ఆంధ్రప్రదేశ్

మంగళగిరి లో గెలుపెవరిది..

KPS డిజిటల్ మీడియా నెట్‌వర్క్, మంగళగిరి :- కృష్ణా, గుంటూరు జిల్లాల సరిహద్దుగా ఉండే మంగళగిరి అసెంబ్లీ సెగ్మెంట్ పొలిటికల్‌గా అందరి ద‌ృష్టిని ఆకర్షిస్తుంది. టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్ రెండో సారి అక్కడి నుంచి పోటీ చేస్తుండటంతో ఆ నియోజకవర్గం అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. మంగళగిరిలో లోకేశ్‌ను రెండో సారి కూడా ఓడిస్తామని వైసీపీ ధీమా వ్యక్తం చేస్తుంది. అయితే లోకేశ్ ఈ సారి ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో కనిపిస్తున్నారు. కొన్ని రోజులుగా మంగళగిరిలోనే తిష్ట వేసి ఇంటింటికి తిరుగుతూ ఎక్కడికక్కడ ప్రజాసమస్యలు తెలుసుకుంటూ ప్రచారం నిర్వహిస్తున్నారు.

ఈ సారి జనసేన, బీజేపీలతో పొత్తు, వైసీపీలో విభేదాలు తనకు కలిసి వస్తాయన్న నమ్మకంతో కనిపిస్తున్నారు. లోకేశ్ మరోసారిజగన్ స్లోగన్ వైనాట్ 175లో మొదటి, రెండవ స్థానాల్లో ఉండేవి కుప్పం, మంగళగిరి నియోజకవర్గాలే అని వైసీపీ శ్రేణులు ధీమాగా చెబుతున్నాయి. కుప్పంలో చంద్రబాబును, మంగళగిరిలో లోకేష్‌ను ఓడించి తీరుతామని ఛాలెంజ్‌లు చేస్తున్నాయి. అయితే వచ్చే ఎన్నికల్లో మంగళగిరి అసెంబ్లీ స్థానం నుంచి 53 వేల ఓట్ల మెజారిటీతో గెలుస్తానని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

2019 ఎన్నికల్లో మంగళగిరి నుంచి ఓడిపోయిన లోకేశ్ ఈ సారి నియోజవర్గం మారతారన్న ప్రచారం జరిగింది. అయితే ఓడినా నియోజకవర్గానికి టచ్‌లోనే ఉన్న ఆయన వీలు దొరికినప్పుడల్లా మంగళగిరి వాసులతో మమేకమయ్యే ప్రయత్నం చేస్తూనే వచ్చారు. ఈ సారి లోకేశ్ పెనమలూరు నుంచి పోటీ చేస్తారన్న ఊహాగానాలను కొట్టిపారేస్తూ మంగళగిరిలోనే అమితుమీ తేల్చుకోవడానికి సిద్దమయ్యారు.

వాస్తవానికి లోకేశ్ స్థాయి నేత ఖచ్చితంగా గెలుస్తామనుకునే సీటుకి మారడం ఈజీనే .. ఆయన ఎక్కడ నుంచి పోటీ చేయాలనుకున్నా పార్టీ నేతలు అభ్యంతరపెట్టే పరిస్థితి ఉండదు. అయితే నియోజకవర్గం మారితే పారిపోయారని వైసీపీ ప్రచారం చేస్తుంది. అది ఇష్టం లేని లోకేశ్ మంగళగిరికే ఫిక్స్ అయ్యారంట.. అదీకాక ఇంటర్నల్‌గా చేయించుకున్న సర్వేలు, పార్టీ పరంగా వచ్చిన గ్రౌండ్ రిపోర్టులు ఆయనకు అనుకూలంగా వచ్చాయంటున్నారు

యువగళం పాదయాత్రతో రాష్ట్రాన్ని చుట్టి వచ్చిన లోకేశ్ గత కొద్ది రోజులుగా మంగళగిరిలోనే ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆయన ఇంటింటికి తిరుగుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారుఉండవల్లి కరకట్ట మీద ఉన్న నివాసం నుంచి ఉదయాన్నే బయలుదేరి.. మంగళగిరిలో వివిధ వర్గాలను కలుస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు .. స్ట్రీట్ మీటింగులు పెడుతూ సమస్యలు తెలుసుకుంటూ స్వయంగా వినతిపత్రాలు స్వీకరిస్తున్నారు.. గతంలో ఎన్నడూ లేని విధంగా లోకేష్ మంగళగిరికే పరిమితం అవ్వడం, ఆయన ప్రచారం చేస్తున్న తీరు పార్టీ వర్గాలనే ఆశ్చర్యపరుస్తుందంట.

ఈసారి లోకేష్‌కు గెలుపు ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. ఎమ్మెల్సీగా చంద్రబాబు కేబినెట్లో పనిచేసిన ఆయన.. ప్రత్యక్ష రాజకీయాల్లో సత్తా చాటుకోవాల్సి ఉంది. గత ఎన్నికల్లో ఓటమితో నేర్చుకున్న పాఠాలతో ఈ సారి మంగళగిరికే టైం కేటాయిస్తూ సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ప్రజలు తమలో ఒకడు అనుకునేలా వ్యవహరిస్తూ.. సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి హామీలిస్తున్నారు. అదే టైంలో వైసీపీని టార్గెట్ చేస్తున్నారు.

మంగళగిరిలో టీడీపీ ఆవిర్భావ సమయంలో 1983, 85 ఎన్నికల్లో గెలిచింది టీడీపీ .. ఇక ఆ తర్వాత అక్కడ ఆ పార్టీ పోటీ చేసిందే లేదు. 1989 నుంచి పొత్తుల లెక్కలతో ఆ సీటు మిత్రపక్షాలకే వెళ్లింది. 2014లో టీడీపీ అభ్యర్ధిగా గంజి చిరంజీవి పోటీ చేసే వరకు అంటే పాతికేళ్లు అక్కడ టీడీపీ కేడర్‌కి పెద్ద దిక్కులేకుండా పోయింది. గత ఎన్నికల్లో పోటీ చేసి 5 వేల ఓట్ల తేడాతో ఓడిపోయిన లోకేశ్ లక్షకి పైగా ఓట్లు దక్కించుకున్నారంటే అక్కడ టీడీపీ కేడర్ బలం అర్థమవుతుంది.

వైసీపీ విషయానికి వస్తే గత పాతికేళ్లుగా మంగళగిరి ఎమ్మెల్యేగా గెలిచిన ముగ్గురూ ఆ పార్టీలోనే ఉన్నారు. మురుగుడు హనుమంతరావు 1999, 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచి , వైఎస్ కేబినెట్లో పనిచేశారు. 2009లో ఆయన రాజకీయ వారసురాలిగా కాండ్రుకమల కాంగ్రెస్ అభ్యర్ధిగా విజయం సాధించారు. ఇక ఆ తర్వాత వైసీపీ నుంచి ఆళ్ల రామకృష్ణారెడ్డి వరుసగా రెండు సార్లు గెలిచారు. ఆ ముగ్గురు ఇప్పుడు వైసీపీలో కొనసాగుతున్నారు.

ఈ సారి మంగళగిరి సీటు బీసీలకు కేటాయించాలని జగన్ నిర్ణయించడంతో .. అలిగిన ఎమ్మెల్యే ఆర్కే వైసీపీకి రాజీనామా చేసి.. కొన్ని రోజులు కాంగ్రెస్‌లో షర్మిల వెంట తిరిగారు. తర్వాత తనదైన లెక్కలతో మళ్లీ వైసీపీలోకి వచ్చారు. ఈ ఎన్నికల్లో లోకేశ్ పోటీలో ఉండరన్న ఉద్దేశంతో మంగళగిరి టీడీపీ టికెట్ ఆశించి కాండ్రు కమల పసుపు కండువా కప్పుకున్నారు.. అయితే లోకేశ్ మంగళగిరికే ఫిక్స్ అవ్వడంతో ఆమె వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావు. ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్సీగా, ఎథిక్స్‌ కమిటీ చైర్మన్‌గా కొనసాగుతున్నారు.

కాండ్రు కమల కుమార్తె, హునుమంతరావు కోడలు అయిన మురుగుడు లావణ్య వైసీపీ అభ్యర్ధిగా మంగళగిరి బరిలో నిలిచారు. మంగళగిరిలో బలంగా ఉన్న చేనేత వర్గానికి చెందిన ఫ్యామిలీ అవ్వడంతో బీసీ కోటాలో ఆమెకు టికెట్ కేటాయించారు జగన్ అదలా ఉంటే అదే బీసీ కోటాలో ముందుగా చేనేత వర్గాల్లో పట్టున్న గంజి చిరంజీవిని మంగళగిరి ఇన్చార్జ్‌గా ప్రకటించింది వైసీపీ .. టీడీపీలో మంగళగిరి మున్సిపల్ చైర్మన్‌గా పనిచేసిన చిరంజీవి వైసీపీలో చేరిన రోజుల వ్యవధిలోనే ఆప్కో ఛైర్మన్‌గానియమించి తర్వాత ఇన్చార్జ్‌ని చేసింది. అయితే తనకు మంగళగిరి టికెట్ దక్కకపోవడంతో ఆయన వైసీపీ కార్యకలాపాల్లో కనిపించడం లేదంట.

2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఆర్కే చేతిలో కేవలం 12 ఓట్ల తేడాతో ఓడిపోయారు గంజి చిరంజీవి.. అలాంటాయన వైసీపీలో చేరి ఇప్పుడు సైలెంట్ అవ్వడంతో వైసీపీ శ్రేణుల్లో గుబులు కనిపిస్తోంది. అయితే ఎమ్మెల్యే ఆర్కే మాత్రం లావణ్యను గెలిపించి జగన్‌కు గిఫ్ట్‌గా ఇస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మంగళగిరిలో మరోసారి తన లక్‌ను పరీక్షించుకుంటున్న లోకేశ్ ఈ సారి ఎలాగైనా గెలవాలన్ని కసితో ఉన్నారు. మరి మంగళగిరి ఓటర్ల జడ్జ్‌మెంట్ ఎలా ఉంటుందో చూడాలి.

Leave a Reply