ఆంధ్రప్రదేశ్

అసలుకే ఎసరు?

KPS డిజిటల్ మీడియా నెట్‌వర్క్, ఆంధ్రప్రదేశ్ :- వైసీపీకి గట్టి పట్టున్న రాయలసీమలో రెండు సెగ్మెంట్లను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది వైసీపీ.. అనంతపురం రాజకీయాల్లో ఒక్క మగాడు అనిపించుకుంటున్న నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం, చంద్రబాబునాయుడు ఎనిమిదో సారి పోటీ చేస్తున్న కుప్పంలపై జగన్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఆ రెండు సెగ్మెంట్లలో ఈ సారి ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఉన్న వైసీపీ అధ్యక్షుడు.. ఆ బాధ్యతలను మంత్రి పెద్దిరెడ్డికి అప్పగించారు. దాంతో పెద్దిరెడ్డి తన సొంత నియోజకవర్గం కంటే వాటివైనే ఎక్కువ కసరత్తు చేయాల్సి వస్తోందంట. అయితే అక్కడ వైసీపీలో మారిపోతున్న సమీకరణలు ఆయన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయంటున్నారు.

వైసీపీ అధ్యక్షుడు జగన్ రాయలసీమలో టీడీపీ కంచుకోటలు కుప్పం, హిందూపురం సెగ్మెంట్లో ఈ సారి ఎలాగైనా తమ జెండా పాతాలని తహతహలాడుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో ఆయన్ని ఓడించాలని పట్టుదలగా ఉన్నారు. టీడీపీ స్థాపించినప్పటి నుంచి కుప్పం ఓటర్లు మరో పార్టీకి ఛాన్స్ ఇవ్వలేదు. 1983, 85 ఎన్నికల్లో అక్కడ టీడీపీ నుంచి రంగస్వామినాయుడు గెలుపొందారు. ఇక 1989 నుంచి కుప్పంలో చంద్రబాబు పాగా వేశారు. వరుసగా ఏడు సార్లు విజయం సాధించి రికార్డ్ సృష్టించారు.

అయితే గత ఎన్నికల్లో చంద్రబాబు మెజార్టీ గణనీయంగా తగ్గింది. 30 వేల 722 ఓట్లకే పరిమితమైంది. ఆ ఎఫెక్ట్ చిత్తూరు ఎంపీ స్థానంపై కూడా రిఫ్లెక్ట్ అయింది. ఇక తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పంలో టీడీపీ గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కుప్పం మున్సిపాల్టీ సహా. పలు పంచాయతీల్లో పరాజయం పాలైంది. ఆ లెక్కలతో ఇక కుప్పంలో చంద్రబాబు పనైపోయిందని ఈ సారి అక్కడ గెలిచేది తమ పార్టీనేనని జగన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఆ క్రమంలో కుప్పంలో వైసీపీ అభ్యర్ధిగా స్థానికుడైన కేజే భరత్‌ను రెండేళ్ల క్రితమే ప్రకటించి ఆయనకు ఎమ్మెల్సీ పదవి కూడా కట్టబెట్టారు జగన్ .. గెలిస్తే భరత్‌ను మంత్రిని చేస్తానని కూడా ప్రకటించారు. భరత్‌ను గెలిపించే బాధ్యతను మంత్రి పెద్దిరెడ్డికి అప్పగించారు. అయితే ఒక దశ చంద్రబాబుపై పోటీకి భరత్ సరిపోరన్న ఉద్దేశంతో పెద్దిరెడ్డే కుప్పం బరిలో దిగుతారని ప్రచారం జరిగింది. అయితే చివరికి భరత్ పోటీలో నిలిచారు.

మరోవైపు చంద్రబాబు కుప్పం నుంచి పోటీని ఎప్పుడూ సీనియస్‌గా తీసుకోలేదు. అంతా స్థానికంగా ఉన్న చంద్రబాబు సొంత మనుషులు చక్కబెట్టేస్తూ వచ్చారు. ఏడాదికోసారి సంక్రాంతికి కుటుంబంతో సహా ఇక్కడికి వచ్చి చంద్రబాబు అందరినీ ఓసారి పలకరించి వెళ్లిపోయేవారు. ఏడు సార్లు గెలిచినప్పటికీ ఎన్నికల సమయంలో కూడా చంద్రబాబు కుప్పం వచ్చిన దాఖలాలు పెద్దగా కనిపించవు. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కుప్పంపై జగన్ ఫోకస్ పెట్టడంతో చంద్రబాబుతో పాటు భువనేశ్వరి, లోకేశ్‌లు పర్యటిస్తుండటంతో కుప్పం టీడీపీ శ్రేణులు మరింత యాక్టివ్ అవుతున్నాయి. చంద్రబాబుని లక్షమెజార్టీతో గెలిపిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

ఇక నందమూరి హీరో బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందుపురంపై కూడా జగన్ స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు. అక్కడ వైసీపీ అభ్యర్ధిని గెలిపించే బాధ్యతలు కూడా పెద్దిరెడ్డికే కట్టబెట్టారు. టీడీపీ పుట్టినప్పటి నుంచి అక్కడ టీడీపీ ఓడిందే లేదు. ఎన్టీఆర్‌ను మూడు సార్లు గెలిపించిన అక్కడి ఓటర్లు. తర్వాత నందమూరి హరికృష్ణను కూడా అసెంబ్లీకి పంపారు. గత రెండు ఎన్నికల్లో బాలయ్య వరుస విజయాలతో హిందూపురం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.

టీడీపీ అనేక సంక్షోభాలను, ఆటుపోట్లను ఎదుర్కొన్న సమయంలో కూడా హిందూపురం నియోజకవర్గ ప్రజలు తెలుగుదేశం అభ్యర్థినే ఆదరించారు. నందమూరి కుటుంబానికి చెందిన వారినే కాదు టీడీపీ తరపున ఎవరు పోటీ చేసినా పట్టం కట్టారు. ఎన్టీఆర్ మరణానంతరం 1999లో చంద్రబాబు సారథ్యంలో జరిగిన ఎన్నికల్లో సీసీ వెంకటరాయుడ్ని గెలిపించారు. 2004లో పామిశెట్టి రంగనాయకులు, 2009లో పి.అబ్దుల్ ఘని టీడీపీ నుంచే హిందూపురం ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు.

2019లో వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభంజనం సృష్టించినప్పుడు కూడా హిందూపురంలో మాత్రం పసుపు జెండానే ఎగిరింది. టీడీపీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన నందమూరి బాలకృష్ణ తన సమీప ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థి అయిన ఇక్భాల్‌పై 14,028 ఓట్ల మెజారిటీతో గెలుపొందడం గమనార్హం. గత ఎన్నికల్లో కొన్ని కీలక నియోజకవర్గాల్లో టీడీపీ బొటాబొటీ మెజారిటీతో గట్టెక్కగా హిందూపురం నియోజకవర్గంలో మాత్రం అంత మెజారిటీ రావడంతో పార్టీ అక్కడ క్షేత్రస్థాయిలో ఎంత బలంగా ఉందో అర్థమవుతుంది.

టీడీపీ అంత బలంగా ఉన్న చోట వైసీపీ‌కి రీసెంట్‌గా పెద్ద షాక్ తగిలింది. ఎమ్మెల్సీ ప‌ద‌వికి, వైసీపీకి షేక్ మహ్మద్ ఇక్బాల్ రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆయ‌న ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కు లేఖ రాశారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు మండలి చైర్మన్‌కు సైతం ఇక్బాల్ ఫ్యాక్స్‌తో పాటు ఈ-మెయిల్ పంపించారు. మ‌రో మూడేళ్లు ఎమ్మెల్సీ పదవి ఉన్నప్పటికీ.. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

ఇక్బాల్ త్వరలోనే పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. హిందూపురం అభ్యర్ధిగా బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసుకునే దీపికను బరిలోకి దింపింది వైసీపీ.. పెద్దిరెడ్డి రికమండేషన్‌తోనే ఆమెకు టికెట్ ఇచ్చారంట. దీపికను గెలిపించుకునే బాధ్యత తనదేనని జగన్‌కు భరోసా ఇచ్చి ఆమెకు టికెట్ ఇప్పించుకున్నారంట. దీపికకు హిందూపురం ఇన్చార్జ్ బాధ్యతలు కట్టబెట్టినప్పుడే ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ ఎదురుదాడికి దిగారు. నాలుగేళ్లు ఇన్చార్జ్‌గా ఉన్న తనను తప్పించడం ఏంటని అప్పట్లో ఫైర్ అయ్యారు .. ఆ తర్వాత కొద్ది రోజులు సైలెంట్ అయి మళ్లీ ఇన్నాళ్లకు సడన్ గా రాజీనామా అస్త్రం సంధించారు

ఒక్క మహమ్మద్ ఇక్బాల్ మాత్రమే కాక హిందూపురం వైసీపీలో అనేక వర్గాలు కనిపిస్తాయి. 2014లో బాలయ్య పోటీ చేసి ఓడిపోయిన నవీన్ నీశ్చాల్, దివంగత చౌలురు రామకృష్ణారెడ్డి వర్గం మునిసిపల్ చైర్మన్ ఇంద్రజ గ్రూపు.. ఇలా ఎవరికి వారు సొంత అజెండా నడిపిస్తుంటారు. అలాంటి చోట రాజకీయాలకు కొత్త అయిన దీపికను బరిలో దింపి బాలయ్యకు చెక్ పెడతానంటోంది వైసీపీ.. మరి చూడాలి హ్యాట్రిక్ గ్యారెంటీ అంటున్న ఆయన స్పీడ్‌కి ఎలా బ్రేక్ వేస్తారో.

Leave a Reply