జాతీయ వార్తలు

జనసేనాని ఢిల్లీ టూర్.. ఢిల్లీ పెద్దలతో సమావేశం.. ఆ విషయంలో క్లారిటీ వస్తుందా..

ఢిల్లీ : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ప్రధాని మోదీతో పాటు.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షులు జెపి.నడ్డాతో పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికి ఆంధ్రప్రదేశ్‌లో జనసేన, బీజేపీ అధికారికంగా పొత్తులో ఉన్నప్పటికి.. రెండు పార్టీల నాయకుల మధ్య సఖ్యత ఉన్నట్లు కన్పించడం లేదు. పవన్‌ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో వెళ్లే అవకాశాలున్నాయనే ప్రచారానికి తోడు.. ఇటీవల జరిగిన పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల్లో జనసేన సహకరించలేదనే బీజేపీ నాయకులే వ్యాఖ్యానించడంతో ఆ రెండు పార్టీల మధ్య పొత్తు ఉన్నా.. లేనట్లే మసులుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా జనసేనాని ఢిల్లీ వెళ్లడం, బీజేపీ పెద్దలను కలవనుండటం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. బీజేపీ ఢిల్లీ పెద్దలే పవన్‌ కళ్యాణ్‌ను పిలిచారా.. లేదా జనసేనాని అపాయింట్‌మెంట్‌ కోరారా అనే విషయంలో క్లారిటీ లేనప్పటికి పవన్‌ హస్తిన పర్యటన మాత్రం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.

బీజేపీ పెద్దలతో ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులను పవన్‌ కళ్యాణ్‌ చర్చించనున్నారు. అలాగే వచ్చే ఎన్నికల్లో పొత్తులు.. తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్లడం వంటి అంశాలపై పవన్‌ స్పష్టత కోరనున్నట్లు తెలుస్తోంది. టీడీపీతో కలిసి వెళ్లేందుకు బీజేపీ సుముఖత వ్యక్తం చేస్తే 2014 కాంబినేషన్‌ను కంటిన్యూ చేస్తూ ఈ సారి జనసేన కొన్ని స్థానాల్లో పోటీ చేసే ఆలోచనలో ఉంది. ఒక వేళ బీజేపీ టీడీపీతో కలిసే ప్రసక్తే లేదని చెబితే.. బీజేపీతో జట్టుకు కటీఫ్ చెప్పి.. తెలుగుదేశంతో వెళ్లే విషయంలో పవన్‌ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. తన మనసులోని ఆలోచనలను ఢిల్లీ పెద్దలకు వివరించి.. కొన్ని అంశాల్లో స్పష్టత తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

Leave a Reply