ఆంధ్రప్రదేశ్

విశాఖ నడిబొడ్డులో దారుణం.. రూరల్ ఫస్ట్ మెజిస్ట్రేట్ దారుణ హత్య

KPS డిజిటల్ నెట్‌వర్క్, విశాఖ :- ఏపీ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌ లో మండల మెజిస్ట్రేట్ హత్య.. అలా అని ఏ మారుమూలనో.. నిర్మానుష్య ప్రాంతలోనో కాదు. నిత్యం రద్దీగా ఉండే కొమ్మాదిలో జరిగిందీ ఘటన. కొమ్మాది అంటే నేషనల్ హైవేకి ఆనుకొని ఉంటుంది. విద్యాసంస్థలు, చిన్నచిన్న వ్యాపార స్థావరాలు, అపార్ట్‌మెంట్‌లు.. ఇలా రద్దీగా ఉన్న ప్రాంతంలో తహసీల్దార్ రమణయ్య ఇంట్లోకి దుండగులు ధైర్యంగా వెళ్లి.. చంపి దర్జాగా తిరిగొచ్చారు.

ఇది ల్యాండ్ మాఫియా పనిగా తెలుస్తోంది. గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు రమణయ్య ఇంట్లోకి చొరబడి రాడ్‌లతో దాడి చేశారు. దీంతో తహసీల్దార్ అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. ఆయనను హుటాహుటిన హాస్పిటల్‌కి తరలించారు. చికిత్స పొందుతూ రమణయ్య మృతి చెందారు. పోలీస్ కమిషనర్ రవిశంకర్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. డాగ్ స్క్వాడ్‌ని రంగంలోకి దించారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

దాడికి సంబంధించిన దృశ్యాలు అపార్ట్‌మెంట్ సెల్లార్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డు అయ్యాయి. సుమారు రాత్రి 10 గంటల 15 నిమిషాలకు ఫోన్ రావడంతో తహసీల్దార్ ఫ్లాట్ నుంచి కిందకు వెళ్లారు. అక్కడ ఓ వ్యక్తితో పది నిమిషాల పాటు సీరియస్ డిస్కషన్ జరిగింది. తర్వాత తన వెంట తెచ్చుకున్న ఐరన్ రాడ్‌తో ఆ వ్యక్తి తహసీల్దార్ తలపై బలంగా కొట్టాడు. దీంతో ఆయన అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు. రక్తపు మడుగులో పడి ఉన్న రమణయ్యను బంధువులు వెంటనే అపోలో హాస్పిటల్ కు తరలించారు. చికిత్స పొందుతూ రమణయ్య ఆస్పత్రిలో మృతి చెందాడు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్‌తో పోలీస్ కమిషనర్ రవిశంకర్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై ఆయన సీరియస్ అయ్యారు. ల్యాండ్ ఇష్యూలో బాగంగా గొడవ జరిగి ఉండొచ్చని పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో పోలీసుల గాలిస్తున్నారు.

శ్రీకాకుళం జిల్లాకు నందిగామ మండలం దిమ్మిలాడ గ్రామానికి చెందిన తహసిల్దార్ రమణయ్య ఉత్తరాంధ్రలో పలు ప్రాంతాల్లో విధులు నిర్వహించారు. వజ్రపు కొత్తూరు, పద్మనాభం, విశాఖ రూరల్ చినగదిలి మండలాల్లో ఎమ్మార్వో గా పనిచేశారు. రెండు రోజుల క్రితం విజయనగరం నగరం జిల్లా బంటుపల్లికి బదిలీ అయ్యారు. ఈ ఘటన ఎందుకు జరిగిందనేదాని కంటే ఇప్పుడు.. విశాఖలో పోలీసుల పనితీరు, ప్రజల రక్షణపైనే అనుమానాలు కలుగుతున్నాయి. ఒక ప్రభుత్వాధికారికే రక్షణ కరువైనపుడు.. ప్రజల పరిస్థితి ఏంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. విశాఖను ఏపీ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌ చెబుతారు. దాంతో పాటు.. విశాఖలో ల్యాండ్ మాఫియా ఆగడాలు గురించి కూడా తరచూ వార్తలు వింటూ ఉంటాం. కానీ.. ఈ రెండింటిలో విశాఖ పేరు బాగా వినిపించింది మాఫియా ఆగడాల ద్వారానే. ఇప్పుడు ఈ ఘటనతో మరోసారి భూదందాలకు అడ్డగా విశాఖ మారిందనడాన్ని రుజువు చేసింది.

Leave a Reply