అంతర్జాతీయ వార్తలు

క్రూయిజ్ మిస్సైల్‌ను పరీక్షించిన ఉత్తర కొరియా

ప్యోంగ్యాంగ్‌ : సుదీర్ఘ దూరం ప్రయాణించే క్రూయిజ్ మిస్సైల్‌ను నార్త్ కొరియా పరీక్షించింది. జపాన్‌ను తాకే సామర్థ్యం ఆ క్షిపణికి ఉన్నట్లు తెలిపారు. సుమారు 1500 కిలోమీటర్ల దూరం వరకు ఆ క్షిపణి ప్రయాణించగలదని కేసీఎన్ఏ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. ఆహార కొరత, ఆర్థిక సంక్షోభం ఉన్నా.. ఉత్తర కొరియా మాత్రం అత్యాధునిక ఆయుధాలను పరీక్షిస్తూనే ఉన్నది. తాజా పరీక్షల పట్ల అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు అమెరికా మిలిటరీ పేర్కొన్నది. జపాన్ కూడా ఆందోళన వ్యక్తం చేసింది.

లాంచ్ వెహికిల్ నుంచి మిస్సైల్‌ను పరీక్షించినట్లు ఉత్తర కొరియాకు చెందిన రొడాంగ్ సిన్‌మున్ పత్రిక ఓ ఫోటోను ప్రచురించింది. ఆ క్షిపణులకు వ్యూహాత్మక ప్రాముఖ్యత ఉన్నట్లు కేసీఎన్ఏ తన నివేదికలో తెలిపింది. శని, ఆదివారాల్లో మిస్సైల్ పరీక్షలు జరిగినట్లు తెలుస్తోంది. లాంగ్ రేంజ్ క్రూయిజ్ మిస్సైల్ అణ్వాయుధాలను కూడా మోసుకెళ్లగలదు అని ఉత్తర కొరియా విశ్లేషకులు అంకిత్ పాండా తెలిపారు. క్రూయిజ్ మిస్సైళ్ల కన్నా బాలెస్టిక్ మిస్సైళ్లతో ప్రమాదం ఎక్కువగా ఉంటుందని యూఎన్ భద్రతా మండలి తెలిపింది.

Leave a Reply