవడంతో తమకు లైంగికంగా సుఖాలు అందించని మహిళలను ఎప్పుడైనా పనిలో నుంచి తొలగించేయడం, దాంతో పాటు వారికి పారితోషికం కూడా చెల్లించకుండా సినిమాను తీసేస్తున్నరని తెలిసింది. చాలామంది మహిళ నటులు నోటి మాటతో ఒప్పందం కుదుర్చుకొని పనిచేస్తున్నారని.. ఇది వారి ఆర్థిక బలహీనతకు దుర్వినియోగం చేయడమేనని హేమ కమిటీ అభిప్రాయపడింది.
రిపోర్ట్ లో ఒక సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన ఒక నటి గురించి ప్రస్తావన ఉంది. ఆమె చేత బలవంతంగా సినిమాలో ఇంటిమేట్ సీన్స్ షూట్ చేయించారని.. అయితే షూటింగ్ మధ్యలో ఆమె ఆ సీన్లు పూర్తిగా షూటింగ్ చేయకముందే పారిపోయిందని ఉంది. ఆ తరువాత ఆమె ఆ సినిమాలో పనిచేయకూడదని నిర్ణయించుకొని డైరెక్టర్ తో తన సీన్లు సినిమాలో నుంచి తొలగించాలని చెప్పినా.. సదరు దర్శకుడు ఆమెను పర్సనల్ గా తన గదికి రమ్మన్నాడని తెలిపింది. మరో మైనర్ నటి తాన అవకాశాల కోసం కాంప్రమైజ్ కావాల్సి వచ్చినట్ల తెలిపింది. సినిమా లో ప్రముఖ నటుడు, నిర్మాత, దర్శకుడు, ప్రొడక్షన్ కంట్రోలర్ వీరంతా తనను వేధించారని చెప్పింది.
ఇప్పటికే సినీ ఇండస్ట్రీలో పని చేసే మహిళల కోసం ఇంటర్నల్ కంప్లెయింట్స్ కమిటీ (ఐసిసి) ఉన్నా.. అది ప్రభావ వంతంగా పనిచేయడం లేదని జస్టిస్ హేమ కమిటీ ఆవేదన వ్యక్తం చేసింది. ఐసిసిలోని సభ్యులు కూడా సినీ పెద్దల నుంచి ఒత్తిడి రాగానే బాధిత మహిళల ఫిర్యాదులను పట్టించుకోవడం లేదని హేమ కమిటీ తెలిపింది. అయితే ఈ మలయాళ సినీ ఇండస్ట్రీలో మహిళల భద్రత కోసం కొత్త చట్టం తీసుకురావాలని, కేసుల విచారణకు ఒక ప్రత్యేక ట్రిబ్యూనల్ ఏర్పాటు చేయాలని సూచించింది.