24 గంటల ప్రజాసేవ చేస్తున్న ఖాకీకి వారానికి ఒక రోజు సెలవు తప్పనిసరి చేయాలి: కంచరన కిరణ్ కుమార్
KPS డిజిటల్ మీడియా నెట్వర్క్, విశాఖపట్నం :- పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది మరియు అధికారులకు వారానికి ఒక రోజు సెలవు ప్రకటించి, వారి ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం మరియు మానసిక ప్రశాంతతకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలని ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు కంచరన కిరణ్ కుమార్ ప్రభుత్వాన్ని కోరారు.
పోలీసు సిబ్బంది ప్రజల భద్రత కోసం నిరంతరం విధులు నిర్వహిస్తూ, పండుగలు, సెలవు రోజులు అనే తేడా లేకుండా సేవలందిస్తున్నారని ఆయన అన్నారు. నిరంతర విధుల కారణంగా పోలీసులపై పని ఒత్తిడి పెరుగుతోందని పేర్కొన్నారు.
పోలీసు సిబ్బందికి వారానికి ఒక రోజు సెలవు కల్పించడం ద్వారా వారు తమ కుటుంబంతో సమయం గడపడంతో పాటు, శారీరకంగా మరియు మానసికంగా విశ్రాంతి పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. తద్వారా విధుల్లో మరింత సమర్థవంతంగా, ఉత్సాహంగా సేవలందించగలరని అన్నారు.
ప్రజల రక్షణ కోసం అహర్నిశలు కష్టపడుతున్న పోలీసుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని వారానికి ఒక రోజు సెలవు విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని కంచరన కిరణ్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

