ఆంధ్రప్రదేశ్

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్… టీడీపీకి ఝలక్

ఏపీ : ఏపీలో బీజేపీ పాగా వేసేందుకు ఎన్నో ఏళ్లుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అయితే అనూహ్యంగా తెలంగాణలో బీజేపీ పుంజుకోవడమే కాదు, గట్టి పోటీ కూడా ఇచ్చేలా ఉంది. ఇది బీజేపీ హైకమాండ్ ని ఆలోచించేలా చేసింది. ఎందుకు ఆంధ్రాలో ప్రయత్నించకూడదని చేసే ప్రయత్నాల్లో భాగంగానే ఎన్టీఆర్ రూ.100 వెండినాణెం విడుదల చేయడమని అంటున్నారు.

ఎన్టీఆర్ అభిమానులను తమ వైపు తిప్పుకునేలా వ్యూహరచన చేసిందని అంటున్నారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని రూ.100 వెండి నాణాన్ని ముద్రించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఆర్బీఐ కూడా ఆమోదించింది. ఈ నేపథ్యంలోనే మింట్ అధికారులు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను కలవడం చర్చనీయాంశమైంది.

ఇదిలా ఉంటే ఈ వ్యూహాన్ని అమలు చేసే బాధ్యతను బీజేపీ నాయకురాలు పురంధేశ్వరిపై హైకమాండ్ మోపింది. దీంతో శతజయంతి ఉత్సవాలను ఏడాదిపాటు ఘనంగా చేసేందుకు ఆమె సన్నాహాలు చేస్తున్నారు.

ఇదంతా బాగానే ఉంది. మరి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను కాదని పురంధేశ్వరి చేస్తే ఎంతవరకు జనాదరణ ఉంటుందనేది ఒక ప్రశ్న. అలాగే ఇంతవరకు వారెవరూ ముందుకు వచ్చి ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలపై మాట్లాడింది లేదు. కాకపోతే అక్కడ తారకరత్న ఆసుపత్రిలో ఉండటంతో ఆ టెన్షన్ లో ఉన్నామని చెప్పినా చెబుతారు.

అంతేకాదు ఇది బీజేపీ రాజకీయ వ్యూహం కాబట్టి…చంద్రబాబునాయుడు ఏ స్టాండ్ తీసుకుంటారో, దానిని బట్టి కూడా స్పందిస్తారని ఒక టాక్ వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే జనసేనతో కలిసి బీజేపీ ఎలాగైనా తెలుగుదేశంతో కలిసి పనిచేస్తుందనే భావనతో ఉన్న చంద్రబాబుకి ఇది అశనిపాతమే అంటున్నారు. బీజేపీ మాత్రం ఒంటరిగానే ఆంధ్రాలో పోటీ చేస్తామనే బలమైన సంకేతాలు రూ.100 ఎన్టీఆర్ వెండి నాణెం ద్వారా పంపించినట్టయ్యింది. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో ఎలా ముందుకి వెళ్లాలనేది చంద్రబాబుకి పెద్ద సమస్యగా మారుతుందని కూడా అంటున్నారు.

మరి ఎన్టీఆర్ ఫ్యాన్స్ బీజేపీ వైపు వెళతారా? రూ.100 వెండి నాణెం ముద్రించగానే మొగ్గు చూపుతారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకు ముందు కాపు నేతలను దగ్గరకి తీసుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు చేసి, జనసేన పవన్ కల్యాణ్ కి స్నేహ హస్తం అందించింది. ఈ టైమ్ లో జనసేనకి ఉన్న పరిస్థితుల నేపథ్యంలో పవన్ కల్యాణ్ చంద్రబాబు వైపు తిరిగారు. ఇప్పటికే బీజేపీ- చంద్రబాబు మధ్య వైరం నడవడంతో ఈ మూడు ముక్కలాటలో రెండు అటువైపు, బీజేపీ ఇటు వైపు ఉండిపోయాయి.

ఎన్టీఆర్ అనే ఫేస్ ఎన్నికల స్టంట్ గా అందరూ వాడతారనే అభిప్రాయం అందరిలో ఉంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో చూస్తే ఎన్నికల సమయంలో, మహానాడు సభల్లో, జయంతి, వర్థంతి రోజుల్లో రాష్ట్రమంతా ప్రత్యేక కార్యక్రమంగా నిర్వహించడం ఆనవాయితీగా ఉంది.ఆ రోజున చిన్నా పెద్దా నేతలంతా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి గౌరవిస్తుంటారు. ఇది టీడీపీ స్ట్రాటజీగా ఉంది.

ఇదే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని తమ వైపు తిప్పుకునేందుకు వైసీపీ కూడా ప్రయత్నించింది. ఆ క్రమంలో ఏపీలో జిల్లాలను పెంచేటప్పుడు పనిలో పనిగా క్రష్ణా జిల్లాకు ఎన్టీఆర్ జిల్లాగా నామకరణం చేసి ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేసింది.

అది చంద్రబాబుకి కొంత ఇబ్బందికరంగా కూడా మారింది. ఎందుకంటే 14 ఏళ్లు అధికారంలో ఉండి కూడా ఎన్టీఆర్ పేరుని జిల్లాకు పెట్టలేదనే అపనిందని కూడా మోయాల్సి వచ్చింది. ఇదే క్రమంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్చి, వైఎస్సార్ పేరు పెట్టడంతో వచ్చిన పేరంతా తుడిచిపెట్టుకుపోయిందని ఒక వర్గం అంటున్నారు.

మొత్తానికి బీజేపీ కూడా ఎన్టీఆర్ అస్త్రాన్ని తీయడం చూస్తుంటే… గేమ్ సీరియస్ గానే ఉందని అంటున్నారు.

Leave a Reply