ఆంధ్రప్రదేశ్

విడదల ఎఫెక్ట్.. మాధవి డిఫెక్ట్.. గెలుపు స్వరం ఎటువైపు ?

KPS డిజిటల్ మీడియా నెట్‌వర్క్, గుంటూరు :- గుంటూరు వెస్ట్‌ టీడీపీకి బలమైన స్థానం. గత రెండు ఎన్నికల్లో అక్కడ గెలుస్తూ వస్తున్న టీడీపీ ఈ సారి కూడా అభ్యర్ధిని మార్చింది. ఆచితూచి మహిళా అభ్యర్ధినే ఎంపిక చేసింది. రాజకీయాలకు కొత్త అయిన పిడుగురాళ్ల మాధవిని ప్రకటించింది. అయితే ఇప్పుడుటీడీపీకి కొత్త చిక్కులు ఎదురవుతున్నాయంట. అధికార వైసీపీ అభ్యర్థిగా బీసీ వర్గానికి చెందిన మంత్రి విడదల రజనీ బరిలోకి దిగడంతో టీడీపీపైనా ఒత్తిడి పెరిగింది. ఆ క్రమంలో టీడీపీ అభ్యర్థిని మారుస్తారన్న ప్రచారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అసలు ఆ నియోజకవర్గంలో టీడీపీలో అంత తడబాటు ఎందుకు?

గుంటూరు జిల్లాలోని కీలకమైన నియోజకవర్గాల్లో గుంటూరు వెస్ట్ ఒకటి. ఈ నియోజకవర్గంలో రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ బలమైన పునాదులు వేసుకుంది. వరుసగా రెండు ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధులే గెలిచారు. ఈ సారి అక్కడ ఎలాగైనా పాగా వేయాలని వైసీపీ పట్టుదలతో ఉంది. బీసీలు ఎక్కువగా ఉంటే గుంటూరు వెస్ట్‌లో అదే వర్గానికి చెంచిన మంత్రి విడుదల రజనీని బరిలోకి దింపింది వైసీపీ. ఆమె ప్రచారంలో దూసుకుపోతూ అన్ని వర్గాలను ఆకట్టుకునే పనిలో పడ్డారు.

వైసీపీ నుంచి బలమైనటువంటి అభ్యర్థిగా బరిలోకి నిలిచిన విడుదల రజినీని ఎదుర్కోవడానికి.. టీడీపీ పెద్ద కసరత్తే చేసింది .. అక్కడ టీడీపీ నుంచి గెలిచిన మద్దాల గిరి వైసీపీ బాట పట్టడంతో కొత్త కేండెట్ కోసం వెతికింది …అనేక సర్వేలు చేయించుకుని పార్టీలో పార్టీలో సమాలోచనలు జరిపి.. పొలిటికల్‌గా రకరకాల లెక్కలు వేసుకుని గుంటూరు సిటీలో గుర్తింపు ఉన్న వికాస్ హస్పటల్స్ డైరెక్టర్ పిడుగురాళ మాధవిని అభ్యర్థిగా ప్రకటించింది. అనూహ్యంగా కొత్త ముఖమైన పిడుగురాళ్ల మాధవిని అభ్యర్థిగా ప్రకటించడంతో ఆ సీటు ఆశించిన నేతలు షాక్ తిన్నారంట. తమకు అవకాశం వచ్చుంటే బాగుండేదని తమ కేడర్ దగ్గర ఆవేదన వ్యక్తం చేస్తున్నారంట.

అదలా ఉంటే ఎన్నికల ప్రచారం మొదలుపెట్టిన మాధవి ఓటర్లను పెద్దగా ప్రభావితం చేయలేకపోతున్నారని.. మంత్రి రజిని దూకుడుకి అడ్డుకట్ట వేయటంలో ఇబ్బంది పడుతున్నారని.. అధిష్టానం దృష్టికి వెళ్లినట్లు తెలుస్తోంది. మరోసారి పార్టీ శ్రేణుల అభిప్రాయం తెలుసుకుంటూ.. స్థానిక నేతలతో కూడా టీడీపీ పెద్దలు సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్తున్నారు మాధవి ప్రచారతీరు ఎలా ఉంది? రజనీని ఎదుర్కోవడానికి అమె సరిపోతారా? ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మాధవి విజయావకాశాలు ఎలా ఉన్నాయి? పార్టీ శ్రేణులు కొత్త అభ్యర్ధిపై ఏ అభిప్రాయంతో ఉన్నాయి? వంటి అంశాలపై పార్టీ పెద్దలు ఆరా తీస్తున్నారంట.

ఆ అభిప్రాయ సేకరణలో మాధవీకి మైనస్ మార్కులే వస్తున్నాయంటున్నారు. అక్కడి లోకల్ లీడర్లు ఆమె తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తునట్లు చెప్తున్నారు. ఒక వైపు రజినీ తనదైన స్టైల్లో దూకుడు ప్రదర్శిస్తుంటే.. మాధవి ప్రజలను ఆకట్టుకునే విధంగా మాట్లాడటంలో కానీ.. కార్యకర్తల్లో జోష్ పెంచే విషయంలో కానీ సక్సెస్ అవ్వలేకపోతున్నారన్న సమాచారం పార్టీ పెద్దలకు చేరిందంట.. గుంటూరు ఎంపీ స్థానం నుంచి పోటీలో ఉన్న టీడీపీ అభ్యర్ధి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రచారంలో దూసుకెళ్తున్నా.. మాధవి ఆయనతో సమన్వయం చేసుకోలేకపోతున్నారని స్థానిక నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారంట.

మరి ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ పెద్దలు మాధవి దూకుడుగా ముందుకు వెళ్లడానికి యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తారా? లేకపోతే రజనీని ధీటుగా ఎదుర్కునే మరో బలమైన నేతని రంగంలోకి దింపుతారా? అన్న చర్చ మొదలైంది.. మాధవిని సెలెక్ట్ చేసే ముందు టీడీపీ అధిష్టానం చాలా ఎక్సర్‌సైజ్ చేసినట్లే కనిపించింది. పార్టీలో మిగిలిన ఆశావహుల విజయ అవకాశాలపై అంచనాలకు వచ్చాకే .. మాధవి అభ్యర్ధిత్వాన్ని ప్రకటించింది. అయితే ఇప్పుడు అందుతున్న గ్రౌండ్ రిపోర్టులతో చంద్రబాబు టీం పునరాలోచనలో పడిందంటున్నారు. ఎంపీ అభ్యర్థిగా పెమ్మసాని ప్రజల్లోకి దూసుకు వెళ్తున్న తీరుపై సంతోషంగా ఉన్నప్పటికీ.. వెస్ట్ అభ్యర్థి విషయం పార్టీ పెద్దలకు అంతుపట్టడం లేదంట.. మొత్తానికి కంచుకోట లాంటి సీటు ఇప్పుడు టీడీపీకి కత్తిమీద సాములా మారినట్లు కనిపిస్తోంది. ఈ నెల 25 నామినేషన్లకు చివరి తేదీ కావడంతో గెజిట్ నోటిఫికేషన్ వచ్చేనాటికి టీడీపీ నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.

Leave a Reply