ఆంధ్రప్రదేశ్

గ్రూపులుగా చీలిపోయిన వైసీపీ శ్రేణులు

KPS డిజిటల్ మీడియా నెట్‌వర్క్, తాడికొండ :- రాజధాని అమరావతిలో కీలక నియోజకవర్గం తాడికొండ వైసీపీలో వర్గ విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. లోకల్ సీనియర్ లీడర్లు ఎవరికి వారే అన్నట్లు వ్యవహరిస్తుండటంతో వైసీపీ అభ్యర్ధి మేకతోటి సుచరిత ఎన్నికల ప్రచారంలో ఎదురీదుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అక్కడ టికెట్ ఆశించిన సీనియర్లు అంటీముట్టనట్లు వ్యవహరిస్తుండటంతో వారి కేడర్ కూడా సైలెంట్ అయిపోయిందంట. మరోవైపు అమరావతి రాజధానిపై నెలకొన్న గందరగోళంతో అక్కడ భూములిచ్చిన రైతులు అధికారపక్షంపై రగిలిపోతున్నారు. దాంతో అసలే నియోజకవర్గం మారి వచ్చిన మాజీ మంత్రి సుచరిత.. దిక్కులు చూడాల్సి వస్తుందంటున్నారు.

అమరావతి రాజధానిలో కీలక నియోజకవర్గం తాడికొండ. రాష్ట్ర సెక్ట్రటేరియట్, అసెంబ్లీ, హైకోర్టులు టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ సెగ్మెంట్లోనే ఏర్పాటయ్యాయి. అయితే ఆ ఎస్సీ రిజర్వ్‌డ్ సెగ్మెంట్లో గత ఎన్నికల్లో అనూహ్యంగా వైసీపీ గెలిచింది. టీడీపీ అధినేత చంద్రబాబుపై నమ్మకంతో రాజధానికి భూములు ఇచ్చామన్న తాడికొండ రైతులు ఆ ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన ఉండవల్లి శ్రీదేవిని గెలిపించారు. తర్వాత పరిణామాలతో వైసీపీలో తనకు టికెట్ దక్కదని గ్రహించిన శ్రీదేవి.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో సొంత పార్టీకి ఝలక్ ఇచ్చి సస్పెండ్ అయ్యారు. టీడీపీ బాట పట్టిన ఆమెపై ఈ మధ్యే అనర్హత వేటు పడి మాజీ అయ్యారు.

ప్రస్తుతం ఎమ్మెల్యే లేని తాడికొండ నియోజకవర్గంలో ఇంతకాలం ఉండవల్లి శ్రీదేవి వెంట నడిచిన వైసీపీ శ్రేణులు ఇప్పుడు ఎవరి దారి వారు చూసుకున్నారు. మూడు రాజధానులంటూ అమరావతి అభివృద్ధిని జగన్ సర్కారు అటకెక్కించడంతో.. రాజధానికి భూములిచ్చిన రైతులు, వారి సంబంధీకులు టీడీపీ బాట పట్టారు. మిగిలిన వైసీపీ శ్రేణులు కొత్తగా వచ్చిన మేకతోటి సుచరిత వైపు చూస్తున్నాయి. ఈ ఎన్నికల్లో వైసీపీ అధ్యక్షుడు జగన్ తాడికొండను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారంట.

మరోసారి తాడికొండలో తన అభ్యర్ధిని గెలిపించుకుని.. మూడు రాజధానుల నిర్ణయానికి బలం చేకూర్చుకోవడంతో పాటు.. అమరావతి వాసులు కూడా దానికి అనుకూలంగా ఉన్నట్లు నిరూపించుకోవాలని చూస్తున్నారంట. మరోవైపు టీడీపీ కూడా తాడికొండ నియోజకవర్గంలో గెలిచి తాడికొండలో గెలిచి అమరావతిని అభివృద్ధిబాట పడిస్తానంటోది. గతంలో ఖచ్చితంగా గెలుస్తామనుకున్న ఆ సెగ్మెంట్లో ఓడిపోవడంతో ఈ సారి పక్కా వ్యూహంతో ముందుకెళ్తోంది. తాడికొండ సీటు అనేక మంది ఆశించినప్పటికీ.. అక్కడ టీడీపీ ఇన్చార్జ్‌గా ఉన్న మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌పైనే నమ్మకం ఉంచి టికెట్ ఇచ్చింది.

అమరావతి ప్రాంతంలో జరుగుతున్న రైతు ఉద్యమానికి ముందు నుంచి మద్దతిస్తున్న టీడీపీ. ఈసారి తప్పకుండా విజయం సాధిస్తామన్న ధీమా వ్యక్తం చేస్తుంది. అయితే తాడికొండ వైసీపీలో ఆ పరిస్థితి కనిపించడం లేదంటున్నారు. గత ఎన్నికల సమయంలో కలిసి పనిచేసిన వైసీపీ శ్రేణులు వర్గాలు విడిపోయాయి. ఉండవల్లి శ్రీదేవి ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచే ఆ పార్టీలో గ్రూపులు ఏర్పడ్డాయి. తాడికొండ వైసీపీ కేడర్ ఎమ్మెల్యే శ్రీదేవి వర్గం, ఎంపీ నందిగామ సురేష్ వర్గాలుగా విడిపోయింది.

ప్రస్తుతం శ్రీదేవి పోటీలో లేనప్పటికీ నందిగం సురేష్ బాపట్ల ఎంపీ అభ్యర్ధిగా తిరిగి పోటీ చేస్తున్నారు. బాపట్ల ఎంపీ సీటు పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రచారం చేస్తున్న నందిగం సురేష్ తాడికొండపై మాత్రం దృష్టిపెట్టడం లేదంట. మరోవైపు తాడికొండ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సీనియర్ నేత డొక్కా మాణిక్యవరప్రసాద్‌ను వైసీపీ ఇన్చార్జ్‌గా నియమించడంతో ఆయన కూడా టికెట్‌పై ఆశలు పెట్టుకున్నారు. అయితే ఆయన్ని తప్పించిన జగన్ ప్రత్తిపాడు ఎమ్మెల్యే సుచరితను తాడికొండకు షిఫ్ట్ చేశారు.

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ ఎమ్మెల్సీగా పనిచేసి తర్వాత వైసీపీలోకి వచ్చిన డొక్కా మాణిక్యవరప్రసాద్. ఆశించిన టికెట్ దక్కకపోవడంతో.. సుచరితకు ఏ మాత్రం సహకరించడం లేదంట. ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్సీగా కొనసాగుతున్న డొక్కా.. అసలు తాను వైసీపీలో లేనట్లే వ్యవహరిస్తున్నారంట.. సీనియర్ నేతగా తాడికొండలో డొక్కాకి ఉన్న పరిచయాలు , అందరికీ సుపరిచితుడు అవ్వడం తనకు కలిసి వస్తుందని సుచరిత లెక్కలు వేసుకుంటే.. ఆయన అపరిచితుడిలా దూరంగా ఉండటం మాజీ హోంమంత్రికి మింగుడుపడటం లేదంట.

మాణిక్య వరప్రసాద్ తాడికొండలో సామాజిక సాధికార యాత్ర జరిగినప్పుడే వైసీపీపై అసంతృప్తితో కనిపించారు. సీఎం జగన్ అపాయింట్‌మెంట్ ఇప్పించాలని.. అప్పట్లో బహిరంగంగానే వ్యాఖ్యానించారు .. అయితే తర్వాత కూడా జగన్‌ను కలిసే అవకాశం దక్కకపోవడంతో పార్టీ వ్యవహారాలకు దూరమయ్యారు. అసలు వైసీపీ కార్యక్రమాల్లో కనిపించడమే మానేశారు. దాంతో ఆయన రేపు ఏపీలో మళ్లీ పవర్ ఛేంజ్ అయితే పార్టీ మారడానికి రెడీ అయ్యారన్న ప్రచారం జరుగుతోంది.

ఇప్పటకిప్పుడు పార్టీ మారే పరిస్థితులు లేకపోవడంతో.. డొక్కా సైలెంట్‌గా తన పనులు తాను చేసుకుంటున్నారంట. మొత్తానికి ప్రత్తిపాడులో మూడు సార్లు గెలిచి.. ఈ సారి తాడికొండకు వచ్చిన మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత ఒంటరి పోరాటం చేయాల్సి వస్తోందంట. ఎన్నికలకు ఇంకా టైం ఉండటంతో ఆ ఎక్స్ మినిస్టర్ వ్యూహాలు ఎలా ఉంటాయో చూడాలి.

Leave a Reply